breaking news
misterious deaths
-
సాఫ్ట్వేర్ ఇంజినీర్ తనూజ మృతి కేసులో కీలక సమాచారం వెలుగులోకి..
సాక్షి, విజయవాడ: తనూజ మృతి కేసులో విజయవాడ పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం తనూజపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని, యాక్సిడెంట్‌గా నిర్ధారించారు. తనూజను గుంటూరు నుంచి కుంచనపల్లి వద్ద ఆమె స్నేహితుడు దింపి వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఆమె మృతికి.. స్నేహితుడికి ఎటువంటి సంబంధం లేదని పోలీసులు తేల్చారు. కుంచనపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగితే ఎవరైనా శిఖామణి సెంటర్‌కు తీసుకువచ్చారా.. లేదా శిఖామణి సెంటర్లో యాక్సిడెంట్ జరిగిందా, ఇక్కడకు ఎందుకు వచ్చింది అన్న కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. కుంచనపల్లి వద్ద సీసీ పుటేజ్‌ను సేకరించారు. తనూజ పోస్టుమార్టం రిపోర్టులో బలమైన వాహనం వేగంగా గుద్దినట్లు తేలింది. శరీరంలో పలుచోట్ల, ఇంటర్నల్ గాయాలు, బ్లీడింగ్ కూడా అవుతున్నట్లు గుర్తించారు. ఇదిలా ఉండగా, మృతురాలి కుటుంబ సభ్యులు తనూజ మృతిపై ఎవరిపైనా తమకు ఎలాంటి అనుమానం లేదని చెప్పినట్లు సమాచారం. చదవండి: (తనూజ కేసు: విజయవాడ ఎందుకు వచ్చింది..?) -
ఓ అమ్మయి కన్నీటి గాథ.. ఆరు ప్రేతాత్మలు ఆరేళ్లపాటు వేధించి.. అతి క్రూరంగా..!!
The Real Story Behind ‘The Exorcism of Emily Rose’ Is More Terrifying Than the Movie: దేవుడి ప్రస్తావన వచ్చినప్పుడల్లా దెయ్యం ఉనికి గురించీ వింటూనే ఉన్నాం.. నమ్ముతూనే ఉన్నాం. ఆ వినికిడి సారాంశం, నమ్మకపు ప్రభావం..‘దెయ్యాలు క్రూరమైన వి, విచక్షణ లేకుండా ప్రవర్తిస్తుంటాయి.. వాటికి దేవుడంటే భయం’ అని! కానీ దైవశక్తికి సైతం లొంగని ఆరు ప్రేతాత్మలు.. ఆరేళ్ల పాటు ఓ అమ్మాయి శరీరాన్ని ఆవహించి, అనుక్షణం నరకయాతన పెట్టాయి. చివరికి క్రూరంగా చంపేశాయి. 2005లో ప్రపంచాన్ని వణికించిన ‘ది ఎక్సార్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్’ అనే సినిమా కల్పిత కథ కాదు, 1976లో ముగిసిన ఓ అమ్మాయి నిజ జీవిత వ్యథ. జర్మనీ చరిత్రలో సంచలనంగా మిగిలిన ‘అన్నెలీస్ మిషెల్’ కన్నీటి గాథ నేటికీ ఓ మిస్టరీనే. ఉన్నట్టుండి నవ్వడం, క్రూరంగా చూడటం.. ఎంతటి బలవంతుడినైనా ఒంటిచేత్తో నొక్కిపెట్టి కదలకుండా చెయ్యగలగడం, పైకి లేచి చేతులు చాచి.. వికృతంగా ప్రవర్తించడం, తనని తాను బాధించుకోవడం.. కాళ్లతో పాటు చేతులనూ ఉపయోగించి మెట్లు దిగడం.. మనిషి మొత్తం రకరకాల మెలికలు తిరగడం.. ఇదంతా నేటి హారర్ చిత్రాల్లో సాధారణంగా కనిపించే దృశ్యాలు.కానీ దెయ్యం ఆవహిస్తే అలాగే ప్రవర్తిస్తారు అని మొదటిసారిగా ప్రపంచానికి తెలిసింది మాత్రం అన్నెలీస్ని చూసినప్పుడే! అన్నెలీస్.. పశ్చిమ జర్మనీ, బవేరియాలోని లీబ్లిఫింగ్లో 1952, సెప్టెంబర్ 21న పుట్టింది. జోసెఫ్, అన్నా మిషెల్ ఆమె తల్లిదండ్రులు. వాళ్లు రోమన్ కేథలిక్స్. అన్నెకు ముగ్గురు సోదరీమణులు. చిన్ననాటి నుంచి దైవభక్తి కలిగిన ఆమె.. తల్లిదండ్రులతో పాటు వారంలో రెండుసార్లు చర్చికి హాజరయ్యేది. అలాంటి అన్నె.. ఉన్నట్టుండి దేవుడ్ని ద్వేషించడం మొదలుపెట్టింది. ఆమెకు 16 ఏళ్ల వయసులో అకస్మాత్తుగా ఆరోగ్యం దెబ్బతింది. వ్యాధి లక్షణాలను బట్టి మూర్ఛగా, మానసిక రుగ్మతగా గుర్తించిన వైద్యులు.. ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించారు. ‘ఆత్మలు కనిపిస్తున్నాయి’ అంటూ భయపడసాగింది అన్నె. అదంతా వ్యాధి లక్షణాల్లో భాగమే అన్నారు వైద్యులు. దేవుడ్ని ప్రార్థిస్తున్న సమయంలో ఎవరో.. ‘నువ్వు నరకంలో కుళ్లిపోతున్నావు’ అంటున్నారని చెప్పేది ఆ అమ్మాయి. దాన్నీ మానసిక సమస్యగానే పరిగణించారు. కాలక్రమేణా జీసస్ చిత్రాన్ని చూసినా, శిలువను చూసినా వింతవింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. దైవక్షేత్రాల్లోకి వెళ్లాలంటే భయపడేది. బలవంతంగా ప్రార్థన స్థలాలకు తీసుకుని వెళ్తే.. నేల కాలిపోతోంది, కాళ్లు మంటలు పుడుతున్నాయనేది. అన్నె ప్రవర్తన చూసిన ఆమె స్నేహితులకు, కుటుంబసభ్యులకు ‘ఆమెను ఆత్మ ఆవహించిందా?’ అనే అనుమానం బలపడింది. అదే భయంతో అన్నెకు భూతవైద్యం అందించాలని చర్చి ఫాదర్ ఎర్నస్ట్ అల్ట్ను ఆశ్రయించారు. అయితే అప్పటికే భూతవైద్యంపై కఠిన నియమాలు ఉండటంతో వెంటనే అనుమతి లభించలేదు. చివరికి.. అన్నె స్వయంగా అల్ట్కు లేఖ రాసింది. ‘నాకు ఆరోగ్యంగా జీవించాలనుంది. నా గురించి ప్రార్థించండి. జనుల కోసం బాధను అనుభవిస్తాను. కానీ, ఈ నరకం చాలా భయానకంగా ఉంది. తట్టుకోలేకపోతున్నాను’ అంటూ. అది చదివిన ఫాదర్ అల్ట్ మనసు కరిగి, ఆ లేఖను బిషప్ జోసెఫ్ స్తంగల్కు చూపించారు. దాంతో బిషప్.. ప్రీస్ట్ ఆర్నాల్డ్ రెంజ్‌కు భూత వైద్యం చేసేందుకు అనుమతి ఇచ్చాడు. కానీ ఇదంతా రహస్యంగా జరగాలని ఆదేశించారు. 1975 సెప్టెంబర్ 24 నుంచి అన్నెకు మందులు ఇవ్వడం మానేసి, భూతవైద్యం మొదలుపెట్టారు. మొత్తం వైద్యపద్ధతిని, అన్నె ప్రవర్తనని.. వీడియోల రూపంలో, ఆడియోల రూపంలో రికార్డ్ చేశారు. నేటికీ వాటిని నెట్లో వినొచ్చు, చూడొచ్చు. ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆరు గొంతులు వినిపించేవి. అవి ప్రేతాత్మలవని గుర్తించారు భూతవైద్యులు. వాటి పేర్లు లుసీఫర్, కైన్, జుదాస్ ఇస్క్రీయాట్, బెలీయల్, లెజియాన్, నెరో అని తేల్చారు. కానీ వాటిని అన్నె శరీరంలో నుంచి వెళ్లగొట్టడంలో విఫలమయ్యారు. వారానికి రెండు మూడు రోజులు 4 గంటల చొప్పున.. 67 సార్లు ఆమెకు భూతవైద్యాన్ని అందించారు. అయినా ఫలితం లేదు. ఆ నరకం భరించలేక అన్నె 1976, జులై 1న తన 23వ ఏట చనిపోయింది. అప్పుడే ప్రపంచం అన్నే కథవైపు తిరిగి చూసింది. ఈ మరణానికి బిషప్ ఆదేశాలతో చేసిన భూత వైద్యమే కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు. అందుకు సహకరించిన అన్నె తల్లిదండ్రులనూ అరెస్ట్ చేశారు. అన్నె సుమారు 10 నెలలు ఆహారం తినలేదని, పౌష్టికాహార లోపంతో ఆమె చనిపోయిందని, ఎముకలన్నీ ఛిద్రమై, మాంసం ముద్దలా మారిందని, కేవలం 30 కేజీల బరువు ఉందని పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది. ఆమెను ప్రేతాత్మలు ఆవహించాయని చెప్పేందుకు.. భూతవైద్యులు రికార్డు చేసిన వీడియో, ఆడియో టేపులను కోర్టు ముందు ఉంచడంతో.. అవే వారిని కాపాడాయి. అన్నె తన మూత్రాన్ని తానే తాగేదని, తనని తాను గాయపరచుకొనేదని