breaking news
Bombay House
-
‘టాటా’ సామ్రాజ్యానికి గుండెకాయ.. ‘బాంబే హౌస్’
ముంబై ఫోర్ట్ ప్రాంతంలోని ప్రశాంతమైన హోమి మోడీ వీధిలో కనిపించే నాలుగు అంతస్తుల చారిత్రక భవనం.. బయటకు చూస్తే సాధారణ కార్యాలయ భవనంలానే అనిపిస్తుంది. కానీ అదే ‘బాంబే హౌస్’. దాదాపు శతాబ్ద కాలంగా టాటా గ్రూప్ వ్యాపార సామ్రాజ్యానికి ఇది ప్రధాన కార్యాలయం మాత్రమే కాదు.. కీలక నిర్ణయాలకు సాక్షిగా నిలిచిన కార్పొరేట్ చరిత్రకు చిరునామా. ఇప్పుడు టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తన పదవి నుంచి వైదొలగనున్నట్లు (2027 ఫిబ్రవరిలో తన ప్రస్తుత పదవీ కాలం ముగిసిన తర్వాత) ప్రకటించడంతో మరోసారి బాంబే హౌస్‌పై ఆసక్తి పెరిగింది.1924లో మొదలైన ప్రయాణంబాంబే హౌస్ కథ 1920లో ప్రారంభమైంది. టాటా సన్స్ రెండో చైర్మన్ సర్ దొరాబ్జీ టాటా.. బాంబే మునిసిపాలిటీ నుంచి ఫోర్ట్ ప్రాంతంలో సుమారు 21,285 చదరపు అడుగుల విస్తీర్ణంలోని రెండు స్థలాలను కొనుగోలు చేశారు. అనంతరం భవనం నిర్మాణ బాధ్యతలను అసోసియేటెడ్ బిల్డింగ్ కంపెనీకి అప్పగించారు.స్కాటిష్ ఆర్కిటెక్ట్ జార్జ్ విట్టెట్ దీనికి రూపకల్పన చేశారు. ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం (ప్రస్తుతం ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయ) వంటి ప్రముఖ నిర్మాణాల రూపకల్పనతో విట్టెట్ అప్పటికే పేరు సంపాదించారు. బాంబే హౌస్ నిర్మాణం 1924లో పూర్తయి జూలై 1న తలుపులు తెరుచుకుంది.ఈ భవనానికి ‘టాటా హౌస్’ అని పేరు పెట్టకుండా ‘బాంబే హౌస్’ అని పిలవడం వెనుక కూడా ప్రత్యేక భావన ఉంది. టాటా గ్రూప్ ఎదుగుదలకు కేంద్రంగా నిలిచిన బొంబాయి నగరంతో సంస్థకు ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించేలా ఈ పేరు పెట్టారు.ఎడ్వర్డియన్ అందం.. భారతీయ వారసత్వంబాంబే హౌస్ నిర్మాణం ఎడ్వర్డియన్ నియో-క్లాసికల్ శైలిని ప్రతిబింబిస్తుంది. మలాడ్ రాతితో నిర్మించిన ముఖభాగం, సమతుల్య ఆకృతి, పెద్ద జార్జియన్ తరహా కిటికీలు, అలంకార కార్నిస్‌లు ఈ భవనానికి ప్రత్యేక గుర్తింపును ఇచ్చాయి. మొదట భవనం బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మూడు పై అంతస్తులతో నిర్మించారు. 1941-42లో నాలుగో అంతస్తును చేర్చారు. ప్రస్తుతం ఇదే అంతస్తులో చైర్మన్ కార్యాలయం, బోర్డు రూమ్ ఉన్నాయి.బయటి రూపాన్ని దాదాపు యథాతథంగా కాపాడుకుంటూనే లోపలి భాగాలను కాలానుగుణంగా మార్చుకుంటూ వచ్చారు. పాత కళాఖండాలు, ఫర్నిచర్, జ్ఞాపికలు, చారిత్రక బోర్డు రూమ్ వంటి అంశాలు భవనానికి పాతకాలపు ప్రత్యేకతను కొనసాగిస్తున్నాయి.