breaking news
Hindi remake
-
హిందీకి అరి
వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ నటించిన చిత్రం ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. ఆర్వీ రెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మించారు. ‘పేపర్ బాయ్’ చిత్రదర్శకుడు జయశంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ‘‘ఈ చిత్రం విడుదలకు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామి కానుంది. త్వరలోనే గ్రాండ్‌గా విడుదల చేయనున్నాం. ఈ సినిమా హిందీ రీమేక్‌పై అభిషేక్ బచ్చన్ ఆసక్తిగా ఉన్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. కాగా.. ఈ చిత్రం ప్రివ్యూని అభిషేక్ బచ్చన్‌కి చూపించారట దర్శకుడు జయశంకర్. కాన్సెప్ట్ యూనివర్సల్‌గా ఉందని, హిందీలో రీమేక్ చేస్తే బాగుంటుందని అభిషేక్ బచ్చన్ పేర్కొన్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: కృష్ణ ప్రసాద్. -
కోలీవుడ్ హిట్ సినిమాలు హిందీలోనూ హిట్ ఆవుమా?
ఓ సినిమా హిట్ అయితే... ఆ సినిమాలోని కథ ఏ భాషకైనా, ప్రాంతానికైనా నప్పే విధంగా ఉంటే.. అందరి దృష్టీ ఆ సినిమా మీద పడుతుంది. అలా తమిళంలో హిట్టయిన చిత్రాల మీద హిందీ పరిశ్రమ దృష్టి పడింది. ఆ చిత్రాల రైట్స్ చేజిక్కించుకుని, రీమేక్ చేస్తున్నారు. మరి.. తమిళంలో హిట్ ఆన (అయిన) సినిమా హిందీలోనూ హిట్ ఆవుమా? (అవుతుందా?) అంటే.. వేచి చూడాల్సిందే. ఇక హిందీలో రీమేక్ అవుతున్న తమిళ చిత్రాల గురించి తెలుసుకుందాం. విమానయానం ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ జీవితంతో సుధ కొంగర దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’ (‘ఆకాశం నీ హద్దురా’). సూర్య హీరోగా నటించిన ఈ చిత్రం 2020లో డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజై, మంచి ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమా హిందీ రీమేక్‌లో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. సుధా కొంగరే రీమేక్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ రీమేక్‌కు సూర్య ఓ నిర్మాతగా ఉండటం విశేషం. సామాన్యులు సైతం విమానయానం చేసేందుకు గోపీనాథ్ ఏ విధంగా కృషి చేశారు? ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు? అనేది ‘సూరరై పోట్రు’ కథాంశం. అలాగే విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ‘కత్తి’ (2014) రీమేక్‌లో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తారని సమాచారం. హిందీ రైట్స్‌ను దర్శక–నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ దక్కించుకున్నారు. హిందీ అపరిచితుడు విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘అన్నియన్’ (‘అపరిచితుడు’) ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నట్లు శంకర్ ప్రకటించారు. ఇందులో రణ్వీర్ సింగ్ హీరోగా నటించాల్సింది. కొన్ని లీగల్ కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, అన్యాయాలపై మానసిక వేదనకు గురైన ఓ మధ్యతరగతి యువకుడు ఏం చేశాడు? అనేది ఈ చిత్రం కథాంశం. గ్యాంగ్‌స్టర్ సెంటిమెంట్ చెల్లెలి సంరక్షణ కోసం ఓ గ్యాంగ్‌స్టర్ తన జీవితాన్ని ఏ విధంగా మార్చుకున్నాడు? ప్రత్యర్థి గ్యాంగ్‌స్టర్లలకు ఎలా బుద్ధి చెప్పాడు? అనే అంశాలతో రూపొందిన తమిళ చిత్రం ‘వేదాళం’. అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో 2015లో విడుదలైన ఈ సినిమా హిట్ సాధించింది. ఈ సినిమా ‘వేద’గా హిందీలో రీమేక్ అవుతోంది. జాన్ అబ్రహాం టైటిల్ రోల్ చేస్తున్నారు. నిఖిల్ అద్వానీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్స్ తమన్నా, శర్వారి లీడ్ రోల్స్ చేస్తున్నారు. జాన్ అబ్రహాం సిస్టర్‌గా శర్వారి, హీరోయిన్గా తమన్నా నటిస్తున్నట్లు తెలుస్తోంది. 