breaking news
PAMARRU constituency
-
కృష్ణా జిల్లాలో విష సర్పాల కలకలం..
సాక్షి, కృష్ణా జిల్లా: పామర్రు నియోజకవర్గంలో విష సర్పాలు సంచారం కలకలం రేపుతోంది. మొవ్వ ప్రభుత్వ ఆసుపత్రిలో పాముకాటు బాధితుల సంఖ్య సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఈ ఒక్క నెలలోనే 95 మంది పాము కాటు బాధితులు ఆసుపత్రిలో చేరారు. మొవ్వ పీహెచ్సీ వైద్యాధికారి శొంఠి శివ రామకృష్ణారావు మాట్లాడుతూ బుధవారం ఒక్కరోజే తొమ్మిది పాము కాటు కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. వర్షాకాలం పొలంలో అధిక సంఖ్యలో పాములు సంచరిస్తుంటాయని.. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా పాముకాటుకు గురైతే నాటు వైద్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలని విజ్ఞప్తి చేశారు. జూలై నెలలోనే ఇప్పటివరకు అత్యధికంగా 95 పాముకాట్లు కేసులు నమోదయ్యాయని, బాధితులకు యాంటీ స్నేక్ వెనమ్ ఇంజక్షన్లు ఇచ్చామని తెలిపారు. ప్రజారోగ్యంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని పేర్కొన్నారు. కలెక్టర్ ఎండీ ఇంతియాజ్, డీఎంహెచ్‌వో రమేష్ ఆదేశాల మేరకు యాంటి స్నేక్ వెనమ్‌లను పీహెచ్సీలో అందుబాటులో ఉంచామని తెలిపారు. -
ఉప్పులేటి వాడ..అవినీతి చీడ
సాక్షి, కృష్ణా : దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి.. అన్న చందంగా సాగిపోయింది ఆ ఎమ్మెల్యే తీరు. అడ్డూ అదుపులేని అవినీతి పర్వం.. ఇసుక, బుసక, మట్టి తవ్వకాల నుంచి ప్రభుత్వ పథకాల అమలు వరకూ అన్నింటా దోచుకో, దాచుకో.. పామర్రు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన నైతిక విలువలకు తిలోదకాలిచ్చి అధికార పార్టీ పంచన చేరి అందుకున్న తాయిలాలు ఒక ఎత్తయితే.. ఆమె కనుసన్నల్లో అక్రమార్జనకు ద్వారాలు తెరుచుకున్న వైనం మరొక ఎత్తు... కనీసం నమ్మి ఓట్లేసిన దళితులను సైతం పట్టించుకోకుండా.. సొంత లాభమే అజెండాగా పాలన సాగిస్తున్న పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అవినీతి అంకంపై ‘సాక్షి’ ఫోకస్. చినబాబుకు వాటాలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు స్వస్థలం నిమ్మకూరులో అడుగడుగునా అవినీతి దర్శనమిస్తోంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో ప్రభుత్వం వివిధ పనుల కోసం రూ.15 కోట్లు విడుదల చేసింది. ఈ నిధుల్లో సుమారు రూ.7 కోట్లు అభివృద్ధి పనుల ముసుగులో తెలుగు తమ్ముళ్ల జేబుల్లోకెళ్లినట్లు తెలుస్తోంది. మండల అధ్యక్షుడు కనుసన్నల్లోనే ఈ అవినీతి జరిగినట్లు కొందరు పేర్కొంటున్నారు. ఇందులో చినబాబుకు మూడో వంతు వాటా వెళ్లినట్లు తెలుస్తోంది. చెరువు తవ్వకంలో రూ.కోటి స్వాహా.. నిమ్మకూరు గ్రామంలోకి ప్రవేశించేటప్పుడు చెరువు దర్శనమిస్తుంది. ఈ చెరువును పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్ది చెరువు మధ్యలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతామని చెప్పారు. అయితే నీరు–చెట్టు కింద నిబంధనలకు విరుద్ధంగా సుమారు 25,000 ట్రక్కుల మట్టిని తవ్వి, ఒక్కొక్క ట్రక్కు రూ.400 చొప్పున మండలాధ్యక్షుడు యథేచ్ఛగా విక్రయించుకున్నారు. దీని ద్వారా సుమారు రూ.