breaking news
illegal construction destroy
-
కొండాపూర్, వనస్థలిపురంలో హైడ్రా కూల్చివేతలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అక్రమ నిర్మాణాలే టార్గెట్‌గా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు నిర్మాణాలను నేలమట్టం చేసిన హైడ్రా.. తాజాగా వనస్థలిపురంలో అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే పలు భవనాలను కూల్చివేస్తోంది.వివరాల ప్రకారం.. వనస్థలిపురం ఇంజాపూర్‌లో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. శనివారం తెల్లవారుజాము నుంచే హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కాగా, పలు కాలనీలకు వెళ్ళే ప్రధాన రోడ్డును స్కూప్స్ ఐస్ క్రీమ్ కంపెనీ ఆక్రమించింది. దీంతో, రోడ్డు ఆక్రమణపై కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు.. అక్రమ నిర్మాణంపై దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న హైడ్రా అధికారులు.. రోడ్డుకు అడ్డంగా నిర్మించిన ఫ్రీకాస్ట్ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. మరోవైపు.. కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం సమీపంలో హైడ్రా కూల్చివేతలను ప్రారంభించింది. హఫీజ్‌పేట్ సర్వే నెంబర్-79లోని 39 ఎకరాల భూమిపై స్థల వివాదం కొనసాగుతోంది. వసంత హౌస్ పేరుతో నూతన కార్యాలయం నిర్మాణంతో పాటు భారీ షెడ్లను ఏర్పాటు చేశారు. ఈ స్థల వివాదంపై హైడ్రాకు ఫిర్యాదు రావడంతో భారీగా పోలీసు బందోబస్తు మధ్య కార్యాలయం కూల్చివేశారు. స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌తో పాటు భారీ షెడ్లను జేసీబీలతో తొలగించారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్కులు, నాలాల ఆక్రమణలను అడ్డుకోవడమే లక్ష్యంగా జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం (ఎన్ఆర్ఎస్సీ)తో హైడ్రా (HYDRA) చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్ఆర్ఎస్సీ వద్దనున్న ఉపగ్రహ చిత్రాలు, ఇతరత్రా భూ వివరాలను ఉపయోగించుకుని చెరువుల పూర్తిస్థాయి నీటి మట్టం(ఎఫ్టీఎల్), బఫర్ జోన్లను నిర్ధారించడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. అందుకు సంబంధించిన పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై హైడ్రా కమిషనర్ ఏ.వి.రంగనాథ్, ఎన్ఆర్ఎస్సీ సంచాలకుడు డాక్టర్. ప్రకాశ్ చౌహాన్ బాలానగర్‌లోని ఎన్ఆర్ఎస్సీలో సంతకాలు చేశారు. -
నాల్గవ రోజు 194 కూల్చివేతలు
- 646కు చేరిన ఆక్రమణల తొలగింపు సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో చెరువులు, నాలాలపై ఆక్రమణల కూల్చివేత కొనసాగుతూనే ఉంది. జీహెచ్ఎంసీ అధికారులు గురువారం సుమారు 194 అక్రమ కట్టడాలను కూల్చివేశారు. నాలుగు రోజులు కలిపి ఆక్రమణల తొలగింపు సంఖ్య 646కు చేరింది. గురువారం కూల్చివేతకు గురైన వాటిలో చెరువులు, నాలాలపై ఉన్న 142 కట్టడాలు, అనుమతి లేని 27 కట్టడాలు, శిథిలావస్థకు గురైన 25 కట్టడాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా శుక్రవారం సెలవు ప్రకటించడంతో జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలకు ఒక రోజు విరామం ప్రకటించారు. తిరిగి శనివారం ఉదయం అక్రమ కట్టడాల కూల్చివేతలు యథాతథంగా కొనసాగనున్నాయి.