టాటా సామ్రాజ్యంలోని కీలక నిర్ణయాలకు వేదికబాంబే హౌస్‌లో జరిగిన చర్చలు, తీసుకున్న నిర్ణయాలు టాటా గ్రూప్ చరిత్రలో అనేక మలుపులకు దారి తీశాయి. ఒకప్పుడు టెక్స్టైల్స్, హోటళ్లు, ఉక్కు, విద్యుత్ వంటి నాలుగు ప్రధాన వ్యాపారాల కేంద్రంగా ఉన్న ఈ భవనం.. తర్వాత విస్తరిస్తూ వచ్చిన టాటా సామ్రాజ్యానికి నాడీ కేంద్రంగా మారింది.జేఆర్డీ టాటా కాలంలో విమానయాన రంగంలో టాటా గ్రూప్ అడుగులు వేయడానికి సంబంధించిన కీలక ఆలోచనలు కూడా ఈ సంస్థాగత వాతావరణంలోనే రూపుదిద్దుకున్నాయి. దశాబ్దాల తర్వాత 2007లో టాటా స్టీల్.. కోరస్‌ను సుమారు 13 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన భారీ అంతర్జాతీయ ఒప్పందం వంటి వ్యూహాత్మక నిర్ణయాలకు కూడా బాంబే హౌస్ కీలక కేంద్రంగా నిలిచింది.2017లో చంద్రశేఖరన్ తీసుకున్న కీలక నిర్ణయంబాంబే హౌస్ దాదాపు 94 ఏళ్ల చరిత్రలో 2017 వరకు పెద్ద స్థాయి సమగ్ర పునరుద్ధరణకు దూరంగానే ఉంది. టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భవనాన్ని పూర్తిగా ఆధునీకరించాలనే నిర్ణయం తీసుకున్నారు.ఆర్కిటెక్ట్, అర్బన్ కన్జర్వేషన్ నిపుణురాలు బృందా సోమయ్య నేతృత్వంలోని బృందం ఈ ప్రాజెక్టును చేపట్టింది. కేవలం తొమ్మిది నెలల్లో పనులు పూర్తి చేసి 2018 జూలై 29న జేఆర్డీ టాటా జయంతి సందర్భంగా బాంబే హౌస్‌ను తిరిగి ప్రారంభించారు. రతన్ టాటా ఈ పునరుద్ధరించిన భవనాన్ని ప్రారంభించారు.పునరుద్ధరణలో భవనం చారిత్రక రూపాన్ని కాపాడుతూ ఆధునిక కార్యాలయ వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఓపెన్ వర్క్‌స్పేస్‌లు, సహకార ప్రాంతాలు, డిజిటల్ మీటింగ్ రూమ్‌లు, టాటా ఎక్స్పీరియన్స్ సెంటర్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు. పాత బోర్డు రూమ్‌కు కూడా ఆధునిక సాంకేతిక సదుపాయాలు జోడించారు.వీధి కుక్కలకు వెల్కమ్!బాంబే హౌస్ ప్రత్యేకతల్లో అత్యంత ఆసక్తికరమైనది అక్కడి వీధి కుక్కల సంప్రదాయం. దశాబ్దాలుగా భవనానికి వచ్చే కుక్కలను ఉద్యోగులు, సంస్థ ఆహ్వానితుల్లానే ఆదరిస్తున్నారు. 2018 పునరుద్ధరణలో వాటి కోసం ప్రత్యేక కెన్నెల్‌ను కూడా ఏర్పాటు చేశారు. నిద్రించే ప్రదేశం, సౌకర్యవంతమైన వాతావరణం, ఆహారం, వైద్య సంరక్షణ వంటి ఏర్పాట్లు ఇందులో ఉన్నాయి. టాటా గ్రూప్ స్వయంగా పేర్కొన్నట్టుగా, ఈ కుక్కలకు బాంబే హౌస్‌లోకి ప్రవేశించేందుకు ఉద్యోగుల మాదిరిగా యాక్సెస్ కార్డు అవసరం లేదు.నేటికీ అదే చిరునామా2024లో బాంబే హౌస్ తన శతాబ్దిని పూర్తి చేసుకుంది. టాటా గ్రూప్ అధికారిక చరిత్ర ప్రకారం, ఈ భవనం నేటికీ గ్రూప్‌నకు గ్లోబల్ హెడ్‌క్వార్టర్స్‌గా కొనసాగుతోంది. వందేళ్లలో టాటా గ్రూప్ నాలుగు ప్రధాన వ్యాపారాల నుంచి అనేక రంగాల్లో విస్తరించిన బహుళజాతి వ్యాపార సమూహంగా మారినా.. దాని సంస్థాగత హృదయం మాత్రం బాంబే హౌస్‌గానే ఉంది. అంతేకాదు, వారసత్వ భవనంగా ఉన్నప్పటికీ సుస్థిరత చర్యలకు గుర్తింపుగా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి ప్లాటినం రేటింగ్ పొందిన తొలి భారతీయ హెరిటేజ్ భవనంగా ఇది నిలిచింది.