కోటి సంపాదించారు. తన స్వస్థలంతో పాటు పక్కనే ఉన్న పోరంబోకు స్థలం సుమారు 10 సెంట్లు ఆక్రమించుకుని చెరువు మట్టితో నింపి ప్లాట్లుగా విభజించి విక్రయించుకుని మరో రూ.10 లక్షలు వెనకేసుకున్నారు. చెరువు తవ్వినందుకు మరో రూ.8 లక్షలు ప్రభుత్వం నుంచి తవ్వకం కింద తీసుకున్నారు. ఉన్న రోడ్లపైనే సిమెంట్ రోడ్లు వేసి.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే నిమ్మకూరులో సిమెంట్ రోడ్లు వేశారు. ఇప్పుడు ఆ రోడ్లపైనే సిమెంట్ పూత పూశారు. రోడ్లకు ఇరువైపులా ఒక అడుగు మేర సిమెంట్ రోడ్లు వేసి మొత్తం రోడ్లు వేసినట్లుగా చూపి సుమారు రూ.కోటిన్నర వరకు టీడీపీ నేతలు దండుకున్నారు. హాస్పిటల్ లేదు.. అనుబంధ రోడ్లు వచ్చాయి.. నిమ్మకూరు దాని చుట్టు పక్కల గ్రామాలకు కలిపి రూ.4.5 కోట్లతో 30 పడకల హాస్పటల్‌ను రెండేళ్ల కిందట అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మంజూరు చేసి శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టర్‌కు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడికి మధ్య బేరాలు కుదరక శంకుస్థాపన దశలోనే ఆస్పత్రి నిర్మాణం ఆగిపోయింది. అయితే ఈ ఆస్పత్రికి అనుబంధంగా నిమ్మకూరు–మత్రిపాలెం, నిభానుపూడి, వడ్రపూడి తదితర ప్రాంతాలను కలుపుతూ రూ.6 కోట్లతో రోడ్లు వేశారు. ఇందులో సుమారు రూ.2 కోట్ల వరకు చేతులు మారాయి. రూ.5 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరగ్గా ఇందులోనూ రూ.2 కోట్లు తెలుగు తమ్ముళ్ల ఖాతాలోకి వెళ్లాయి. అవినీతి గురించి అధికారులకు తెలిసినా సాక్షాత్తూ చిన్నబాబుతో మండల నాయకులు టచ్‌లో ఉండటంతో మౌనంగా ఉన్నారు. నిమ్మకూరు పార్టీ నాయకులే పనులు మంజూరు చేయించుకుని, వారే చేసుకుని, వారే బిల్లులు పెట్టుకున్నారని, అధికారులు కేవలం ప్రేక్షక పాత్ర పోషించారని స్థానికులు చెబుతున్నారు. కల్పన ‘కారు’ కక్కుర్తి దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ఆశతో పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకుంది. పేదలకు అందాల్సిన పథకాలను వదిలిపెట్టలేదు. కేంద్రం ఎస్సీ, ఎస్టీ యువతకు ఉపాధి కోసం ఎన్ఎస్ఎఫ్డీసీ ద్వారా సబ్సిడీపై మంజూరు చేసిన ఇన్నోవా వాహనాన్ని తన బినామీ పేరుతో తీసుకొని దర్జాగా వినియోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు పాతర.. ఎమ్మెల్యే అనుచరుడు, మువ్వా గ్రామానికి చెందిన వ్యక్తి ఎన్ఎస్ఎఫ్డీసీ పథకం ద్వారా దరఖాస్తు చేయగా దాదాపు రూ.20 లక్షల విలువైన ఇన్నోవా వాహనాన్ని మంజూరు చేశారు. ఆ వాహనాన్ని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పేరుతో ఏపీ 16 టీపీ 0661 నంబర్‌తో ఈ ఏడాది మార్చి ఒకటిన గుడివాడ ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు. అయితే రిజిస్ట్రేషన్ చేయడంలో నిబంధనలు పాటించలేదు. ట్యాక్సీ ట్రావెల్ కింద చూపి ఎల్లో ప్లేట్ ఉంచాలి. కానీ ఆ కారు నంబరు వైట్ బోర్డు కింద కేటాయించారు. ఈ తతంగం వెనుక ఎమ్మెల్యే ఉండటంతో రవాణా శాఖ అధికారులు నిబంధనలను ఉల్లంఘించి రిజిస్ట్రేషన్ చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. నీరు–చెట్టు పేరుతో50 శాతం నిధులు బొక్కేశారు కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్లు పామర్రు నియోజకవర్గంలో టీడీపీ నేతల దోపిడీ పర్వం కొనసాగింది. ఇసుక, మట్టి, మద్యం తదితరాల్లో రూ.