పాదాలతో...జీవితంలో ఒక రోజు
‘‘నా పాతికేళ్ల కెరీర్లో నేను రూపొందించిన తొలి లఘు చిత్రం ఇది. ఓ వినూత్న కాన్సెప్ట్‌తో ఈ లఘు చిత్రం చేశాను. ఈ కాన్సెప్ట్ నచ్చి, లక్ష్మీ చేశారు’’ అని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చెప్పారు. ‘లక్ష్మీ మంచు పాదాలు... జీవితంలో ఒక రోజు’ అనే టైటిల్‌తో ఆయన ఈ లఘు చిత్రం తీశారు. ఈ లఘుచిత్ర విశేషాలు తెలియజేయడానికి బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ -‘‘ఒక విషయాన్ని రెండున్నర గంటల్లో కాకుండా రెండు నిమిషాల్లో చెప్పగలిగితే ఎలా ఉంటుంది? అనే ఆలోచనకు తెరరూపమే ఈ చిత్రం.
ఓ వ్యక్తి దైనందిన జీవితంలో పాదాలు ఎలా ప్రయాణం చేశాయి? అనేది కథాంశం’’ అని తెలిపారు. లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ -‘‘ఈ లఘు చిత్రానికి రామ్‌గోపాల్ వర్మ నా పాదాలను ఎంపిక చేయడం ఆనందంగా ఉంది. ఈ కాన్సెప్ట్ నాకు విపరీతంగా నచ్చేసింది. ఒక విషయాన్ని చెప్పడానికి రెండున్నర గంటలు అవసరం లేదని ఈ సినిమా చేసిన తర్వాతే తెలిసింది. పాతికేళ్లుగా సినిమాలు తీస్తున్న వర్మ దగ్గర కొత్త ఆలోచనలు చాలా ఉన్నాయని, ఆయన దగ్గర్నుంచి నేర్చుకోవడానికి చాలా విషయాలున్నాయని అర్థమైంది’’ అని చెప్పారు.