breaking news
First International
-
దిగ్విజయంగా తొలి అంతర్జాతీయ "స్వరరాగ శతావధానం"
స్వర ఘనాపాటి, సంగీత శిక్షణా విశారద, స్వరకర్త గరికిపాటి వెంకటప్రభాకర్ తొలి అంతర్జాతీయ స్వరరాగ శతావధాన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తైంది. "వీధి అరుఁగు, నార్వే", "యస్ యస్ మ్యూజిక్ అకాడెమీ - ఇంటర్నేషనల్" సంస్థలు సంయుక్తంగా ఒక అపూర్వ అంతర్జాతీయ స్వరరాగ శతావధాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అంతర్జాల వేదికపై నిర్విరామంగా ఏప్రిల్ 14నుంచి -ఏప్రిల్ 22వ తేదీ వరకు 17 దేశాల నుంచి సంగీతజ్ఞులు108 మంది పృచ్ఛకులతో, 15 మంది సమన్వయకర్తలతో నిర్వహించిన కార్యక్రమం ఆహ్లాదకరంగా జరిగింది. అవధాని గరికిపాటి వెంకట ప్రభాకర్, అవధాన ప్రక్రియలో భాగంగా సంగీతజ్ఞులైన పృచ్ఛకులు శరపరంపరగా సంధించిన ప్రశ్నలకు అతి స్వల్పవ్యవధిలో ఒకసారి రాగ వర్ణనతో, మరోసారి నిషిద్ధస్వర విన్యాసంతో, ఒకతూరి రాగమాలికల కూర్పులతో, స్వరాక్షరాలతో, ఒకపరి రాగ తాళరసమార్పుల కూర్పులతో బదులిస్తూ, అప్రస్తుత ప్రసంగ ప్రభంజనాన్నిఅలవోకగా అడ్డుకుంటూ, మహాఅద్భుతంగా ఈ కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమానికి సమనవ్యకర్తగా ఖతార్‌నుంచి విక్రమ్ సుఖవాసి వ్యవహరించగా ముఖ్య అతిథులుగా తెలుగు భాషాసేవకులు, భాషాకోవిదులు కీ.శే. సముద్రాల లక్ష్మణయ్య గారి కుమారులు సముద్రాల విజయానంద్ గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ పూర్వ సంచాలకులు డా. విజయ్ భాస్కర్ దీర్ఘాశి గారు, తానా పూర్వ అధ్యక్షులు శ్రీ జయ్ తాళ్లూరి గారు, వంగూరి ఫౌండేషన్ అధ్యక్షులు వంగూరి చిట్టెం రాజు తానా పూర్వ అధ్యక్షులు ప్రసాద్ తోటకూర గారు, శ్రీ సాంస్కృతిక కళాసారధి అధ్యక్షులు రత్నకుమార్, తదితరప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వీధిఅరుఁగు వ్యవస్థాపకులు వెంకట్ తరిగోపుల గారు ఇలాంటి కార్యక్రమాలు ముందు తరాల వారికి ఒక నిఘంటువుగా ఉంటాయన్నారు. ఆయన కృషికి గౌరవ డాక్టరేట్ రావాలని అభిలషించారు. విజయోత్సవ సభలో అవధానకర్తతోపాటు, మిగిలిన అందరినీ గౌరవ మర్యాదలతో సత్కరించారు. అంతర్జాతీయంగా మొట్టమొదటిసారి నిర్వహించిన ఈ శతావధానం కార్యక్రమాన్ని వండర్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్, తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో పొందుపరిచి అంగీకార పత్రాన్ని అందజేశారు. గురుదేవులు అందరికీ శుభం కలగాలని, ప్రతి ఒక్కరికీ శుభాశీస్సులు అందించటంతో ఈ 4 రోజుల అంతర్జాతీయ స్వరరాగ శతావధాన కార్యక్రమం మహాద్భుతంగా పూర్తయినది. -
నీ సంకల్పానికి జోహార్..
ముందు రోజు ఆసుపత్రిలో కిమో థెరపీ.. మరుసటి రోజు పట్టుదలతో పరీక్ష కేంద్రానికి.. క్యాన్సర్ బాధపెడుతున్నా చలించని ఇంటర్ విద్యార్థి పెందుర్తి : రొంగలి హేమశంకర్ ప్రసాద్. పదో తరగతి పరీక్షలో 9.8 పాయింట్లు... ఫస్ట్ ఇంటర్ బైపీసీలో 440 మార్కులకు 418 (95 శాతం).. ఈ ఏడాది ద్వితీయ సంవత్సరం పరీక్షకు అదే స్థాయిలో సన్నద్ధమవుతున్న తరుణంలో విధికి కన్నుకుట్టింది. పరీక్షలకు కొద్ది కాలం ముందు మాయదారి రోగాన్ని ఉసిగొల్పింది. బోన్ క్యాన్సర్‌తో ఒంట్లో ఓపిక లేకుండా చేసింది. పరీక్షలకు శ్రద్ధగా చదవాల్సిన సమయంలో వైద్య పరీక్షలు చేయించుకునే దుస్థితిని కల్పించింది. పరీక్షల ముందు ఆసుపత్రి పాలు చేసింది. అయినా అతడి సంకల్పం సడల్లేదు.. పట్టుదల పిసరంత కరగలేదు.. విధిని సవాల్ చేస్తూ పరీక్షకు హాజరయ్యాడు. పూర్తి సమయం అందరితో కూర్చోని చక్కగా పరీక్ష రాశాడు. నిన్నటి వరకు ఆసుపత్రిలో.. వేపగుంటకు చెందిన హేమశంకర్ ప్రసాద్ తొలి నుంచి చదువులో ముందంజలో ఉండేవాడు. తల్లిదండ్రులు సింహాచలం, దివ్య ఆశలకు అనుగుణంగా ఉన్నత లక్ష్యం వైపు నడుస్తున్నాడు. అయితే అనుకోని విధంగా కొన్ని నెలల నుంచి ప్రసాద్ ఆరోగ్యం దిగజారుతూ వచ్చింది. ఎన్ని ఆసుపత్రులు తిప్పినా ఆరోగ్యం కుదుటపడలేదు. చివరకు నడవలేని పరిస్థితి వచ్చేసరికి ఆందోళనకు గురైన తల్లిదండ్రులు నగరంలో క్యాన్సర్ ఆసుపత్రిలో చూపించగా గత నెల పరీక్షలు నిర్వహించిన వైద్యులు బోన్ క్యాన్సర్‌గా నిర్థారించారు. వెనువెంటనే వైద్యం కూడా ప్రారంభించారు. ఈ క్రమంలో మంగళవారం ఆసుపత్రిలో కిమో థెరపీ చేయించుకున్నాడు. అదే రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన ప్రసాద్ చదువులో నిమగ్నమైపోయాడు. తల్లిదండ్రులు, బంధువులు ఈసారికి విశ్రాంతి తీసుకోమన్నా సంకల్పంతో పరీక్షకు హాజరయ్యాడు. ప్రసాద్ ఇంటర్ పరీక్షతోపాటు విధి పెట్టిన పరీక్షలో కూడా విజయం సాధించాలని ఆకాంక్షిద్దాం.