ఇప్పుడు చంద్రశేఖరన్ తన పదవీకాలం ముగిసిన తర్వాత కొత్త చైర్మన్‌కు బాధ్యతలు అప్పగించేందుకు మార్గం సుగమం చేశారు. దీంతో టాటా గ్రూప్ తదుపరి నాయకత్వం ఎవరి చేతుల్లోకి వెళ్తుందనే ప్రశ్న తెరపైకి వచ్చింది. అయితే ఆ నాయకత్వ మార్పు ఎక్కడి నుంచి సాగుతుంది అంటే.. సమాధానం మాత్రం ఇప్పటికీ అదే.. ముంబైలోని ఈ చారిత్రక ‘బాంబే హౌస్’ నుంచే. -
ఎయిర్ ఇండియాకు అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కొద్ది రోజుల క్రితం తన సొంత గూటి(టాటా)కి చేరిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే, ఎయిర్ ఇండియాకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలియజేస్తూ టాటా గ్రూప్ ఒక ఆసక్తికర ట్వీట్ చేసింది. సుమారు 75 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఎయిర్ ఇండియాకు ఆ పేరు పెట్టడం వెనుక జరిగిన ఆసక్తికర ప్రక్రియను తన ట్విటర్ వేదికగా షేర్ చేసింది. ఆ పేరు పెట్టడానికి అప్పటి టాటా సంస్థ ఉద్యోగులు యాజమాన్యానికి ఎలా సహకరించారో సంస్థ వివరించింది. 1946లో టాటా సన్స్ విభాగం నుంచి టాటా ఎయిర్ లైన్స్ ఒక సంస్థగా విస్తరించినప్పుడు, సంస్థ దానికి ఒక పేరు పెట్టవలసి వచ్చింది. భారతదేశం మొదటి విమానయాన సంస్థకు సంస్థ 4 పేర్లను(ఇండియన్ ఎయిర్‌లైన్స్, పాన్-ఇండియన్ ఎయిర్‌లైన్స్, ట్రాన్స్-ఇండియన్ ఎయిర్‌లైన్స్, ఎయిర్-ఇండియా)లను ఎంపిక చేసింది. ఆ నాలుగు పేర్లలో ఒక పేరును ఎంపిక చేసేందుకు ప్రజాస్వామ్య బద్దంగా బాంబే హౌస్‌లోని టాటా ఉద్యోగుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఉద్యోగులు తమ మొదటి, రెండవ ప్రాధాన్యతలను సూచించమని సంస్థ వారిని కోరింది. (2/2): But who made the final decision? Read this excerpt from the Tata Monthly Bulletin of 1946 to know. #AirIndiaOnBoard #WingsOfChange #ThisIsTata pic.twitter.com/E7jkJ1yxQx — Tata Group (@TataCompanies) February 6, 2022 మొదటి ఓటింగులో ఎయిర్-ఇండియాకు 64 ఓట్లు, ఇండియన్ ఎయిర్ లైన్స్'కు - 51 ఓట్లు, ట్రాన్స్-ఇండియన్ ఎయిర్ లైన్స్ కు -28 ఓట్లు, పాన్-ఇండియన్ ఎయిర్ లైన్స్ కు - 19 ఓట్లు వచ్చాయి. ఇందులో అధిక ఓట్లు వచ్చిన మొదటి రెండు పేర్లను ఎంపిక చేసి మరలా ఓటింగు ప్రక్రియను చేపట్టింది. అయితే, రెండవసారి ఓటింగులో ఎయిర్-ఇండియాకు 72 ఓట్లు, ఇండియన్ ఎయిర్ లైన్స్ కు 58 ఓట్లు వచ్చాయి. దీంతో తమ తమ నూతన విమానయాన సంస్థకు 'ఎయిర్-ఇండియా' అని పేరు పెట్టినట్లు ఆ ట్వీట్లో సంస్థ పేర్కొంది. (చదవండి: జియోబుక్ ల్యాప్‌టాప్ గురించి అదిరిపోయే అప్డేట్..!) -
