breaking news
govt.
-
50 శాతం ఏయూఎం వృద్ధిపై యూనియన్ ఎంఎఫ్ గురి
ముంబై: యూనియన్ మ్యూచువల్ ఫండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తన నిర్వహణ ఆస్తులను (ఏయూఎం) 50 శాతం మేర పెంచుకోనున్నట్టు ప్రకటించింది. 2023 మార్చి నాటికి ఈ సంస్థ ఏయూఎం రూ.9,853 కోట్లుగా ఉంటే, 2024 మార్చి నాటికి రూ.15,000 కోట్లకు తీసుకెళ్లాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఎప్పుడో 2012లోనే ఈ సంస్థ మ్యూచువల్ ఫండ్స్ సేవలు ప్రారంభించినప్పటికీ ఇంతకాలం ఆస్తుల్లో వృద్ధి చెప్పుకోతగినంత లేదు. ప్రభుత్వరంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన యూనియన్ మ్యూచువల్ ఫండ్‌లో, 39.64 శాతం వాటాను జపాన్‌కు చెందిన దైచీలైఫ్ 2018లో కొనుగోలు చేయడం గమనార్హం. ఈ సంస్థ ఏయూఎంలో టాప్–30 పట్టణాల వాటా 68 శాతంగా ఉంటే, బీ30 (బియాండ్ 30) పట్టణాల నుంచి 32 శాతం ఆస్తులను కలిగి ఉంది. ‘‘మార్చి చివరికి ఉన్న ఏయూఎం రూ.9,853 కోట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికం చివరికి రూ.10,700 కోట్లకు చేరుకుంది. వచ్చే మార్చి నాటికి ఇది రూ.15,000 కోట్లకు చేరుతుందని భావిస్తున్నాం. పెద్ద థీమ్యాటిక్ ఫండ్‌ను వచ్చే నెలలో ప్రారంభించనున్నాం. దీని ద్వారా రూ.500 కోట్లు సమీకరించగలమని అంచనా వేస్తున్నాం. మార్కెట్‌పైనే ఇది ఆధారపడి ఉంటుంది’’అని యూనియన్ మ్యూచువల్ ఫండ్ సీఈవో జి.ప్రదీప్‌కుమార్ తెలిపారు. కొత్త భాగస్వామి మద్దతుతో ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నప్పటికీ ఏయూఎంలో వృద్ధి పెద్దగా లేకపోవడానికి బెల్జియంకు చెందిన కేబీసీ తొలుత భాగస్వామిగా ఉండడమేనని ప్రదీప్‌కుమార్ వెల్లడించారు. థర్డ్ పార్టీ విక్రయాలకు ఆ సంస్థ సమ్మతించకపోవడంతో, కేవలం యూనియన్ బ్యాంక్ శాఖల ద్వారానే విక్రయాలు చేయాల్సి వచి్చందన్నారు. 2018లో దైచీ రాకతో అప్పటికీ కేవలం రూ.4,500 కోట్లుగానే ఉన్న ఏయూఎం, ఐదేళ్లలో రెట్టింపైనట్టు చెప్పారు. ఇక ముందూ ఇదే విధంగా వృద్ధిని సాధిస్తామన్నారు. -
‘ఓపి’కకు పరీక్ష
– జిల్లా వ్యాప్తంగా విజంభిస్తున్న జ్వరాలు – ప్రభుత్వాస్పత్రులకు తరలివస్తున్న రోగులు –సోమవారం ఒక్కరోజే 8,400 మంది ఔట్పేషెంట్లు అనంతపురం సిటీ: రోగాల గుప్పెట్లో ‘అనంత’ బందీ అయింది. విషజ్వరాలు జనాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఉన్నతాధికారులు రాష్ట్రస్థాయి పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లలో తలమునకలైపోవడంతో ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకునే తీరిక లేకుండా పోయింది. జ్వరాలు తగ్గకపోవడంతో బాధితులు ప్రభుత్వాస్పత్రులకు క్యూ కట్టారు. సోమవారం జిలా వ్యాప్తంగా ఓపీ సేవలకు హాజరైన రోగుల సంఖ్య 8400. జ్వరాల తీవ్రత ఏ స్థాయిలో ఈ సంఘటన అద్దం పడుతోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు దోమల బెడద విపరీతంగా పెరిగి సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఆస్పత్రుల ఆవరణ లన్నీ రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. సోమవారం ఒక్క రోజే అనంతపురం సర్వజనాస్పత్రికి వచ్చిన ఓపీ రోగుల సంఖ్య 1600గా నమోదైంది. జిల్లా వైద్య విధాన పరిషత్ పరిధిలోని 19 కేంద్రాల్లో (హిందూపురం, మడకశిర, రాయదుర్గం, గుత్తి, కదిరి, పెనుకొండ, ధర్మవరం, తాడిపత్రి, గుంతకల్లు, ఉరవకొండ, సీ.కే.పల్లి, శింగనమల, నల్లమాడ, కళ్యాణదుర్గం, కణేకల్లు, కొనకొండ్ల, పామిడి, తనకల్లు సీ.హెచ్.సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులు) 6,800 మంది ఓపీ సేవలు పొందినట్లు వైద్యాధికారులు తెలిపారు. సర్వజనాస్పత్రి ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న జ్వరపీడితులు 68 మంది ఉన్నారు. పది రోజులుగా ఈ సంఖ్యలో ఎటువంటి మార్పూ రాలేదని ఇన్చార్జి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు వెల్లడించారు. పీహెచ్సీలలో వైద్యసేవలు మృగ్యం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కనీసం జ్వరాలకు కూడా సరైన వైద్య సేవలందడం లేదని తెలుస్తోంది. మందుల కొరత కూడా తీవ్రంగా ఉందని రోగులు పేర్కొంటున్నారు. ఈ కారణంగానే చాలా మంది రోగులు పెద్దాస్పత్రులకు వస్తున్నారని కొందరు వైద్యులు చెబుతున్నారు. సీజన్లో సంఖ్య పెరుగుతుంది జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దగ్గు, జలుబుతో పాటు పలు రకాల జ్వరాలతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య ఎక్కువే. అలాగని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పని చేయడం లేదన్నది అవాస్తవం. కొన్ని జ్వరాలు మందులకు లొంగవు. దీంతో జిల్లా కేంద్రాని వచ్చి చికిత్సలు పొందుతూ ఉండవచ్చు. ఫాగింగ్, డయేరియా రాకుండా జాగ్రత్తలు, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ఏ గ్రామంలోనైనా మలేరియా, డెంగీ, డయేరియా వ్యాధులు ప్రబలుతున్నట్లు తెలిస్తే నా నంబరు 98499 02397కు ఫోన్ చేసి నేరుగా సమాచారం ఇవ్వవచ్చు. –వెంకటరమణ, జిల్లా వైద్యాధికారి