breaking news
Electrical Survey
-
చిన్న ఉపకరణాల పరిశ్రమ జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రికల్, వంటింటి ఉపకరణాల తయారీలో ఉన్న వ్యవస్థీకృత రంగ కంపెనీల ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8–10 శాతం పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ వెల్లడించింది. ‘బ్రాండెడ్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. పట్టణాలేగాక గ్రామీణ ప్రాంతాల్లోనూ స్మార్ట్ ఉపకరణాలను కోరుకుంటున్నారు. ఎలక్ట్రికల్ ఉపకరణాల కొనుగోలు అనేది తక్కువ ప్రమేయం ఉన్న నిర్ణయం అనే అభిప్రాయం వేగంగా మారుతోంది. కిచెన్ పరికరాలు, ఇంటి కోసం లైటింగ్ సొల్యూషన్స్, ఎలక్ట్రిక్ ఫ్యాన్స్, కూలర్స్ వంటివి ఇప్పుడు బ్రాండ్ల పనితీరు, సాంకేతికత, వాడుకలో సౌలభ్యం, బలమైన విక్రయానంతర సేవ వంటి అంశాలను మూల్యాంకనం చేసిన తర్వాతే కస్టమర్లు కొనుగోలు చేస్తున్నారు. స్మార్ట్ ఉపకరణాలకు పెరిగిన డిమాండ్ తయారీదారులను సాంకేతిక పరిశోధన, అభివృద్ధిలో పెట్టుబడి పెట్టేలా చేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ ఆదాయ వృద్ధి గ్రామీణ, పట్టణ విభాగాల నుండి స్థిరమైన డిమాండ్‌తో ముందుకు తీసుకువెళుతుంది’ అని తెలిపింది. స్థిరమైన డిమాండ్‌తో.. గత ఆర్థిక సంవత్సరంలో రాగి, అల్యూమినియం, ఉక్కు, పాలీప్రొఫైలిన్ వంటి కీలక ముడి పదార్థాల ధరలు పెరిగాయి. స్థిరమైన డిమాండ్ కలిసి రావ డంతో కంపెనీలు ఈ భారాన్ని కస్టమర్లకు బదిలీ చేయడానికి వీలు కలిగింది. గత ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రికల్ ఉపకరణాల తయారీదారులు ఉత్పత్తి ధరలను 12–14 శాతం పెంచారు. తద్వారా నిర్వహణ లాభదాయకతపై ప్రభావాన్ని పరిమితం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం కూడా ఆపరేటింగ్ మార్జిన్ 50 బేసిస్ పాయింట్లు తగ్గుతుందని అంచనా. నగదు లభ్యత కంపెనీల వద్ద నాలుగేళ్ల క్రితం రూ.3,000 కోట్లు ఉంటే 2022–23లో ఇది రూ.4,000 కోట్లకుపైమాటే అని అంచనా. వ్యవస్థీకృత రంగ కంపెనీలు గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో స్థిరంగా బ్యాలెన్స్ షీట్లను మెరుగుపరిచాయి. ఇది మధ్య కాలానికి కంపెనీల క్రెడిట్ ప్రొఫైల్స్‌ను బలపరుస్తుంది’ అని క్రిసిల్ రేటింగ్స్ వివరించింది. -
శతశాతం ఎలక్ట్రికల్ సర్వే నిర్వహించాలి
విజయనగరం కంటోన్మెంట్ : జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో శతశాతం ఎలక్ట్రికల్ సర్వే చేయాలని డీపీఓ బలిబాడ సత్యనారాయణ అన్నారు. గురువారం జిల్లాలోని అన్ని మండలాల ఈఓపీఆర్డీలతో సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ ప్రతీ గ్రామంలోనూ ఎన్ని విద్యుత్ స్తంభాలు, వీధి లైట్లు ఉన్నాయో సర్వే చేపట్టాలన్నారు. ఎన్నింటికి డబ్బులు చెల్లించారు..? అధనంగా ఎన్నింటికి చెల్లించి ఉన్నారన్న విషయాలను సర్వే చేసి అప్లోడ్ చేయాలన్నారు. ఈ సందర్భంగా మండలాల వారీ సమాచారాన్ని ఎంత మేరకు సేకరించారన్న విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెనుకబడి ఉన్న మెంటాడ, ఇతర మండలాధికారులను మందలించారు. విద్యుత్ బిల్లుల చెల్లింపులో ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపై వారికి అవగాహన కల్పించారు. తాగునీటి పథకాలు విద్యుత్ లేని కారణంగా ఆగిపోరాదన్నారు. అలా జరిగితే సంబంధిత సర్పంచ్‌లు, కార్యదర్శులే బాధ్యులన్నారు. ఇంటి పన్నుల వసూళ్లను కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలన్నారు. సమావేశంలో విజయనగరం డీఎల్పీఓ మోహనరావు, ఈఓపీఆర్ఆర్డీల సంఘం అధ్యక్షుడు ఐ.సురేష్, పర్యవేక్షకుడు కేఆర్ఎం పంతులు తదితరులు పాల్గొన్నారు.