కోట్లు దండుకున్నారు. 2015–16లో నీరు–చెట్టు పథకం కింద నియోజకవర్గంలో 15 చెరువులను రూ.3 కోట్లు వెచ్చించి తవ్వకాలు చేపట్టడం జరిగింది. ఈ పనుల్లో 50 శాతం నిధులు నొక్కేశారు. చెరువుల నుంచి తవ్విన మట్టిన సైతం రైతులకు ఉచితంగా ఇవ్వకుండా ట్రాక్టరుకు రూ.500 చొప్పున వసూలు చేశారు. తోట్లవల్లూరు మండలంలోని రొయ్యూరు ఇసుక క్వారీ అధికార పార్టీ నేతలకు కాసులవర్షం కురిపించింది. ఇసుక కోసం వచ్చే వాహనదారుల నుంచి బాట పనుల పేరుతో సుమారు ఏడాది పాటు ఆ పార్టీ నేతలు అడ్డగోలు వసూళ్లకు పాల్పడ్డారు. ఒక్కో ట్రాక్టర్ డ్రైవర్ వద్ద రూ.100 చొప్పున, రోజుకి 500 నుంచి 600 వాహనాల వద్ద డబ్బును వసూలు చేశారు. నెలకు రూ.10 లక్షల చొప్పున నాలుగున్నరేళ్లు రూ.5.20 కోట్లు తమ జేబుల్లో వేసుకున్నారు. ఇసుక అమ్మకాలకు మరో ధర నిర్ణయించి రూ.కోట్లు దండుకున్నారు. సుమారు రూ.1.20 కోట్ల సొమ్ము అధికార పార్టీ నియోజకవర్గ స్థాయి ముఖ్యనేత, దిగువ శ్రేణి నాయకులు కలిసి స్వాహా చేశారు. రొయ్యూరులోని కృష్ణా నదీ గర్భంలోని పట్టా భూముల్లో జరిగిన ఇసుక తవ్వకాల్లో కూడా అధికార పార్టీ నేతల మధ్య రూ.లక్షల్లో సొమ్ము చేతులు మారినట్లు తెలుస్తోంది. జన్మభూమి కమిటీల పేరుతో ప్రభుత్వం నుంచి అందాల్సిన కార్పొరేషన్ రుణాలు, పింఛన్లు, పక్కా గృహాలు, ఆదరణ వంటి పథకాల అమలులో తమకు అనుకూలమైన వారికే దక్కేలా తెలుగు తమ్ముళ్లు చక్రం తిప్పారు. ఈ రుణాలు ఇప్పించే పేరిట కూడా తమ్ముళ్లు వసూళ్లకు పాల్పడ్డారు. చాలా మండలాల్లో రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ముట్టజెప్పిన వారికే ఇళ్లు మంజూరు చేయిస్తామంటూ పేదల నుంచి వసూళ్లు చేశారు. ఈ మొత్తం రూ.కోటి వరకు ఉన్నట్లు తెలుస్తోంది. -
పామర్రులో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి అనిల్‌కుమార్ ప్రచారం
-
పామర్రు వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా కైలా అనిల్ కుమారు నానినేషన్
-
ఆగడాల నేత.. అంతులేని మేత
⇒ పామర్రు నియోజకవర్గంలో శృతిమించిన చోటా నేత ఆగడాలు ⇒ అడ్డు చెబితే పోలీస్ కేసులు ⇒ ప్రభుత్వ కార్యాలయం నుంచే దందాలు ⇒ అక్రమాలకు సహకరించలేదని పంచాయతీ కార్యదర్శి బదిలీ ప్రస్తుతం అక్రమ సంపాదనకు అర్హత ఏంటంటే అధికార పార్టీలో నేత కావటమే అని ప్రజలు బాహాటంగా చెప్పుకుంటున్నారు. స్థాయి ఏదైనా చాలూ అధికారం ముసుగేసుకొని అడ్డదారులు తొక్కుతున్నారు. బహిరంగంగానే దందాలు చేస్తూ పేదోళ్ల జాగాలపై గద్దల్లా వాలిపోతున్నారు. ప్రభుత్వ పథకాల అమలులో వసూళ్లు.. అభివృద్ధి పనుల్లో వాటాలు.. భూముల కబ్జాలతో వెలిగిపోతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెట్టిస్తూ బరితెగిస్తున్నారు. సాక్షి, అమరావతి బ్యూరో : తూర్పు కృష్ణా జిల్లాలోని పామర్రు నియోజకవర్గంలో అధికార పార్టీ చోటా నేతలు అక్రమ సంపాదనకు అడ్డదారులు తొక్కుతున్నారు. వారి ఆగడాలకు ప్రభుత్వ యంత్రాంగం వంత పాడుతుండడంతో చెలరేగిపోతున్నారు. ఓ మండల స్థాయి ప్రజాప్రతినిధి భర్త అధికార దర్పంతో చేస్తున్న అవినీతి చిట్టా విప్పితే ఔరా అనకమానరు. ► తెనాలికి చెందిన ఓ వ్యక్తికి మండల స్థాయి ప్రజాప్రతినిధికి చెందిన స్వగ్రామంలో 1.50 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని ఈ నేత కౌలు పేరుతో కజ్జా చేశాడు. ఖాళీ చేయమంటే, భూ యజమాని భూమి కోసం నేతల చుట్టూ తిరుగుతున్నాడు ► సీఆర్డీఏ పరిధిలో ఉండే ఆ గ్రామంలో గ్రీన్ డివైట్ లేఅవుట్ వేస్తే ఆ యజమానులను బెదిరించి ఈ నేత తన తండ్రి పేరుతో 0.12 ఎకరాల రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడన్న ఆరోపణలున్నాయి. ► అదే గ్రామంలో అనుమతి లేని లేఅవుట్ వేసినందుకు నజరానాగా రూ.10 లక్షలు వసూలు చేశాడన్న ఆరోపణలున్నాయి. ► విజయవాడ–మచిలీపట్నం రహదారి నిర్మాణంలో చోటా నేతకు సంబంధించిన పది సెంట్ల భూమిపోతే పక్కనే ఉన్న విజయవాడకు చెందిన డాక్టర్‌కు సంబంధించిన మరో మూడు సెంట్లు భూమిని కలుపుకొని ప్రభుత్వ పరిహారం తన భార్య అయిన ప్రజాప్రతినిధి పేరుతో తీసుకున్నాడు. సదరు డాక్టర్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ మూడు సెంట్లకు నగదును తిరిగి ప్రభుత్వానికి చెల్లించాడు. ► చోటా నేత స్వగ్రామంలో తన ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టేందుకు పాత విగ్రహాన్ని కొనుగోలు చేసి తన ప్రత్యర్థి దొడ్డిలో దాచి అతనిపై కేసులు నమోదు చేయించి జైలుకు పంపాడు. అయితే చివరకు కేసు ఫాల్స్ కేసుగా వీగిపోయింది. ► పామర్రులో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఆయన మేనత్త తన నివాసం రాసిస్తూ వీలునామా రాసింది. అదే ఇంటికి నకిలీ రికార్డులు సృష్టించి ఆ ఇల్లు తమదే అంటూ అతని ఇంటిపైకి అర్ధరాత్రి వెళ్లి దాడి చేసి మహిళను లాగి బయటపడేశారు. పోలీస్ స్టేషన్లో రివర్స్ కేసు వారిపై పెట్టించారు. ఈ దాడిలో మండల పార్టీ నేతతో పాటు బినామీ డీలర్ కీలకంగా వ్యవహరించాడు. ► మండల స్థాయి నేత ప్రస్తుతం నివాసముంటున్న ఇల్లు అతని భార్య మేనత్తది. ఆ ఇంటిని కజ్జా చేసేందుకు ఆ ఇంటి పన్ను తన భార్య అయిన ప్రజాప్రతినిధి పేరుతో కట్టించుకోవాలని పంచాయతీ కార్యదర్శిపై ఒత్తిడి తెచ్చారు. కుదరదని చెప్పడంతో కార్యదర్శిని బదిలీ చేయించి మరో కార్యదర్శిని వేయించుకొని అతని ద్వారా ఇంటి పన్ను కట్టించాడు. యజమాని ఇంటి కోసం పోరాడుతోంది. ► మండల పరిషత్ ద్వారా ఎస్సీ, బీసీ, ఎస్టీ కార్పొరేషన్ రుణాలు ఇప్పిస్తానని తన అనుచరులతో భారీగా వసూళ్లు చేయించాడనే ఆరోపణలు ఉన్నాయి. ► అర్ధరాత్రి వరకు మండల ప్రజాప్రతినిధికి కేటాయించిన కార్యాలయంలో తిష్ట వేసి దందాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇలా అధికారం ముసుగేసుకొని చోట నేతలు ప్రజలను బాధపెడుతున్నారు. ► మండల స్థాయి ప్రజాప్రతినిధి స్వగ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేశారని ఆ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను బహిరంగంగా కొట్టుకుంటూ రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. చివరకు ఆ అమాయకులపైనే హత్యాయత్నం కేసులు పెట్టించాడు. ► కనుమూరు గ్రామానికి చెందిన ఎస్సీ రాష్ట్ర నాయకుడు గ్రామాభివృద్ధి కోసం రూరల్ డెవలప్మెంట్ (ఆర్డీఎఫ్) స్కీమ్ ద్వారా రూ.80 లక్షలు నిధులు కేటాయిస్తే ఆ పనులు చేసే కాంట్రాక్టర్‌ను బెదిరించి 5 శాతం కమీషన్ పుచ్చుకున్నాడు.