breaking news
exclusive story
-
ఇంకెనాళ్లీ నిరీక్షణ
- క్షయ నివారణ సొసైటీలో భర్తీకి నోచుకోని 20 పోస్టులు అనంతపురం మెడికల్ : ఏ శాఖలో అయినా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వస్తే వీలైనంత త్వరగా అభ్యర్థులను ఎంపిక చేసి పరిపాలన సజావుగా సాగాలని భావిస్తారు. కానీ వైద్య ఆరోగ్యశాఖలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. నోటిఫికేషన్ ఇచ్చారు.. దరఖాస్తులు అందాయి.. స్క్రూటినీ కూడా పూర్తయింది.. కానీ మెరిట్ జాబితా విడుదల చేయడంలో అంతులేని జాప్యం చేస్తున్నారు. జిల్లా క్షయ వ్యాధి నివారణ సొసైటీలో 20 పోస్టుల భర్తీకి 2014లో నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పట్లో దరఖాస్తులు కూడా స్వీకరించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు... 2016లో అప్పటి నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ కలెక్టర్ కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త నోటిఫికేషన్‌ను గత ఏడాది మార్చిలో విడుదల చేసి దరఖాస్తులు స్వీకరించారు. ఒక సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టుకు 8 మంది, ఒక జిల్లా ప్రోగ్రాం కో-ఆర్డినేటర్‌కు 45, ఒక టీబీ కౌన్సిలర్‌కు 42, ఒక టీబీ స్టాటిస్టికల్ అసిస్టెంట్‌కు 58 దరఖాస్తులు వచ్చాయి. అలాగే 11 సీనియర్ టీబీ సూపర్వైజర్ పోస్టులకు 138, రెండు టీబీ హెల్త్ విజిటర్ పోస్టులకు 62, రెండు ల్యాబ్ టెక్నీషియన్లకు 93, ఒక అకౌంటెంట్‌కు 18 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా 20 పోస్టులకు 464 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రక్రియ ముగిసి ఎనిమిది నెలలు గడుస్తున్నా పోస్టులు మాత్రం భర్తీకి నోచుకోవడం లేదు. ప్రాథమికంగా, రెండో సారి కూడా స్క్రూటినీ ముగిసింది. కమిటీ మెరిట్ జాబితాను కూడా తయారు చేసినట్లు తెలుస్తోంది. అయినా ఫైనల్ లిస్ట్ మాత్రం విడుదల చేయడం లేదు. నెలలు గడుస్తున్నా జాబితాను విడుదల చేయకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. అసలు పోస్టులు భర్తీ చేస్తారా, లేక గతంలోలా మళ్లీ బ్రేకులు పడతాయా అనే అనుమానం కలుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభ్యర్థులు నిత్యం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పోస్టులు భర్తీ చేస్తే క్షేత్రస్థాయిలో వైద్యసేవలు కూడా మెరుగయ్యే అవకాశం ఉంది. -
నిర్లక్ష్యానికి పరాకాష్ట
కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : కరీంనగర్ ఎస్టీ బాలికల వసతి గృహం నుంచి విద్యార్థినులు పారిపోయిన విషయం జిల్లాలో కలకలం సృష్టించింది. ఈ ఘటనకు హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యమే ప్రధాన కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థినులు వారం రోజులపాటు హాస్టల్లో లేకపోయినా... కనీసం తల్లిదండ్రులకు గానీ, ఉన్నతాధికారులగానీ సమాచారమందించకుండా.. కొద్ది రోజులకు వాళ్లు తిరిగివచ్చినా.. కనీసం తెలుసుకోలేని పరిస్థితి ఉందంటే విధుల్లో ఎంత నిర్లక్ష్యమో తెలుస్తోంది. విద్యార్థినులు పారిపోయారనే విషయం ‘సాక్షి’లో ఎక్స్‌క్లూజివ్ కథనం ప్రచురితమవడంతో విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆదివారం వసతిగృహానికి చేరుకుని వార్డెన్‌ను నిలదీశారు. బాలిక బయటకు వెళ్లిన విషయం ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. అనంతరం ఈ విషయమై