breaking news
BCCI Corporate Trophy
-
సెంచరీతో చెలరేగిన దినేశ్ కార్తీక్
ముంబై: బీసీసీఐ కార్పొరేట్ ట్రోఫీలో ఇండియా సిమెంట్స్ జట్టు సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో ఇండియా సిమెంట్స్ 10 పరుగుల తేడాతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (ఎస్బీఎం)పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా సిమెంట్స్ 50 ఓవర్లలో 298 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ దినేశ్ కార్తీక్ (88 బంతుల్లో 108; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) శతకం సాధించగా...ముకుంద్ (45), బాబా అపరాజిత్ (41) రాణించారు. ఒక దశలో 98/5తో కష్టాల్లో పడ్డ జట్టును కార్తీక్ ఆదుకున్నాడు. అనంతరం లక్ష్య ఛేదనలో 278/6 స్కోరుతో ఎస్బీఎం విజయానికి చేరువైంది. 18 బంతుల్లో 21 పరుగులు చేయాల్సిన దశలో బాలాజీ (5/40) చెలరేగాడు. అతని బౌలింగ్ ధాటికి ఎస్బీఎం 49.4 ఓవర్లలో 288 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టు తరఫున అనిరుధ్ జోషి (58 బంతుల్లో 76; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), దేశ్‌పాండే (60), మీర్ అబ్బాస్ (60) అర్ధ సెంచరీలు చేశారు. గురువారం జరిగే ఈ టోర్నీ తొలి సెమీ ఫైనల్లో ‘కాగ్’తో ఇండియా సిమెంట్స్, రెండో సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ కెమ్ప్లాస్ట్తో బీపీసీఎల్ తలపడతాయి. -
యువరాజ్ మెరుపులు వృథా
ఎయిరిండియా పరాజయం బీసీసీఐ కార్పొరేట్ ట్రోఫీ ముంబై: బీసీసీఐ కార్పొరేట్ ట్రోఫీలో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ యువరాజ్ సింగ్ చెలరేగాడు. అయితే తన జట్టు ఎయిరిండియాను ఓటమినుంచి తప్పించలేకపోయాడు. సోమవారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో ఇండియా సిమెంట్స్ 7 వికెట్ల తేడాతో ఎయిరిండియాను చిత్తు చేసింది. యువరాజ్ (76 బంతుల్లో 79; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో పాటు సచిన్ రాణా (28 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) రాణించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఎయిరిండియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ రాహిల్ షా (4/68) ఆకట్టుకున్నాడు. అనంతరం ఇండియా సిమెంట్స్ 45.1 ఓవర్లలో 3 వికెట్లకు 276 పరుగులు చేసింది. అభినవ్ ముకుంద్ (139 బంతుల్లో 133; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో జట్టును గెలిపించాడు. ఎస్‌బీహెచ్‌ను గెలిపించి సుమన్ బరోడా: బీసీసీఐ కార్పొరేట్ ట్రోఫీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్)కు తొలి విజయం దక్కింది. సోమవారం ఇక్కడ హోరాహోరీగా సాగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఎస్బీహెచ్ 4 పరుగుల తేడాతో బీఎస్ఎన్ఎల్పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్బీహెచ్... తిరుమలశెట్టి సుమన్ (114 బంతుల్లో 91), డానియెల్ మనోహర్ (80 బంతుల్లో 60) అర్ధ సెంచరీలు సాధించడంతో 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. అనంతరం బీఎస్ఎన్ఎల్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 271 పరుగులు మాత్రమే చేయగలిగింది. గణేశ్ సతీశ్ (71 బంతుల్లో 58), నిరంజన్ బెహరా (66 బంతుల్లో 54) రాణించారు. ఎస్బీహెచ్ బౌలర్లలో రవికిరణ్, అబ్సలమ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఆంధ్రా బ్యాంక్ పరాజయం అహ్మదాబాద్: గ్రూప్ ‘ఎ’లో ఆంధ్రా బ్యాంక్‌కు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఇన్‌కంటాక్స్ 5 వికెట్ల తేడాతో ఆంధ్రా బ్యాంక్‌ను ఓడించింది.