breaking news
Bengaluru central jail
-
శశి'కళ'కు కత్తెర
► బెంగళూరు జైల్లో లగ్జరీ సౌకర్యాలకు లంగరు ► శశికళ జైలు జీవిత వీడియో, ఫొటోల హల్చల్ జైలు జీవితాన్ని సైతం కళకళగా మార్చుకున్న శశికళ లగ్జరీ జీవితానికి లంగరుపడింది. లోపాయికారితనంతో జైలు అధికారులు కల్పించిన ప్రత్యేక సదుపాయాలకు ఉన్నతాధికారులు కత్తెరవేశారు. పరమపద సోపానపటంలో పెద్దపాము నోట్లో పడ్డట్టుగా అసాధారణ స్థితినుంచి జారిపోయి సాధారణ ఖైదీగా మారిపోయారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: జైల్లో రాజమర్యాదలు అనుభవించిన శశికళ చివరకు సాధారణ ఖైదీగా మారారని తెలిసింది. సామాజిక మాధ్యమాల్లో వెలువడిన కథనాల మేరకు.. తమిళనాడు రాజకీయాల్లో వార్తల్లో వ్యక్తిగా వెలుగొందిన శశికళ బెంగళూరు పరప్పన అగ్రహార జైలును సైతం తన అగ్రహారంగా మార్చుకున్నారు. మూడు దశాబ్దాలకు పైగా జయలలిత వెన్నంటి ఉంటూ ఖరీదైన జీవితానికి అలవాటు పడిన ప్రాణం కావడంతో జైలు జీవితాన్ని తట్టుకోలేకపోయారు. కోటి రూపాయలు చూపిస్తే కొండమీద కోతైనా దిగివస్తుందనే సామెతను శశికళ ఆచరణలో పెట్టగా జైలు అధికారులు అక్షరాల అమలుచేశారు. జైలు నాలుగు గోడల మధ్య శశికళకు రహస్యంగా జరుగుతున్న రాచమర్యాదలను కర్ణాటక జైళ్లశాఖ మాజీ డీఐజీ రూప బట్టబయలుచేసి తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాల్లో కలకలం రేపారు. జైల్లో ప్రత్యేక వైద్య సదుపాయాలతో కూడిన వంటగది, ములాఖత్ కింద వచ్చిన వారితో మాట్లాడేందుకు మరో గది, యోగా గది, టీవీ వీక్షణకు మరో రూం, బాత్రూం.. మొత్తం ఐదు గదులు, ఖరీదైన మంచం, సోఫా, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, ఇలా అనేక గృహోపకరణాలు, హాయిగా నడయాడేందుకు పొడవాటి వరండా కేటాయించారు. ఈ సదుపాయల కల్పన కోసం మాజీ డీజీపీ సత్యనారాయణరావుకు రూ.2 కోట్లు లంచం ముట్టినట్లు రూప బహిరంగంగా చాటగా, అబ్బే అదేం లేదని డీజీపీ ఖండించారు. అయితే రూప ఆరోపణలు నిజమని నిరూపిస్తూ జైల్లోని చిన్నమ్మ లగ్జరీ జీవితం ఫొటోలతో సహా సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా బయటకు పొక్కింది. అంతేగాక, జైలు దుస్తుల్లో కాక ఖరీదైన నైటీలో చేతిలో బ్యాగ్‌తో శశికళ నడుస్తున్న వీడియో దృశ్యాలు తమిళనాడు, కర్ణాటక ప్రజలకు ఆశ్చర్యానికి గురిచేశాయి. శశికళ వంట తదితర సేవల కోసం తుముకూరు జైలు నుంచి ఐదుగురు మహిళా ఖైదీలను సైతం రప్పించారు. వీరిలో మేరీ, రేఖ అనే ఇద్దరు కన్నడంతోపాటూ తమిళం కూడా మాట్లాడగలరు. అలాగే శశికళ కోసం ప్రత్యేక వైద్యుడిని నియమించారు. ఇలాంటి లగ్జరీ జీవితం కోసం వారానికి రూ.2.50 లక్షల చొప్పున శశికళ నుంచి రూ.2కోట్లు పుచ్చుకున్నట్లు రూప ఆరోపించారు. భారీ మొత్తంలో ముడుపులు ముట్టిన కారణంగా దినకరన్ తదితరులు జైలుకు వస్తే ప్రశ్నించకుండా లోనికి పంపేవార ని తెలుస్తోంది. తనకోసం వచ్చేవారికి టీ, కాఫీ తదితర మర్యాదలు చేసే విధంగా శశికళకు గార్డుగా ఉన్న మహిళా పోలీసు అధికారిణులే ఆదేశించేవారని సమాచారం. బెంగళూరు జైల్లో శశికళ కోసం ఏర్పాటు చేసిన లగ్జరీ వసతులు రూపతో శశికళ వాగ్వాదం జైలు తనిఖీ సమయంలో శశికళకు కల్పించిన సదుపాయాలను చూసి బిత్తరపోయిన రూప వాటిని సెల్ఫోన్లో చి త్రీకరించారు.