
తాడేపల్లి : కళ్యాణదుర్గం ఎమ్మెల్యే దారుణాలకు దిగారని, మద్యం దుకాణాలపై కమీషనల్ల గుంజుతున్నారని మాజీ ఎంపీ తలారి రంగయ్య మండిపడ్డారు. ఇతరులకు వచ్చిన మద్యం షాపుల్ని సైతం లాగేసుకున్నారని ధ్వజమెత్తారు. భారీ స్థాయిలో మద్యం షాపుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని, కళ్యాణదుర్గంలో ఎక్కడ చూసినా కళ్యాణి వైన్స్ అనే పేరుతోనే మద్యం షాపులు ఎలా ఉన్నాయి? అని ప్రశ్నించారు.
ఈ రోజు(గురువారం, జూలై 17) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన తలారి రంగయ్య.. ‘ దినేష్ అనే సాధారణ వ్యక్తికి వచ్చిన మద్యం షాపుని కూడా లాగేసుకున్నారు. ఒక ప్రజాసంఘాల నాయకుడిని సైతం బెదిరించి తమవైపు తిప్పుకున్న చరిత్ర స్థానిక ఎమ్మెల్యేది. కళ్యాణదుర్గంలో మూడు వేల బెల్టు షాపులు ఏర్పాటయితే ప్రభుత్వం ఏం చేస్తోంది?, నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అందిస్తానని చెప్పిన సీఎంలను గతంలో చూశాం.
కానీ నాణ్యమైన మద్యం అందిస్తానని చెప్పిన ఏకైక సీఎం చంద్రబాబు మాత్రమే. గ్రామాల్లో మంచినీరు దొరకటం లేదుగానీ మద్యం మాత్రం పుష్కలంగా దొరుకుతుంది. బెల్టుషాపుల కోసం వేలం వేసి రూ.12 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ప్రతి మద్యం సీసా మీద అధికంగా వసూలు చేస్తుంటే ఎక్సైజ్ శాఖ చోద్యం చూస్తోంది. మద్యం తాగి వాహనాలు నడుపుతూ జనం చనిపోతున్నారు. అయినా ప్రభుత్వానికి ఏం పట్టడం లేదు
బెల్టు షాపులు పెడితే బెండు తీస్తానన్న చంద్రబాబు ఇప్పుడు ఏం చేస్తున్నారు?, రీకాల్ చంద్రబాబూస్ మేనిఫెస్టో కార్యక్రమంలో క్యూఆర్‌కోడ్ స్కాన్ చేస్తుంటే దానిపై దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలన్నీ కట్ అయిపోతాయంటూ జనాన్ని భయపెడుతున్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే దారుణంగా వ్యవహరిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.