ఆ దేశంతో కలిసిపోతాం: మోల్డోవా
రష్యా ముప్పుతో ఓ యూరోపియన్ దేశం మరో దేశంలో విలీనం కావాలని భావిస్తోంది. 1918–1940 కాలంలో రొమేనియాలో భాగంగా ఉన్న మోల్డోవా.. తిరిగి రొమేనియాలో విలీనం కావాలని ప్రయత్నిస్తోంది. మోల్డోవా అధ్యక్షురాలు మాయా సంధు తమ అభిమతాన్ని బయటపెట్టారు. ఇటీవల ఒక ప్రకటనలో “ఒక వేళ రిఫరెండమ్ జరిగితే విలీనానికి అనుకూలంగా ఓటు వేస్తానని” తెలిపారు. రష్యా ముప్పును ఎదుర్కోవడానికి ఇదే మార్గమని ఆమె భావిస్తున్నారు.ఉక్రెయిన్, రొమేనియా మధ్యలో ఉండే ఒక చిన్న దేశం మోల్డోవా. దీని జనాభా సుమారు 26 లక్షల వరకు ఉంటుంది. అయితే అధ్యక్షురాలి నిర్ణయంపై మోల్డోవా ప్రజల్లో మాత్రం భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోల్డోవాలోని ట్రాన్స్నిస్ట్రియా రష్యాకు చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. ట్రాన్స్డ్నీస్టర్ అని కూడా పిలిచే ఈ ప్రాంతం మోల్డోవా-ఉక్రెయిన్ సరిహద్దు, డ్నీస్టర్ నది మధ్యన ఉంటుంది. ఇక్కడ నాలుగున్నర లక్షల మందికి పైగా నివసిస్తున్నారు. వీరిలో సంప్రదాయ మోల్డోవాన్ల కంటే రష్యన్, ఉక్రేనియన్ సంతతికి చెందిన ప్రజలు అధికంగా ఉన్నారు.అంతర్జాతీయ సమాజం ట్రాన్స్నిస్ట్రియాను మోల్డోవా భాగంగా పరిగణిస్తున్నప్పటికీ 1992 నుండి తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉంది. ఇక్కడ 1,500 కంటే ఎక్కువ రష్యన్ సైనికులు ఉన్న సైనిక స్థావరాలు ఉన్నాయి. వీటిని మోల్డోవా లోపలి భద్రత కోసం శాంతి పరిరక్షకులుగా వ్యవహరిస్తారని అధికారులు పేర్కొంటున్నారు. కానీ రిపోర్టుల ప్రకారం, రష్యా దక్షిణ ఉక్రెయిన్ ను ఆక్రమించి ట్రాన్స్‌నిస్ట్రియాకు చేరే మార్గం కోసం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇది ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా రష్యాకు లాజిస్టికల్ పైచేయిని అందించవచ్చు.మరో వైపు మోల్డోవాకు ఇప్పటివరకు నాటోలో కానీ, యూరోపియన్ యూనియన్‌లో కానీ సభ్యత్వం పొందలేదు. ఈ దేశం గతంలో రష్యన్ సామ్రాజ్యం, తర్వాత సోవియట్ యూనియన్ అధికారంలో ఉండేది. 1990ల నుండి, మోల్డోవా రష్యా ప్రభావం నుండి దూరంగా ఉంటూ, ఐరోపా వైపు ప్రయత్నాలు చేస్తోంది. యూరోపియన్ యూనియన్ సభ్యత్వానికి దరఖాస్తు చేసింది.