breaking news
Padmavati temple
-
ప్రముఖ నటి ఇంటి స్థలంలో ఆలయ నిర్మాణం
చెన్నె: కొన్నేళ్ల కిందట ప్రముఖ నటి దానం చేసిన స్థలంలో త్వరలో పద్మావతి అమ్మవారి ఆలయం నిర్మాణం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈనెల 13వ తేదీన ఆలయ నిర్మాణ పనులు భూమి పూజతో ప్రారంభం కానున్నాయి. ఇంతకు ఆ స్థలాన్ని ఎవరో ఇచ్చారో తెలుసా.. అలనాటి నటి కాంచన. ఆ స్థలం విలువ ఇప్పుడు రూ.30 కోట్ల వరకు ఉంటుంది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈనెల 13వ తేదీన పద్మావతి అమ్మవారి ఆలయానికి భూమి పూజ జరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు శేఖర్ రెడ్డి తెలిపారు. చెన్నెలో గురువారం ఆయన మీడియాతో ఆలయ వివరాలు తెలిపారు. సినీ నటి కాంచన చెన్నెలోని టి.నగర్లో ఇచ్చిన స్థలంలోనే పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణం చేపడుతామని చెప్పారు. ఆలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పాల్గొంటారని వివరించారు. అయితే ఆలయ నిర్మాణానికి దాదాపు రూ.6 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు శేఖర్ రెడ్డి తెలిపారు. రాతి కట్టడం కోసం అదనంగా మరో రూ.1.10 కోట్లు అవసరమవుతాయని చెప్పారు. ఈ అదనపు ఖర్చును తాను భరిస్తానని ప్రకటించారు. ఇంతకీ నటి కాంచన ఎవరో తెలుసా.. అర్జున్ రెడ్డి సినిమాలో హీరో విజయ్‌కు నాన్నమ్మగా నటించిన ఆమెనే కాంచన. బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఎన్నో చేశారు. -
సూర్య, చంద్రులపై వెంకన్న విహారం
నారాయణవనం, న్యూస్‌లైన్ : బ్రహ్మోత్సవాల్లో భాగంగా పద్మావతి సమేత కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆదివారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై ఊరేగారు. వేకువజామున 5 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ, నిత్యకట్ల, శుద్ధి, గంట తదితర కార్యక్రమాలను అర్చకులు పూర్తి చేశారు. 8.30 గంటలకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై గ్రామోత్సవంలో పాల్గొని భక్తుల నుంచి హారతులు అందుకున్నారు. ఆలయానికి చేరుకున్న స్వామికి ఉభయ నాంచారులతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం కైంకర్యాల అనంతరం ఊంజల్ సేవ చేశారు. రాత్రి 8 గంటల కు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో హరినాథ్, సూపరింటెండెంట్ పీతాంబరరాజు, ఆలయాధికారి బాలనరసింహరావు, సహాయకులు వీరయ్య, షరాబులు మణి, గోవిందస్వామి పాల్గొన్నారు. రాత్రి 10 గంటలకు స్వామికి ఏకాంత సేవ నిర్వహించారు. నేడు వెంకన్న రథోత్సవం పద్మావతి సమేత కల్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీధరభట్టాచార్య తెలిపారు. ఉదయం 7.20 గంటలకు రథోత్సవం ప్రారంభమవుతుందని చెప్పారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని శ్రీవారికి 40 అడుగుల చెక్క రథాన్ని ముస్తాబు చేశారు. వివిధ రకాల దేవతా ప్రతిమలు, రంగుల వస్త్రాలు, పుష్ప హారాలతో సుందరంగా అలంకరించారు. ఆదివారం ఉదయం ఆలయంలో రథ కలశానికి ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం రాత్రి 8 గంటలకు నిర్వహించే ఆర్జిత కల్యాణోత్సవంలో రూ.500 చెల్లించి దంపతులు పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.