కలెక్టర్, ఎస్పీ, డీటీడబ్ల్యూవోలకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన కలెక్టర్ డీఏటీడబ్ల్యూవో జయదేవ్ అబ్రహాంను విచారణ అధికారిగా నియమించారు. ఎస్పీ వెంటనే మిస్సింగ్ కేసు నమోదు చేయడంతోపాటు బాలికను వెదికేందుకు ప్రత్యేక బృందాలను పంపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్టల్ వార్డెన్‌పై, డీటీడబ్ల్యూవోపై కూడా కేసు నమోదు చేయాలని విద్యార్థిని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఏం జరిగింది? అదృశ్యం ఘటనపై విచారణ చేపట్టిన అధికారులకు కళ్లు తిరిగే విషయాలు బయటకు వచ్చాయి. ఎస్టీ హాస్టల్లో మహబూబ్‌నగర్‌కు చెందిన గంగుబాయి(ఉష) ఉద్యోగిగా పనిచేస్తోంది. ఆమె చిన్న కుమారుడు నూనావత్ రఘు(17) పెద్దపల్లిలోని ఎస్టీ హాస్టల్లో ఉంటూ అక్కడే 9వ తరగతి చదువుతున్నాడు. తల్లి కోసం తరచూ హాస్టల్‌కు వచ్చే అతడిని ఎప్పుడు వచ్చినా లోనికి రానిచ్చేవారు. ఈ క్రమంలో హాస్టల్లో ఉంటున్న విద్యార్థినులతో రఘుకు పరిచయం పెరిగింది. నగరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతూ హాస్టల్లో ఉంటున్న బాలికతోపాటు 8వ తరగతి చదువుతున్న బాలిక, రఘు ముగ్గురు కలిసి గత నెల 31న ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లారు. రఘు అమ్మ స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లాకు వెళ్లారు. ఈ విషయం మరునాడు బయటకు రావడంతో వార్డెన్ ఎవరికీ చెప్పకుండా కప్పిపుచ్చింది. కనీసం విద్యార్థినుల తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వలేదని తెలిసింది. వారం రోజుల అనంతరం ఈ నెల 6న రాత్రి 12 గంటలకు వారు ముగ్గురు హాస్టల్‌కు వచ్చారు. వారి వారి గదుల్లో నిద్రపోయారు. విషయం తెలుసుకున్న వార్డెన్ 7వ తరగతి చదువుతున్న విద్యార్థినిని ఆమె తల్లిదండ్రులను పిలిచి అప్పగించారు. 8వ తరగతి విద్యార్థిని విషయం గురించి ఎవరికీ సమాచారం ఇవ్వలేదని తెలిసింది. మరునాడు అంటే ఈ నెల 7న మధ్యాహ్నం రఘుతో కలిసి ఆ విద్యార్థిని మళ్లీ బయటకు వెళ్లింది. మొదట పెద్దపల్లికి అటు నుంచి ముంబయిలో ఉంటున్న రఘు మామ దగ్గరికి వెళ్లినట్లు సమాచారం. ముంబయికి ప్రత్యేక బృందం హాస్టల్ నుంచి విద్యార్థిని పారిపోయిందని వార్డెన్ అరుణాదేవి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న టూటౌన్ సీఐ నరేందర్ విచారణ ప్రారంభించారు. సదరు విద్యార్థిని ప్రస్తుతం ముంబయిలో ఉందనే సమచారం తెలిసింది. ఈ నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు ఆమెను కరీంనగర్ తీసుకువచ్చేందుకు ఎస్సై రఫిక్‌ఖాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఆదివారం ముంబయి బయలుదేరి వెళ్లింది. డీఏటీడబ్ల్యూవో విచారణ బాలిక అదృశ్యం ఘటనపై కలెక్టర్ సూచన మేరకు జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి ఆదేశాలతో డీఎటీడబ్ల్యూవో జయదేవ్ అబ్రహాంను విచారణ అధికారిగా నియమించారు. ఆదివారం హాస్టల్‌కు చేరుకున్న ఆయన పలువురు విద్యార్థులు, వాచ్‌మన్ , సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. స్టేట్మెంట్లు రికార్డు చేసుకున్నారు. రఘుతోపాటు ఇద్దరు విద్యార్థినులు గత నెల 31న వెళ్లి ఈ నెల 6న రాత్రి 12 గంటల ప్రాంతంలో తిరిగి వచ్చారని, రఘు మరునాడు మధ్యాహ్నం వచ్చాడని, అనంతరం రఘు, ఓ విద్యార్థిని కలిసి వెళ్లిపోయారని చెప్పినట్లు తెలిసింది. ఈ ఘటనకు వార్డెన్ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని వార్డెన్‌పై చర్య తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.