బిగ్బజార్లలో మ్యాగీపై నిషేధం
మ్యాగీ నూడుల్స్ అమ్మకాలను ఢిల్లీ ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వ దుకాణాలన్నింటి నుంచి తక్షణం మ్యాగీని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం తెలిపింది. దాంతో బిగ్ బజార్ కూడా తమ మాల్స్ అన్నింటి నుంచి మ్యాగీని ఉపసంహరించాలని నిర్ణయించుకుంది. అంటే ఇక బిగ్ బజార్లలో మ్యాగీ ప్యాకెట్లు దొరకవు మాట. సీసంతో పాటు మోనోసోడియం గ్లూటామేట్ మోతాదును మించి అధిక పరిమాణంలో ఉండటంతో దీన్ని నిషేధించారు.
మొత్తం 13 శాంపిళ్లను పరీక్షించగా.. వాటిలో 10 శాంపిళ్లలో అనుమతించిన దానికంటే అత్యధిక మోతాదులో సీసం, ఎంఎస్‌జీ ఉన్నట్లు తేలింది. కేంద్రీయ భండార్ సహా ఢిల్లీ ప్రభుత్వ దుకాణాలు అన్నింటిలోనూ మ్యాగీ అమ్మకాలను నిషేధించారు. మ్యాగీ నూడుల్స్‌ను మిస్‌బ్రాండింగ్ చేసింనదుకు జరిమానా వేస్తామని, అలాగే అరక్షిత ఉత్పత్తులను అమ్ముతున్నందుకు నెస్లెపై కేసు పెడతామని ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 10 రాష్ట్రాలు మ్యాగీ నూడుల్స్‌పై నిషేధం విధించడమో.. లేదా శాంపిళ్లను పరీక్షలకు పంపడమో చేశాయి. ఇప్పటివరకు పరీక్షించిన శాంపిళ్లలో 80 శాతం వరకు మనుషులు ఉపయోగించడానికి ప్రమాదకరం అని తేలడంతో మార్కెట్ నుంచి తక్షణం మ్యాగీ ప్యాకెట్లను ఉపసంహరించాలని ఆదేశించినట్లు ఢిల్లీ ఆరోగ్యమంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు.