breaking news
lankelapalem
-
లంకెలపాలెం నుంచి మధురవాడ వరకు ట్రా‘ఫికర్’ లేకుండా..
సాక్షి, అమరావతి: విశాఖ మహా నగరంలో లంకెలపాలెం నుంచి మధురవాడ వరకు ప్రయాణమంటే హడలెత్తాల్సిందే. ఆ 46 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే రద్దీ సమయంలో రెండు గంటలకు పైనే పడుతుంది. త్వరలో ఎక్కడా ట్రాఫిక్ జామ్ అనేది లేకుండా.. సిగ్నల్ పాయింట్ల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా ప్రయాణించే అవకాశం రాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు లంకెలపాలెం నుంచి మధురవాడ వరకు 12 జంక్షన్ల వద్ద చిన్న ఫ్లై ఓవర్లతో ట్రాఫిక్ జంక్షన్ల అభివృద్ధికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) కార్యాచరణ ప్రణాళికను ఆమోదించింది. రూ.298 కోట్లతో 12 జంక్షన్ల అభివృద్ధి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విశాఖ నగరాన్ని అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం రెండు కీలక ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించింది. నగరం మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి–16 అభివృద్ధితోపాటు మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ రెండింటినీ విశాఖ శివారులోని లంకెలపాలెం నుంచి మధురవాడ వరకు చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, ప్రయాణికులు తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకోవడం కోసం ఈ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. అందుకోసం లంకెలపాలెం నుంచి మధురవాడ మధ్య కీలకమైన 12 జంక్షన్లను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. లంకెలపాలెం, దువ్వాడ, స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్, గాజువాక, తాటిచెట్ల పాలెం, అక్కయ్య పాలెం, గురుద్వారా, విప్రో జంక్షన్, మద్దిలపాలెం, డెయిరీ ఫాం జంక్షన్, యండాడ జంక్షన్, మధురవాడ జంక్షన్ల వద్ద చిన్నపాటి ఫ్లై ఓవర్లు నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఎన్హెచ్ఏఐ ఆమోదం తెలిపింది. అందుకోసం రూ.298 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికను ఖరారు చేసింది. విశాఖలో ఫ్లైఓవర్ల నిర్మాణానికి గుర్తించిన 12 జంక్షన్లు మూడు డిజైన్లలో ఫ్లై ఓవర్లు జంక్షన్లను అనుసంధానించే రోడ్లకు తగ్గట్టుగా మూడు రకాల ఫ్లై ఓవర్ల డిజైన్లను ఎన్హెచ్ఏఐ రూపొందించింది. ప్లస్ (+), టీ, వై డిజైన్లను ఖరారు చేశారు. కాగా మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రణాళిక కూడా ఖరారయ్యాక తుది నిర్ణయం తీసుకుంటారు. అనంతరం ఏడాదిలోగా నిర్మాణాలను పూర్తి చేయాలని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది. -
డబ్బులు లేక ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య!
విశాఖ : విశాఖ జిల్లా లంకెలపాలెం రైల్వేగేటు వద్ద ఇద్దరి విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు అనకాపల్లి జేఎంజే స్కూలుకు చెందిన విద్యార్థులు జోగి, స్వరూప్లుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో దొరికిన సూసైడ్ నోట్లో డబ్బులు లేకనే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వారు పేర్కొన్నారు. కాగా విద్యార్థులు రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగిందని ముందుగా అనుకున్నప్పటికీ....సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు ఆత్మహత్యలుగా ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టంకు తరలిస్తున్నారు. కాగా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.