ఆ సమయంలో రూపతో శశికళ వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. కర్ణాటక సీఎం నుంచి అందరూ తెలుసు, వారికి లేని అభ్యంతరం నీకెందుకు, వారం రోజుల్లో నిన్ను బదిలీ చేయిస్తా అని రూపను బెదిరించినట్లు సమాచారం. అయితే, ముందు జాగ్రత్త చర్యగా జైల్లో శశికళకు కల్పించిన ప్రత్యేక సదుపాయాలను సీసీ టీవీ కెమెరా నుం చి డౌన్లోడ్ చేసుకుని సీడీలో రికార్డు చేసుకున్న తరువాతనే మీడియా ముందుకు రూప వచ్చినట్లు సమాచారం. లోపాయి రాయితీలకు కోత ఇదిలా ఉండగా, డీఐజీ రూప ప్రకటన వల్ల జైల్లోని లోగు ట్టు రట్టుకావడంతో ప్రభుత్వం సోమవారం నుంచి సంస్కరణల బాట పట్టింది. రూప సహా నలుగురు అధికారులను బదిలీచేసింది. ముఖ్యంగా లోపాయికారిగా శశికళకు కల్పించిన సదుపాయాలను కోతవిధించింది. అధికారులు టీవీ కనెక్షన్‌ను తొలగించారు. వీఐపీగా చెలామణి అయిన శశికళ మంగళవారానికి సాధారణ ఖైదీగా మారిపోయారు. ఐదు గదుల నుంచి సాధారణ ఖైదీ గదికి ఆమెను మార్చారు. తన ప్రత్యేక వంట గదిలో ఇడ్లీ, దోసెలు, మాంసాహారం చేయించుకుని తినే శశికళ సోమవారం ఉదయం ఇతర ఖైదీలతోపాటూ నిమ్మకాయల అన్నం, మధ్యాహ్నం రాగిరొట్టె, పెరుగన్నం తిని టీ తాగారని తెలిసింది. ప్రతిరోజు రాత్రివేళ చపాతీ తినే శశికళకు సాంబారన్నం పెట్టారని సమాచారం. శశికళను పరప్పన అగ్రహార జైలు నుంచి తుమ్కూరు జైలుకు మార్చాలని రాష్ట్ర హోంశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఖరీదైన దుస్తుల్లో శశికళ (సీసీ కెమెరాలో నమోదైన దృశ్యం) సీఎం, మంత్రులపై హైకోర్టులో పిటిషన్ పదవీ ప్రమాణం నియమ నిబంధలను పాటించకుండా జైలులో శశికళను కలుసుకున్న సీఎం ఎడపాడి, మంత్రులు దిండుగల్లు శ్రీనివాసన్, సెంగొట్టయ్యన్, సెల్లూరు రాజు, కామరాజ్‌లను ఆ పదవుల నుంచి డిస్మిస్ చేయాలని శ్రీవిల్లిపుత్తూరు మాజీ ఎమ్మెల్యే తామరకన్ని కుమారుడు ఆనళగన్ మధురై హైకోర్టు శాఖలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణకు అర్హమా అనే అంశపై ఆగస్టు 1వ తేదీన నిర్ణయిస్తారు. డీఐజీ రూప నిజాయితీతో కూడిన దూకుడును కొనసాగించాలని పుదుచ్చేరీ గవర్నర్ కిరణ్‌బేడీ సామాజిక మాధ్యమం ద్వారా సందేశం పంపారు. బెంగళూరు జైల్లో శశికళకు ప్రత్యేక రాయితీలపై కర్ణాటక హైకోర్టు తానుగా ముందుకు వచ్చి విచారణ జరపాలని కొంగునాడు మక్కల్ కట్చి ప్రధాన కార్యదర్శి ఈఆర్ ఈశ్వరన్ మంగళవారం విజ్ఞప్తి చేశారు. -
శశికళకు ఎన్ని వసతులో!
