breaking news
kartikeyudu
-
తరలిరానున్న భద్రకాళి, కార్తికేయుడు, నంది!
భారతీయ సంస్కృతీ వైభవం స్వదేశానికి తిరిగి వస్తోంది. దశాబ్ద కాలంలో అమెరికా, యూకే, కెనెడా సహా అనేక దేశాల్లో దశాబ్దాలుగా మగ్గిన 300కుపైగా అరుదైన, అపురూప కళాఖండాలు ఇప్పటికే భారత్‌కు తిరిగి రాగా తాజాగా ఆస్ట్రేలియా చోళుల కాలం నాటి మూడింటిని అప్పగించింది. దొంగల చేత చిక్కి సముద్రాలు దాటిన ఈ కళాఖండాలు ఘనమైన భారత చారిత్రక వారసత్వానికి ప్రతీకలు! భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా ఆ్రస్టేలియా ప్రభుత్వం ఆరు తలల కార్తికేయ విగ్రహం, నంది విగ్రహం, భద్రకాళి త్రిశూలాలను అప్పగించింది. ఇవన్నీ తమిళనాడు నుంచి అక్రమ మార్గాల్లో ఆ్రస్టేలియాలోని నేషనల్ గ్యాలరీ కలెక్షన్‌లోకి చేరాయి. ఇవి చోరీకి గురైనవని తమిళనాడు సీఐడీలోని ప్రత్యేక విభాగం స్పష్టమైన ఆధారాలతో నిరూపించడంతో మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ఒప్పందానికి అనుగుణంగా తమకు అప్పగించాలని భారత్ కోరింది. ఇందుకు ఆస్ట్రేలియ అంగీకరించడంతో త్వరలో స్వదేశానికి తిరిగి రానున్నాయి.షణ్ముఖ/కార్తికేయ విగ్రహంతమిళుల ఇష్టదైవం, తమ రక్షకుడిగా భావించే కార్తికేయుడిని సుబ్రమణ్యుడు, స్కంద, మురుగన్ అని కూడా పిలుస్తారు. ఆ్రస్టేలియా అప్పగిస్తున్న ఆరుతలల రాతి విగ్రహం 12వ శతాబ్ధానికి చెందినది. తమిళనాడులో కుంభకోణం సమీపంలోని మనంబాడి గ్రామంలోని నాగనాథస్వామి దేవాలయం నుంచి చోరీకి గురైంది. సుమారు 130 సెం.మీ ఎత్తు ఉంటుంది. చోళుల శిల్పకళా శైలికి ప్రతిబింబంగా సౌష్టవాకారం, లెక్కకట్టినంత సైజులో ఉండే ఆభరణాలతో కూడి ఉంది. ఆరుతలలను కొందరు ఆరు దిశలుగా, మరికొందరు జ్ఞానం, బలం, కీర్తి, ఐశ్వర్యం, వైరాగ్యం, విజ్ఞానం ఆరు గుణాలుగా, ఇంకొందరు కృతికా నక్షత్ర మండలంలోని దేవతలుగా నమ్ముతారు.మీటర్ పొడవైన నంది 13–16వ శతాబ్దాల మధ్యకాలం నాటి నంది విగ్రహం తంజావూరు ప్రాంతంలోని తిరువారూర్ జిల్లా కడువంకుడి గ్రామంలోని కైలాసనాథర్ ఆలయానికి చెందినది. ఏకశిల విగ్రహం. మీటరు పొడవుతో శిల్పకళ నైపుణ్యానికి అద్దం పడుతుంది. తమిళనాడు సీఐడీలోని విగ్రాహాల విభాగం అంచనాల ప్రకారం దీని విలువ రూ.నాలుగు కోట్లు. భద్రకాళి త్రిశూలంసాధారణంగా త్రిశూలం అనగానే శివుడు గుర్తు వస్తాడు కానీ దక్షిణాది ఆలయాల్లో అమ్మవారు కూడా త్రిశూలంతో దర్శనమిస్తూంటుంది. ఆ్రస్టేలియా అప్పగిస్తున్న మూడో కళాఖండం చోళుల అనంతర కాలపు అరుదైన లోహ త్రిశూలం. శ్రీ కాశీ విశ్వనాథస్వామి ఆలయానికి చెందినది. సుమారు 46 సెం.మీ ఎత్తు, మీటర్‌కి పైగా వెడల్పు ఉంటుంది. పైభాగంలో భద్రకాళి దేవి ప్రతిమ కనిపిస్తూంటుంది. ఊరేగింపులు, జాతరల్లో శక్తి, రక్షణలకు చిహ్నంగా వాడేవారని అంచనా. 2016లో తమిళనాడు సీఐడీలోని విగ్రహ విభాగం ఈ విగ్రహాల చోరీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తరువాత ఆలయ రికార్డులు, పాత ఫోటోలు, ప్రభుత్వ దస్తావేజులు, మ్యూజియం క్యాటలాగులన్నీ జల్లెడ పట్టారు. ఇవి ఎక్కడి నుంచి ఎప్పుడు గల్లంతయ్యాయో ఎలా విదేశాలకు చేరాయో నిరూపించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఘనంగా పవిత్రోత్సవం
మోపిదేవి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి కార్తికేయుడి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ప్రధానమైన ఆషాడ కృత్తిక మహోత్సవాన్ని శుక్రవారం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏటా స్వామివారి జన్మనక్షత్రం సందర్భంగా నాలుగు రోజులపాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే ఈనెల 26 నుంచి 29వ తేదీ వరకూ ఉత్సవాలు జరుగుతాయి. చివరి రోజు నిర్వహించే ఆషాడ కృత్తిక మహోత్సవానికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఈ సమయంలో స్వామిని దర్శించుకున్న వారి కోర్కెలు నెరవేరుతాయని విశ్వాçÜం. సంతానం లేనివారు, వివాహం కానివారు, ఆర్థికంగా ఇబ్బందులున్నవారు, శత్రుభయం వెంటాడుతున్నవారు, రాహు, కేతు, కుజ, సర్ప దోషాలున్న వారిని స్వామి అనుగ్రహిస్తాడని నమ్మకం. శతాబ్దాల కాలం నాటి నాగమల్లి వృక్షం భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారమై పూజలందుకుంటోంది. కోర్కెలు తీర్చాలని మనస్సులో తలచుకుని ఈ వృక్షానికి ముడుపు కడతారు. కోర్కెలు నెరవేరిన తరువాత స్వామివారిని దర్శించుకుని కానుకలు చెల్లించుకుంటారు.


