కూలిపోయిన విమానంలో రూ. 5 కోట్ల నగదు!
జకర్తా: ఇండోనేసియా రాజధాని జకర్తాలోని పుపువా ప్రాంతంలో ఆదివారం కూలిపోయిన ఇండోనేసియా విమానంలో రూ. 5 కోట్ల నగదు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం నిధుల్లో 5 కోట్ల నగదును ఇండోనేసియా ప్రభుత్వం పెగునన్గాన్, బిన్టాంగ్ ప్రాంతంలో నిరుపేద ప్రజలకు పంపిణీ నిమిత్తం నలుగురు రక్షకదళ సిబ్బందితో విమానంలో తీసుకవెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు పేర్కొన్నారు.
కాగా, పపువా రాజధాని జయపురలోని సెంటాని విమానాశ్రయం నుంచి ఓక్సిబిల్కు బయల్దేరిన ట్రిగన ఎయిర్ ఏటీఆర్ 42 విమానం ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కొండను ఢీకొని కూలిపోయిన సంగతి తెలిసిందే. టేకాఫ్ అయిన 33 నిమిషాలకే విమానం ఎయిర్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయినట్టు అధికారులు చెప్పారు. ప్రమాద సమయంలో విమానంలో 54 మంది ఉన్నారు. వీరిలో 49 మంది ప్రయాణికులు, ఐదుగురు విమాన సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో ఐదుగురు చిన్నారులు, ఇద్దరు శిశువులు ఉన్నారు. గల్లంతైన విమానం ఆచూకి తెలుసుకునేందుకు రంగంలోకి దిగిన సహాయ బృందాలు కూలిన ప్రాంతాన్ని గుర్తించాయి.