బెంగళూరు : తమిళనాడు అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు పరప్పన అగ్రహార జైలులో కల్పించిన ప్రత్యేక సదుపాయాలకు సంబంధించి ఒక్కొక్క విషయమే బయటికి వస్తోంది. తాజాగా సోమవారం ఆమెకు ఒక బ్యారెక్‌లోని మూడు– నాలుగు సెల్స్‌ను కేటాయించినట్లు తెలుస్తోంది. ఒక సెల్ కిచెన్‌గా, రెండో సెల్లో దుస్తులు, కొన్ని ప్రత్యేక పరికరాలు ఉంచుకోవడానికి కప్‌బోర్డులు కూడా ఉన్నాయి. ఇక మరో సెల్లో విజిటర్స్‌ను కలవడానికి కుర్చీలు, బెంచీలు ఉన్నాయి. మరోసెల్లో శశికళ నిద్రించడానికి వినియోగించేవారని సమాచారం. ఫ్యాన్, మస్కిటో కాయిల్స్ కూడా ఆమెకు కేటాయించినట్లు ఉన్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా సెల్స్ ఉన్న బ్యారెక్‌లోకి ఎవరినీ పంపించేవారు కాదని ఇక సెల్స్‌కు తెర కూడా ఉండేదని దీని వల్ల లోపల ఉన్నవారు ఏమి చేస్తున్నారో బయటికి తెలిసేది కాదని పరప్పన అగ్రహార జైలులో ఉన్న అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు సమాచారం లీకేజీ చేస్తున్నారనే అనుమానంతో జైలులో ఉన్న దాదాపు 40 మంది ఖైదీలను వేర్వేరు జైళ్లకు పంపిచేశారు. కాగా తమిళనాడులోనే కాదు, ఎక్కడున్నా, తమ రూటే సెపరేటు అన్నట్టుగా చిన్నమ్మ శశికళ లగ్జరీ వ్యవహారం పరప్పన అగ్రహార చెరలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న శశికళకు రాచమర్యాదలు అందుతున్నట్టుగా వచ్చిన సంకేతాలు కర్ణాటకలోనే, తమిళనాట కూడా రాజకీయంగా చర్చకు దారి తీసింది. కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీగా రూప స్వయంగా వివరాలను బయట పెట్టడం, ఆధారాలు ఉన్నట్టు ప్రకటించడంతో విచారణ కమిషన్ రంగంలోకి దిగింది. -
ఆమె కోసం రూ.2కోట్లతో జైల్లో స్పెషల్ కిచెన్
జైలులోనూ చిన్నమ్మకు రాచమర్యాదలు.. వీఐపీ ట్రీట్మెంట్ చెన్నై: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళకు జైల్లోనూ రాచమర్యాదలు దక్కుతున్నాయి. బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్న ఆమెకు స్పెషల్ ట్రీట్మెంట్ లభిస్తోంది. ఆమెకు నచ్చిన ఆహారం అందించేందుకు జైల్లో ఏకంగా ప్రత్యేక వంటగదిని ఏర్పాటుచేశారు. ఇందుకోసం ఏకంగా రూ. రెండు కోట్లను జైలు అధికారులకు లంచంగా ఇచ్చారు. జైలులో శశికళకు లభిస్తున్న వీఐపీ మర్యాదలపై సీనియర్ జైలు అధికారి డీ రూప రూపొందించిన నివేదికలో వెలుగుచూసిన వాస్తవాలివి. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. బెంగళూరు పరప్పన సెంట్రల్ జైల్లో ఈ శిక్ష అనుభవిస్తున్న శశికళ తనకు కారాగారంలో సకల సౌకర్యాలు లభించేందుకు వీలుగా రూ. 2 కోట్లు జైలు అధికారులకు లంచం చెల్లించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయని, ఈ వ్యవహారంలో కర్ణాటక జైళ్లశాఖ డీజీపీ హెచ్ఎన్ సత్యనారాయణరావుకు సైతం ముడుపులు అందాయని వినిపిస్తోందని ఆమె తన నివేదికలో పేర్కొన్నారు. అందుకే జైల్లో శశికి ప్రత్యేక మర్యాదలు దక్కుతున్నా ఆయన చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 10న పరప్పన అగ్రహార జైలులో తనిఖీలు నిర్వహించిన జైళ్లశాఖ డీఐజీ రూప ఈ మేరకు తన నివేదికలో సంచలన విషయాలు వెల్లడించారు.