breaking news
Goddess Padmavati
-
శ్రీవారి చలవతో నీటికష్టాలు తీరాయి: గవర్నర్
తిరుమలలో భారీ వర్షాలు కురిసి, జలాశయాలు కళకళలాడటానికి ఏడు కొండల వాడి దయే కారణం అని గవర్నర్ నరసింహన్ అన్నారు. శ్రీవారి సన్నిధిలో భక్తులకు ఈ ఏడాది నీటి కష్టాలు తప్పినట్లే అని ఆయన చెప్పారు. బుధవారం ఉదయం ఆయన తిరుచానూర్ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు. వెంకటేశ్వరుడి దయతోనే చిత్తూరు జిల్లాలో మంచి వర్షాలు కురిసి, రైతుల కష్టాలు తీరాయని చెప్పారు. ఉదయం హైదరాబాద్ నుంచి తిరుపతి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన అక్కడి నుంచి తిరుచానూర్‌లో అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం వేదిక్ యూనివర్సిటీ కాన్వకేషన్ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ పాల్గొంటారు. -
చిన్ని కృష్ణుడిగా అమ్మవారు
సూర్య, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించిన పద్మావతి అమ్మవారు తిరుచానూరు: వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన మంగళవారం రాత్రి పద్మావతి అమ్మవారు చంద్రప్రభ వాహనంపై చిన్నికృష్ణుడి అలంకరణలో భక్తులను అనుగ్రహించారు. అమ్మవారిని వేకువనే మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 8 గంటలకు పాండురంగడి అలంకరణలో అమ్మవారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం 12.30కి ఆలయంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 గంటలకు ఆస్థానమండపంలో ఊంజల్ సేవ జరిగాయి. సాయంత్రం 7 గంటలకు అమ్మవారిని వాహనమండపానికి తీసుకొచ్చి చంద్రప్రభ వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అమ్మవారిని ఒక చేతిలో వెన్నపాత్ర, మరో చేతిలో వెన్నముద్ద పెట్టుకున్న నవనీతకృష్ణునిగా అలంకరించారు. రాత్రి 8కి కోలాటాలు, భజన బృందాలు, మంగళవాయిద్యాలు, జియ్యర్ల ప్రబంధ పారాయణం మధ్య అమ్మవారు చంద్రప్రభపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దివ్యదర్శనం కల్పించారు. -
బ్రహ్మోత్సవాలకు పనులు పూర్తయ్యేనా?
కాంట్రాక్టర్ల సమ్మెతో సందేహం అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు ఇక 20 రోజులే! తిరుచానూరు : తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు మరో 20 రోజుల సమయం మాత్రమే ఉంది. బ్రహ్మోత్సవాలకు ఏర్పాటు పనులు ఇప్పుడిప్పుడే జరుగుతున్నా, బ్రహ్మోత్సవాలలోపు పూర్తవుతాయా అన్నది సందేహమే. సర్వీస్ ట్యాక్సును టీటీడీయే చెల్లించాలని టీటీడీ కాంట్రాక్టర్లు సమ్మె చేపట్టడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 19 నుంచి 27వరకు జరగనున్నాయి. శ్రీవారికి తీసిపోని విధంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహిస్తోంది. ఆలయం, ఉద్యానవనం, తోళపగార్డెన్, ఆలయ పరిసరాలు, మాడవీధులు, పుష్కరిణితో పాటు తిరుపతి నుంచి తిరుచానూరు ఆలయం వరకు స్వాగత విద్యుత్ దీపాల తోరణాలు, వివిధ దేవతా ప్రతిమల విద్యుత్ కటౌట్లను ఏర్పాటుచేయనున్నారు. అలాగే చలువపందిళ్లు ఏర్పాటుచేయాల్సి ఉంది. చక్రస్నానం(పంచమీ తీర్థం) రోజున పుష్కరిణిలో భక్తులకు ఇబ్బంది లేకుండా ఇటీవలే రూ.15 లక్షలతో పుష్కరిణి ఆధునీకరణ పనులు చేపట్టారు. ఇక మాడవీధుల్లో వాహన సేవా సమయంలో అమ్మవారికి భక్తులు హారతి ఇవ్వడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రతి ఏటా భక్తులకు అన్నప్రసాదం పంపిణీ కోసం తోళపగార్డెన్లో చలువ పందిళ్లు, ప్రత్యేక బ్యారికేడ్లు ఏర్పాటుచేస్తారు.అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు ఉదయం కొయ్య రథంపై అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. దీనికోసం కొయ్యరథానికి మరమ్మతులు, పెయింటింగ్ చేయాల్సి ఉంది. ఇవన్నీ టీటీడీ కాంట్రాక్టర్లు నిర్వహిస్తారు. అయితే 3 రోజుల నుంచి కాంట్రాక్టర్లు సమ్మెకు దిగారు. దీంతో అమ్మవారి బ్రహ్మోత్సవ ఏర్పాటు పనులు ఆగిపోయాయి. తమ న్యాయమైన కోరికను తీర్చకుంటే అమ్మవారి బ్రహ్మోత్సవాలను బహిష్కరిస్తామని టీటీడీ కాంట్రాక్టర్లు బహిరంగంగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలలోపు ఏర్పాటు పనులు పూర్తవుతాయా అన్న సందేహం వ్యక్తం అవుతోంది. దీనిపై టీటీడీ ఉన్నతాధికారులు ఏమేరకు స్పందిస్తారో వేచి చూడాలి.