కాళోజీ కల...తెలంగాణ
హన్మకొండ కల్చరల్ న్యూస్‌లైన్ :
దేశ సాహిత్య చరిత్రలోనే అరుదైన కవిగా ఖ్యాతిగాంచిన కాళోజీ నారాయణరావు శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కాళోజీ శతజయంతి ఉత్సవ కమిటీ ఏర్పాట్లు పూర్తిచేసింది. కాళోజీ వంటి ప్రజాస్వామ్య విలువలు బోధించిన ప్రజాస్వామిక ప్రవక్త మరో వెయ్యి సంవత్సరాలకు గానీ పుట్టబోరని ప్రముఖ న్యాయవాది, పౌరహక్కుల నాయకుడు కన్నాభిరాన్ అంటే.. తెలంగాణ ఆయన రెండో ఊపిరిగా పనిచేసిందని సుప్రసిద్ధ సాహిత్య విమర్శకుడు అమ్మంగి వేణుగోపాల్ అన్నారు. అంతటి గొప్ప వ్యక్తి కాళోజీ. ఆయన స్ఫూర్తిని ముందుతరాలకు అందించేందుకు ప్రముఖచిత్ర దర్శకుడు, చిత్రకారుడు, కవి, బి.నర్సింగరావు అధ్యక్షుడిగా, వరవరరావు గౌరవాధ్యక్షుడిగా, జీవన్‌కుమార్ సమన్వయకర్తగా, ప్రముఖ న్యాయవాదులు కె.ప్రతాప్‌రెడ్డి , కేశవరావుయాదవ్ సలహాదారులుగా కాళోజీ శత జయంతి ఉత్సవ కమిటీ ఏర్పాటైంది. బి.నర్సింగరావు దర్శకత్వంలో మన కాళోజీ డాక్యుమెంటరీ నిర్మించారు.
అమ్మంగి వేణుగోపాల్, ఎన్. వేణుగోపాల్, బి.నర్సింగరావు ప్రచురణ కర్తలుగా కాళోజీ జీవితం- సమగ్ర సాహిత్యం సంపుటాలను వెలువరించనున్నారు. వేదకుమార్ అధ్వర్యంలో కాళోజీ జీవితంపై సంక్షిప్తంగా పాఠశాల కళాశాల విద్యార్థులకు అందుబాటులో ఉండేలా ఓ పుస్తకం వెలువరించనున్నారు. పాలపిట్ట పత్రిక, దక్కన్ డాట్కామ్లు ప్రత్యేక సంచికలు వెలువరిస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఏవీవీకళాశాల తెలుగు లెక్చరర్ డాక్టర్ జలంధర్‌రెడ్డి కాళోజీ సాహిత్యంపై సెమినార్ నిర్వహించనున్నారు. రంగస్థల దర్శకుడు, నటుడు దెంచనాలశ్రీనివాస్ అధ్వర్యంలో కాళోజీ జీవితాన్ని నాటకంగా ప్రదర్శించనున్నారు.
వేడుకలకు మహామహులు
హోటల్ హరిత కాకతీయలో సోమవారం కాళోజీ శతజయంతి ఉత్సవం ప్రారంభం కానుంది. నాగిళ్ల రామశాస్త్రి అధ్యక్షతన జరగనున్న కార్యక్రమంలో చలనచిత్రదర్శకుడు బి.నర్సింగరావు ముఖ్యఅతిథిగా, గోవా రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి విశిష్ట అతిథిగా, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు బూర్గుల నర్సింగరావు, ప్రముఖ మహిళా ఉద్యమకర్త, రచయిత్రి, అస్మిత వ్యవస్థాపకులు వసంతకన్నాబిరాన్, ఆత్మీయ అతిథులుగా, ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ చుక్క రామయ్య, విప్లవకవి, రచయిత డాక్ట ర్ పి.వరవరరావు, ప్రముఖ నవలాకారుడు డాక్టర్ అంపశయ్య నవీన్ పాల్గొననున్నారు, ప్రముఖ వైద్యుడు డాక్టర్ రామక లక్ష్మణమూర్తికి కాళోజీ పురస్కారం అందజేయనున్నారు, స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తికి, ప్రముఖ ఫోటోగ్రాఫర్, చిత్రకారుడు జి. భరత్‌భూషణ్‌కు ఆత్మీయ సత్కారం చేయనున్నారు.