16ఏళ్లు కోమాలో ఉంటే.. దాదాపు 16 సంవత్సరాలు కోమాలో ఉన్న ఓ వ్యక్తి ఆరోగ్యం హఠాత్తుగా కుదుటపడుతుంది. కోమా నుంచి బయటకు వచ్చిన అతను సమకాలీన నాగరికత, జీవన విధానం, టెక్నాజీలను చూసి ఆశ్చర్యపో తాడు. ఈ పరిస్థితులను అతడు తన జీవితానికి ఎలా అన్వయించుకున్నాడు? తన పూర్వీకులకు చెందిన ఓ విగ్రహం అతని జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేసింది? అన్నది ‘కోమాళి’ కథనం. ‘జయం’ రవి హీరోగా ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2019లో విడుదలై విజయం సాధించింది. ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను బోనీ కపూర్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో అర్జున్ కపూర్ హీరోగా నటిస్తారని బాలీవుడ్లో ఎప్పట్నుంచో ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఇటు పోలీస్.. అటు ఎన్ఆర్ఐ బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ ఇటీవల రీమేక్స్ చిత్రాలపై ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ నిర్మిస్తన్న ఓ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలైంది. తమిళ దర్శకుడు కాలిస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 2016లో అట్లీ దర్శకత్వంలో వచ్చిన తమిళ హిట్ ఫిల్మ్ విజయ్ ‘తేరి’కి ఇది హిందీ రీమేక్ అని బాలీవుడ్ సమాచారం. ఓ రాజకీయ నాయకుడి కుమారుడు ఓ యువతిపై అత్యాచారం చేస్తే, అతన్ని చంపేస్తాడు ఓ పో లీసాఫీసర్. అప్పడు ఆ రాజకీయ నాయకుడు ఆ పోలీసాఫీసర్‌పై ఏ విధంగా పగ తీర్చుకున్నాడు? ఆ రాజకీయ నాయకుణ్ణి ఆ పోలీసాఫీసర్ ఎలా ఢీ కొన్నాడు? అన్నదే టూకీగా ‘తేరి’ కథాంశం. ఈ చిత్రంలో పోలీసాఫీసర్‌గా వరుణ్ ధావన్ నటిస్తున్నారు. అలాగే మరో తమిళ హిట్ ‘మనాడు’ హిందీ రీమేక్‌లో కూడా వరుణ్ ధావన్ నటించనున్నారనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. శింబు, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘మానాడు’. ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ రానా వద్ద ఉన్నాయి. ఓ ఎన్ఆర్ఐకి, పో లీసాఫీసర్కి మధ్య కొన్ని రాజకీయ అంశాల నేపథ్యంలో ఎలాంటి శత్రుత్వం ఏర్పడింది? అనే కోణంలో ఈ సినిమా సాగుతుంది. ఎన్ఆర్ఐగా శింబు నటించగా, పోలీసాఫీసర్‌గా ఎస్జే సూర్య నటించారు. ట్రెండీ లవ్‌స్టోరీ రూ. 5 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొంది, బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకుపైగా కలెక్షన్స్‌ను సాధించిన తమిళ ట్రెండీ లవ్‌స్టోరీ ‘లవ్ టుడే’. ప్రదీప్ రంగనాథన్ నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇవానా హీరోయిన్. గత ఏడాది నవంబరులో విడుదలైన ఈ సినిమా హిందీ రీమేక్‌ను ఫ్యాంథమ్ స్టూడియోస్, ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్నాయి. ఇందులో హీరో హీరోయిన్లుగా ఆమిర్ ఖాన్ పెద్ద కొడుకు జైనైద్ ఖాన్, శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్లు ఫైనల్ అయ్యారని, షూటింగ్ కూడా మొదలైందని బాలీవుడ్ సమాచారం. ప్రేమలో ఉన్న ఓ అబ్బాయి, ఓ అమ్మాయి పరస్పర అంగీకారంతో వారి మొబైల్ ఫోన్స్‌ను మార్చుకున్నప్పుడు ఏం జరిగింది? అనే అంశంతో ‘లవ్ టుడే’ చిత్రం రూపొందింది. ఈ చిత్రాలే కాదు.. మరికొన్ని తమిళ సినిమాలు కూడా హిందీలో రీమేక్ కానున్నాయని తెలుస్తోంది. -
బాలీవుడ్ భాగమతి
గత ఏడాది ‘భాగమతి’గా అనుష్క ప్రేక్షకులను భయపెట్టి, మంచి బాక్సాఫీస్ వసూళ్లు సాధించారు. అనుష్క లేడీ ఓరియంటెడ్ సినిమాల హిట్ లిస్ట్‌లోకి ‘భాగమతి’ కూడా చేరింది. ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్ కాబోతోందని తెలిసింది. ఈ చిత్రం రీమేక్ హక్కులను విక్రమ్ మల్హోత్రా తీసుకున్నారు. ఇందులో అనుష్క పోషించిన పాత్రను భూమి పెడ్నేకర్ చేస్తారని సమాచారం. తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన జి.అశోక్ ఈ రీమేక్‌ను డైరెక్ట్ చేయనున్నట్టు బాలీవుడ్ టాక్. ప్రస్తుతం భూమి పెడ్నేకర్ ‘సాంద్ కీ ఆంఖ్, బాలా’ సినిమాల రిలీజ్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. ‘సాంద్ కీ ఆంఖ్’లో 90ఏళ్ల గన్ షూటర్‌గా నటించారామె. -
భయపెడతానంటున్న కియారా
సూపర్ స్టార్ మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు కియారా అద్వానీ. ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న కియారా త్వరలోనే ఓ సౌత్ దర్శకుడి సినిమాలో నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. నటుడు, నృత్యదర్శకుడు రాఘవ లారెన్స్ దర్శకత్వంలో ‘కాంచన’ హిందీ రీమెక్‌లో నటించడానికి కియారా ఒప్పుకున్నట్లు తెలిసింది. లారెన్స్ ప్రస్తుతం కాంచన - 3 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తదుపరి బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారని తెలిసింది. రాఘవలారెన్స్ ఇంతకుముందు నటించి తెరకెక్కించిన ‘కాంచన’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటించబోతున్నట్లు సమాచారం. అక్షయ్ కుమార్ ఇప్పటికే కోలీవుడ్‌లో 2.ఓ చిత్రంలో విలన్‌గా నటించి దుమ్మురేపిన సంగతి తెలిసిందే. పాత్ర నచ్చితే అది ఎలాంటిదైనా నటించడానికి సమ్మతించే అక్షయ్‌కి ‘కాంచన’ చిత్రం బాగా నచ్చిందట. దీంతో ఆ చిత్ర హిందీ రీమేక్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం. ఆయనకు జంటగా కియారా అద్వానిని ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అమ్మడు ఇప్పుడు తెలుగులో రాజమౌళి తాజా చిత్రం ఆర్ఆర్ఆర్లోనూ ఒక హీరోయిన్గా నటించే అవకాశాన్ని దక్కించుకుందనే ప్రచారం జరుగుతోంది. -
ఆ సినిమా రీమేక్ ఆగిపోయింది
అవును.. తనీఒరువన్ సినిమా రీమేక్ చేయాలనే ప్రయత్నాలు ఆగిపోయాయి. తమిళ్లో ఘనవిజయం సాధించిన ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలోనూ రీమేక్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే తెలుగులో ఈ సినిమా రీమేక్ యథాతథంగా కొనసాగుతుండగా, బాలీవుడ్ రీమేక్ మాత్రం ఆగిపోయింది. సల్మాన్ హీరోగా తెరకెక్కాల్సిన ఈ ప్రాజెక్ట్‌పై కండలవీరుడు పెద్దగా ఇంట్రస్ట్ చూపించకపోవటంతో ఆగిపోయింది. తమిళ్లో తనీఒరువన్ సినిమాకు దర్శకత్వం వహించిన మోహన్ రాజా తన దర్శకత్వంలోనే హిందీలో తెరకెక్కించాలని ప్రయత్నించాడు. సల్మాన్ కూడా తనీఒరువన్ రీమేక్‌లో నటించడానికి ముందు ఆసక్తిగా ఉన్నా.. తర్వాత మాత్రం కాదన్నాడు. ముఖ్యంగా కథలో ఎంటర్టైన్మెంట్ లేకపోవటం, ఇప్పట్లో సల్మాన్ డేట్స్ కూడా ఖాళీ లేకపోవటంతో ఈ రీమేక్ ఆగిపోయింది. సినిమా ఆగిపోయిన విషయాన్ని స్వయంగా ప్రకటించకపోయినా, త్వరలోనే వేరే సినిమా మొదలవుతుందంటూ దర్శకుడు మోహన్ రాజా ప్రకటించటంతో తనీఒరువన్ బాలీవుడ్ రీమేక్ ఆగిపోయిన విషయం కన్ఫమ్ అయ్యింది.