పేరులో నేముంది
అర్జెంటీనా (వింత కథల పుట్ట)
పోర్చుగల్‌కు చెందిన ఫ్రాన్సిస్కో డి టోరెస్ అనే ఒక సముద్రవర్తకుడు ప్రయాణిస్తున్న ఓడ ప్రమాదానికి గురైంది. సముద్రంలో కొట్టుకుపోతున్న టోరెస్‌ను కొందరు రక్షించి, తమ దేశానికి తీసుకెళ్లి, సపర్యలు చేశారు. కొంతకాలం తర్వాత టోరెస్‌ను స్వదేశానికి పంపుతూ, వీడ్కోలు ఇచ్చే సందర్భంలో తమ ఆతిథ్యానికి గుర్తుగా కొన్ని ఆభరణాలను బహూకరించారు. చనిపోయాడనుకున్న టోరెస్ క్షేమంగా తిరిగి వచ్చేసరికి అందరూ సంతోషించారు. టోరెస్ తాను ప్రమాదం నుంచి బయటపడిన విధానాన్ని, అక్కడివారు తనను ఆదరించిన తీరును గురించి చెప్పి, వారు తనకు బహూకరించిన ఆభరణాలను చూపించాడు. తెల్లగా మెరుస్తున్న ఆ ఆభరణాలను చూసి అందరూ ముచ్చటపడి, తమకు కూడా కావాలన్నారు. దాంతో టోరెస్ కొందరిని వెంటబెట్టుకుని ఆ దీవికి వెళ్లి, అక్కడివారిని ఆభరణాల గురించి అడిగాడు.
వారు అతనికి ఓ తెల్లటి కొండను చూపించి, ఆ కొండ రాళ్లతోనే తాము ఆభరణాలను తయారు చేశామని చెప్పారు. టోరెస్ వారి అనుమతితో ఆ కొండరాళ్లను కొన్నింటిని తనతోబాటు తీసికెళ్లి, ఆ రాళ్లను శుద్ధి చేసి, వాటితో ఆభరణాలు తయారు చేసి అమ్మకం సాగించాడు. అలా తనకు ముడిసరుకు కావలసి వచ్చినప్పుడల్లా ఆ దీవికెళ్లి రాళ్లు తెచ్చుకునేవాడు. ఆ కొండకు అర్జెంటీనా అని పేరు పెట్టాడు. లాటిన్లో ఆర్జంటమ్ అంటే వెండి అని అర్థం. అలా ఆ దేశానికి అర్జెంటీనా అనే పేరు స్థిరపడిపోయింది.