సూర్యచంద్రుల్లాగే..
తెలుగుజాతి 87ఏళ్ల సంచలన జీవితానికి కాళోజీ నిలువుటద్దం. సత్యాగ్రహ ఉద్యమం నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు 70ఏళ్ల రాజ్య ప్రస్థా నం చేసిన స్వాతంత్య్ర సమరయోధుడు. ప్రజాస్వామ్య పరిపాలనను ఎన్న డూ చూడని నిజాం, హైదరాబాద్ రాష్ట్రాలలో, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జీవించిన కాళోజీ ఎంతో అపూర్వమైన ప్రజాస్వామ్య సంస్కృతిని వంటబ ట్టించుకోవడం ఆయన చైతన్యానికి నిదర్శనం. భూమి, గాలి, రాత్రి పగలు, సూర్యుడు, చంద్రుడు, కాళోజీ వంటి మనుషులు ఒక సంప్రదాయంగా, ఒక సంస్కృతిగా కొనసాగుతూ ఉంటారు. - వరవరరావు, విప్లవకవి
కాలంతో నడిచిన కవి
ప్రజాచైతన్య ఉద్యమాలకు నిలువెత్తు సంతకం ప్రజాకవి కాళోజీ నారాయణరావు. తన ఎక్స్‌రే కళ్లతో సమాజాన్ని దర్శించి కవి త్వం రాశారాయన. ఆయన భాగస్వామ్యంలేని ప్రజా ఉద్యమం లేదు. కాలంతో నడిచిన కవి. తనను క్షోభపెట్టిన ప్రతిసంఘటన ను కవిత్వం చేసిన మహానుభావుడు. అయన కవితకు ప్రజలే అలంకారం. నడుస్తున్న చరిత్రే ఇతివృత్తం. మానవత్వమే ఆభరణంగా వెలిగిన నిరాడంబరుడు. ప్రతిపదాన్ని పదునైన ఆయుధంగా చేసి అవ్యవస్థను వేటాడాడు. కాళన్నను చూస్తే అప్రజాస్వామిక వ్యవస్థ గజగజలాడేది. ప్రశ్నించనినాడు మనం జీవించడం మరిచిన వాళ్లమవుతామని సూటిగా చెప్పాడు కాళన్న.
- ఆచార్య బన్న అయిలయ్య, తెలుగుశాఖ కాకతీయ విశ్వవిద్యాలయం
కాళోజీతో 44ఏళ్ల అనుబంధం నాది
ఇంత చిన్న మనిషి ఎక్కడికీ పోడు. ఓ గదిలో కూర్చుంటాడు. అయినా ఇంత ప్రచారం, ఇంత పేరు ఎలా పొందాడో తెలియడం లేదు.. అంటూ తన గురించి కాళోజీ చమత్కారంగా మాట్లాడేవారని ప్రముఖ వైద్యుడు రామక లక్ష్మణమూర్తి గుర్తుచేసుకున్నారు. కాళోజీతో తనది నాలుగు దశాబ్దాల అనుబంధమని చెప్పుకొచ్చారు. సోమవారం కాళోజీ అవార్డు అందుకోనున్న లక్ష్మణమూర్తి.. ఆయనతో తనకున్న అనుబంధం గురించి పంచుకున్నారు. ‘కాళోజీకి పెద్దగా దేవునిపై నమ్మకం ఉండేదికాదు. కానీ సమాజంలోని కుళ్లును కడిగేందుకు ఆంజనేయుడిని ఆదర్శంగా తీసుకుంటాననేవారు. అన్న రామేశ్వరరావు అంటే భయభక్తులు ఉండేవి. ఆయనలోని మానవత, నిరాడంబరత, భయం ఇసుమంతైనా లేకపోవడం నన్ను ఆకర్షించాయి. ఆయన దేహం చాలించిన సమయంలో నేను అక్కడే ఉన్నాను. ఆయన పార్థివ శరీరాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు రాసిచ్చి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. అంతటి గొప్ప వ్యక్తి పేరిట ఉన్న అవార్డు నాకు రావడం చాలా ఆనందంగా ఉంది..’ అంటూ వివరించారు లక్ష్మణమూర్తి.