breaking news
hundred percent
-
నూటికి నూరు సాధ్యమా?
♦ టెన్త్‌లో వంద శాతం ఉత్తీర్ణతపై అనుమానాలు ♦ విద్యాశాఖలో భారీగా ఖాళీలు ♦ 46 ఎంఈఓ పోస్టులకు 43 మంది ఇన్‌చార్జీలే.. ♦ డిప్యూటీ ఈఓ పోస్టులన్నీ ఖాళీనే ♦ కన్పించని మ్యాథ్స్,సైన్స్ టీచర్లు ♦ 1,371 మంది ఉపాధ్యాయుల కొరత ♦ {పత్యేక తరగతులు నిర్వహించినా ఫలితం డౌటే? పదోతరగతిలో వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని అధికారులు లక్ష్యం పెట్టుకున్నారు. లక్ష్యం సరే కానీ అందుకు అవసరమైన వనరులు లేకుండా ఎలా సాధ్యమని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. విద్యా శాఖలో భారీగా ఖాళీలు ఉన్నాయని, వాటిని భర్తీ చేయకుండా వందశాతం ఉత్తీర్ణత ఎలా సాధ్యమో అధికారులకే తెలియాలి. సబ్జెక్టు టీచర్లు లేకుండానే సర్కార్ స్కూళ్లను నెట్టుకొస్తున్నారని, పర్యవేక్షించే అధికారులు లేకుండా విద్యా శాఖ మొక్కుబడిగా సాగుతోందని ఈ దశలో టెన్త్‌లో టార్గెట్ ఎలా సాధిస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. - సంగారెడ్డి మున్సిపాలిటీ. జిల్లాలో 46 ఎంఈఓ పోస్టులకు గాను 43 మంది ఎంఈఓలు ఇన్‌చార్జీలే. జిల్లాలోని నలుగురు డిప్యూటీ ఈఓలకు గాను అంతా ఇన్‌చార్జిలే కావడం గమనార్హం. ముఖ్యంగా సీఎం జిల్లా కావడంతో పదోతరగతి వార్షిక పరీక్షల్లో రాష్ట్రంలోనే జిల్లాను ప్రథమ స్థానం లో నిలిపేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. విద్యార్థులకు ప్రత్యేక తరగతులతోపాటు ఉపాధ్యాయులకు సైతం బోధన అంశాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. వాస్తవంగా జిల్లాలోని 26 మోడల్ స్కూళ్లతోపాటు 43 కేజీబీవీలు, 28 గురుకుల, 4 ఎయిడెడ్, 475 జెడ్పీహెచ్‌ఎస్‌లు, 25 హైస్కూళ్లు ఉన్నాయి. ఇందులో 27,629 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరుకానున్నారు. హెచ్ఎంలే డిప్యూటీ ఈఓలు.. జిల్లాలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. చాలా పాఠశాలల్లో ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులు బోధించే వారు లేరు. ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉండటంతో పర్యవేక్షణ కరువైంది. డిప్యూటీ ఈఓ పోస్టులు సైతం ఖాళీగా ఉన్నందున సీనియర్ హెచ్ఎంలే ఇన్చార్జి డిప్యూటీ ఈఓలుగా కొనసాగుతున్నారు. గాడితప్పుతోన్న బడులు... అధికారులుగా హెచ్ఎంలే కొనసాగుతోండడంతో వారు ఉపాధ్యాయుల పట్ల కఠినంగా వ్యవహరించలేకపోతున్నారు. పాఠశాలలు సక్రమంగా నడవకపోయినా చర్యలకు ఉపక్రమించలేకపోతున్నారు. ఫలితంగా పాఠశాలలు గాడి తప్పుతున్నాయి. అనుభవజ్ఞులైన టీచర్లు లేకపోవడంతో బోధన సక్రమంగా సాగడం లేదు. గత రెండేళ్లలో పదోతరగతి ఫలితాలను పరిశీలిస్తే ప్రతి పాఠశాలలో ఫెయిల్ అయిన విద్యార్థులున్నారంటే అక్కడ సంబంధిత సబ్జెక్టు టీచర్లు లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది. ఇప్పటికైనా స్పందిస్తే.. వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్నందున ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు చేపడితే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని విద్యా వేత్తలు సూచిస్తున్నారు. తాత్కాలికంగా ఉపాధ్యాయులను నియమించి ప్రత్యేక బోధన తరగతులు నిర్వహిస్తే కొంతలో కొంతైనా