సాక్షులు తెలిపారు. తల్లిదండ్రులు తెచ్చిన ఆహారాన్ని విసిరికొట్టడం, అన్నే వింతగా ప్రవర్తించడం అన్నింటికీ సాక్ష్యాలు ఉండటంతో కోర్టు నమ్మింది. అందరినీ విడుదల చేసింది. ‘ప్రేతాత్మల కారణంగా చనిపోవడంతో పద్ధతి ప్రకారం అంత్యక్రియలు చెయ్యలేకపోయాం.. మరోసారి ఆ అవకాశం ఇవ్వాలి’ అని కోర్టుని కోరారు అన్నె తల్లిదండ్రులు. కోర్టు అంగీకారంతో.. రెండేళ్ల తర్వాత ఆమె అస్థికలను బయటకు తీసి మరో నాణ్యమైన శవపేటికలో పెట్టి పూడ్చిపెట్టారు. అన్నె అనారోగ్యంతో బాధపడుతుంటే భూతవైద్యం చేసి, తిండిపెట్టకుండా చంపేశారని, తల్లిదండ్రుల ఒత్తిడి, కఠిన నియమాలు, చాదస్తం కారణంగానే అన్నె పిచ్చిదైందనే పలు విమర్శలు వచ్చాయి. సరిగ్గా 37 ఏళ్ల తర్వాత 2013, జూన్ 6న అన్నెలీస్ మిషెల్ నివాసమున్న ఇల్లు అగ్నికి ఆహుతి అయ్యింది. ఎవరూలేని ఇంట్లో మంటలు ఎలా వ్యాపించాయనేది మరో మిస్టరీ. పైగా ఆ మంటల్లో తమకు అన్నెలీస్ ఆత్మ కనిపించిందని స్థానికులు ఫొటోలు, వీడియోలు షేర్ చేయడం సంచలనమైంది. దాంతో ఈ కథ మరోసారి తెర మీద కొచ్చింది. సంఖ్యాశాస్త్రం ప్రకారం.. ఆరవ నెల, ఆరవ తేదీ.. 2013లోని అంకెలు కలిపితే ఆరు, కాబట్టి.. ‘666 అనే నంబర్ దెయ్యాల సంఖ్య’ అంటూ మీడియా కూడా అప్పట్లో ప్రచారం చేసింది. దాంతో అగ్నిప్రమాదానికి కారణం ప్రేతాత్మలేనని కొందరు భయాందోళనలకు గురయ్యారు. మరికొందరు కొట్టిపారేశారు. - సంహిత నిమ్మన చదవండి: Crime Story: తన హత్యకు తానే పథకం వేసుకున్నాడు.. ద్రోహి! -
బురారీ మిస్టరీ : పెట్ డాగ్ డెడ్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బురారీ ఆత్మహత్యల కేసులో, మరో గుండె బద్దలయ్యే సంఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో కీలకంగా మారి.. ఆ కుటుంబంలో ప్రాణాలతో మిగిలి ఉన్న ఏకైక ప్రాణి, పెట్ డాగ్ ‘టామీ’ హార్ట్ అటాక్‌తో మరణించింది. నోయిడా జంతు సంరక్షణ కేంద్రంలో ఉంటున్న ఈ పెట్ డాగ్ మరణించినట్టు హిందూస్తాన్ టైమ్స్ రిపోర్టు చేసింది. బురారీ కుటుంబం హత్యకు గురైనప్పుడు, ఈ పెట్ డాగ్ తీవ్ర జ్వరంతో టెర్రస్‌పై వణుకుతూ కనిపించింది. కుటుంబ సభ్యులంతా ఆత్మహత్యకు యత్నించే సమయంలో ఆ పెట్ డాగ్‌ను గ్రిల్‌కు కట్టేసి ఉంచారు. మీడియా ద్వారా ఈ పెట్ డాగ్ గురించి తెలుసుకు సంజయ్ మొహపాత్ర అనే జంతు హక్కుల పోరాట కార్యకర్త దానిని పోలీసుల అనుమతితో తన జంతు సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు. అయితే తొలుత ఆ డాగ్ చాలా కోపంగా ఉండేదని, ఎవరిని దగ్గరికి రాణించేదని కాదని అతను మీడియాకు తెలిపారు. ఈ కేసును అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు పెట్ డాగ్ సైగల నుంచి కూడా మరింత సమాచారన్ని రాబట్టే ప్రయత్నం చేశారు. ‘ఈ డాగ్‌కు అంతకముందు నుంచే పలు అనారోగ్య సమస్యలు ఉండి ఉంటాయి. వారికి తెలిసి ఉండకపోవచ్చు. బురారీ ట్రాజెడీ అనంతరం ఈ డాగ్‌ను కొత్త వాతావరణంలోకి తీసుకురావాల్సి వచ్చింది. అయితే ఇన్ని రోజులు వారి ప్రేమ, ఆప్యాయల మధ్య జీవించిన ఈ పెట్ డాగ్, కొత్త వాతావరణానికి అలవాటు కాలేకపోయింది. దీంతో దీని ఆరోగ్యం మరింత క్షీణించింది’ అని జంతు సంరక్షణ అధికారి చెప్పారు. కాగ, ఇటీవల ఢిల్లీలోని