'టాటాలు లీడ్ చేస్తారు.. ఫాలో అవ్వరు'
టాటా సన్స్ కొత్త చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ నూతనోత్సవంతో రంగంలోకి దిగారు. అన్ని వ్యాపారాల్లోనూ ఇండస్ట్రి లీడింగ్ ఫర్ఫార్మెన్స్ ఉండేలా తన పాలనను కొనసాగిస్తానని వాగ్దానం చేశారు. అన్ని వ్యాపారాల్లో పరిశ్రమలన్నింటిన్నీ మనమే లీడ్ చేసేలా అందరూ కలిసి పనిచేద్దామని గ్రూప్ కంపెనీలకు పిలుపునిచ్చారు. టాటాలు లీడ్ చేస్తారు, ఫాలో అవ్వరు అని మీడియాకు తెలిపారు. ఉప్పు నుంచి సాఫ్ట్ వేర్ల వరకున్న టాటా గ్రూప్ బిజినెస్ లకు రథసారథిగా చంద్రశేఖరన్ నేడు బాంబే హౌజ్‌లో తన బాధ్యతలు స్వీకరించారు. ''నేను ఈ బాధ్యతలు స్వీకరించడం నాకు దక్కిన ఓ గౌరవం, హక్కు. ప్రతిఒక్కరూ నాకు సహకరించాల్సిందిగా కోరుతున్నా'' అని చంద్రశేఖరన్ చెప్పారు. గ్రూప్ కొత్త చీఫ్ గా బాధ్యతలు స్వీకరించగానే, బాంబే హౌజ్ లో టాటా సన్స్ బోర్డు మీటింగ్ నిర్వహించారు. ఉదయం 9.15కు గ్రూప్ ప్రధాన కార్యాలయానికి చంద్ర చేరుకున్నారు. అనంతరం రతన్ టాటా, ఇతర బోర్డు మెంబర్లు బాంబే హౌజ్ కు వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత తాత్కాలిక చైర్మన్ గా ఉన్న రతన్ టాటా నుంచి చంద్ర తన బాధ్యతలు స్వీకరించారు. 150 ఏళ్లు కలిగిన టాటా సన్స్‌కు తొలిసారి నాన్-పార్సి చైర్మన్‌గా చంద్రశేఖరన్ ఎంపికైన సంగతి తెలిసిందే. -
మాజీ ఉద్యోగుల మోసపూరిత క్లెయిమ్‌లపై దర్యాప్తు
మిస్త్రీ ప్రకటన నేపథ్యంలో ఎయిర్ ఏషియా వెల్లడి న్యూఢిల్లీ: మాజీ ఉద్యోగులు కొందరు అక్రమంగా వ్యక్తిగత ఖర్చులను, కొన్ని రకాల చార్జీలను క్లెయిమ్ చేసుకోవడంపై దర్యాప్తు కొనసాగుతున్నట్టు విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా (ఇండియా) లిమిటెడ్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఇప్పటికే కంపెనీ బోర్డ్‌కు నివేదించినట్టు, గత సమావేశంలో చర్చిం చినట్టు తెలిపింది. విచారణ జరుగుతున్నందున ఈ వ్యవహారానికి సంబంధించి ఈ దశలో ఎటువంటి ప్రత్యేక వివరాలను ప్రస్తావించదలచుకోలేదని, అలా చేస్తే అది విచారణకు ప్రతికూలంగా మారవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది.అనైతిక విధానాలను సహించేది లేదని, కుట్రదారులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఎయిర్ ఏసియాలో రూ.22 కోట్ల మేర మోసపూరిత లావాదేవీలు జరిగినట్టు టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి ఇటీవల తొలగింపునకు గురైన తర్వాత సైరస్ మిస్త్రీ బోర్డు సభ్యులకు రాసిన లేఖలో పేర్కొనటం తెలిసిందే.