పరిస్థితిలో మార్పు వస్తుందని వారు భావిస్తున్నారు. వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తాం... పదోతరగతి వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తాం. జిల్లా ఖ్యాతిని నిలుపుతాం. వంద శాతం ఫలితాలు సాధించేందుకు ఇప్పటికే కలెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే విద్యార్థులకు రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. - నజీమొద్దీన్, డీఈఓ సంగారెడ్డి విద్యార్థుల కోసం తప్పదు... మెరుగైన ఫలితాల కోసం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ఆ మాత్రం శ్రమించక తప్పదు. జిల్లాలో మా పాఠశాల విద్యార్థులను జిల్లా, మండల స్థాయి టాపర్లుగా నిలపాలన్నదే మా లక్ష్యం. మెరుగైన ఫలితాలు వస్తే గ్రామానికి, ఉపాధ్యాయులకు కూడా పేరొస్తుంది. సమష్టి కృషితో ముందుకు సాగుతున్నాం. - సుందరరావు, ఉపాధ్యాయుడు, జెడ్పీహెచ్ఎస్ మారెపల్లి మంచి మార్కులు సాధిస్తాం... ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠ్యాంశాలను ఒకటికి రెండు సార్లు అర్థమయ్యే రీతిలో చెబుతున్నారు. ఈ తరగతులు మాకెంతో ఉపయోగపడుతున్నాయి. వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఈసారి మా పాఠశాలకు జిల్లా స్థాయిలోనే మంచి గుర్తింపును తీసుకొస్తాం. - రవళిక, విద్యార్థిని, జెడ్పీహెచ్ఎస్ మారెపల్లి -
రుణ ప్రణాళిక రూ.12,491 కోట్లు
సాక్షి, గుంటూరు: కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో వంద శాతం రుణ లక్ష్యాన్ని సాధించే విధంగా బ్యాంకర్లు, అధికార యంత్రాంగం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో డీసీసీ (డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ) సమావేశంలో 2014-15 సంవత్సరానికి వార్షిక రుణ ప్రణాళికను ఖరారు చేశారు. గతేడాది కంటే 16.15 శాతం వృద్ధితో రూ.12,491.43 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను ప్రకటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సురేశ్‌కుమార్ మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంలో సమైక్యాంధ్ర ఉద్యమాలు, ఎన్నికల కోడ్ కారణంగా 89 శాతం రుణ లక్ష్యం సాధించామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ పథకాలు, రుణ లక్ష్యాలను సంపూర్ణంగా అమలుచేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. గతేడాది రూ.10,753 కోట్ల రుణ లక్ష్యం కాగా, ఈ ఏడాది రూ.1,737 కోట్లు అదనంగా పెంచినందుకు బ్యాంకర్లకు అభినందనలు తెలిపారు. వ్యవసాయ రుణాల కింద రూ.7,662.94 కోట్లు, ప్రాధాన్యత రంగాలకు రూ.2,900.90 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.1,927.59 కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగ రుణాలకు అత్యధికంగా రూ.6,328.57 కోట్లు కేటాయించడం ముదావహమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నెలలో విడుదల చేయాల్సిన వార్షిక రుణ ప్రణాళిక ఎన్నికల కారణంగా జూన్ నెలలో విడుదల చేయాల్సి వచ్చిందని వివరించారు. సమావేశంలో ఆంధ్రాబ్యాంకు డీజీఎం వి.ఎం.పార్ధసారథి, నాబార్డు ఏజీఎం ఏవీ భవానీ శంకర్, ఆర్బీఐ ప్రతినిధి మురళీధర్, లీడ్ బ్యాంకు మేనేజర్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.