బురారీలో పదకొండు మంది ఆత్మహత్యలకు పాల్పడ్డ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఒకే ఇంట్లో 10 మంది ఇంట్లోని సీలింగ్‌కు ఉన్న ఇనుప కమ్మీలకు ఉరివేసుకోగా.. భాటియా ఇంటి పెద్ద నారాయణ్ దేవీ గొంతు తెగి రక్తపు మడుగులో కనిపించింది. ఈ కేసుపై విచారణ చేపడుతున్న పోలీసులు, వారి ఇంట్లో కొన్ని రాత పూర్వక నోట్లను కూడా గుర్తించారు. ఈ పత్రాలను బట్టి కుటుంబం మొత్తం తాంత్రిక పూజల్లో పాల్గొనేదని, అందులో రాసిపెట్టినట్లుగానే వాళ్లు ఉరి వేసుకుని చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
ఎయిర్‌లైన్స్ ఉద్యోగి అనుమానస్పద మృతి
శంషాబాద్ : ప్రైవేటు ఎయిర్‌లైన్స్ ఉద్యోగి అనుమానస్పదంగా మృతిచెందిన సంఘటన శంషాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన జోసెఫ్(28) ఎయిర్‌పోర్టులోని ఎయిర్‌లైన్స్‌లో ఆరు సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నాడు. తోటి ఉద్యోగులతో కలిసి పట్టణంలోని మధురానగర్ కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు నివాసముంటున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం స్నేహితుడికి ఫోన్ చేసి తాళం చెవి తీసుకుని గదికి వెళ్లాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా నాలుగో అంతస్థు నుంచి జోసఫ్ కిందపడడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తోటి ఉద్యోగిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. జోసఫ్ కిందపడి మృతిచెందిన సమయంలో అతడి ఒంటిపై బనియన్, డ్రాయర్ మాత్రమే ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరితోనైనా ఘర్షణ పడ్డాడా? ప్రమాదవశాత్తు జారిపడ్డాడా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. -
'ఆ నిందితులవి సహజ మరణాలే'
భోపాల్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మధ్యప్రదేశ్ పరీక్షల కుంభకోణంలో నిందితులుగా ఉంటూ మరణించినవారి సంఖ్య 24కు పెరిగింది. తాజాగా ఇండోర్ జైలులో ఉన్న నరేంద్ర సింగ్ తోమర్ ఆదివారం అనుమానాస్సద రీతిలో మరణించారు. ఇదే కేసులో మరో నిందితుడైన మధ్యప్రదేశ్ గవర్నర్ రాం నరేశ్ యాదవ్ కుమారుడు శైలేష్ యాదవ్ గత మార్చిలో చినిపోయారు. నిందితులు, సాక్షులు కలిపి ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధం ఉన్న 40 మంది మృత్యువాతపడ్డారు. అయితే ఈ మరణాలన్నీ సహజమైనవేనని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించేది లేదని మధ్యప్రదేశ్ హోం మంత్రి బాబూలాల్ గౌర్ సోమవారం తేల్చిచెప్పారు. 2009లో వెలుగులోకి వచ్చిన మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (ఎంపీపీఈబీ) కుంభకోణంలో అనేక మంది బడా రాజకీయ నేతల హస్తం ఉదని అప్పట్లో ఆరోపణలు గుప్పుమన్నాయి. దీంతో కేసును దర్యాప్తు చేసేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిట్ ను నియమించింది. అయితే కేసుతో సంబంధం ఉన్న 40 మంది మరణించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతోన్నాయి. దరిమిలా దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని విపక్షాలు పట్టుపట్టాయి. కానీ సర్కార్ అందుకు నిరాకరిస్తోంది.