breaking news
Ajay Gupta
-
పరిసరాలను ముంచెత్తేసిన పెళ్లి!
ఎంత ఘనంగా పెళ్లి చేశారన్నది కాదు... విందు ఎంత గొప్పగా ఉందన్నదీ కాదు... విందు ఇచ్చిన పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా లేకపోతే మాత్రం భారీ పరిహారం చెల్లించక తప్పకపోవచ్చు ఇకపైన. ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రం ఔలీ ప్రాంతంలో ఓ అపర కుబేరుడి వివాహ వేడుక జరిగింది. భారీ ఖర్చుతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలో చెత్త కూడా అంతే మొత్తంలో పోగవడమే అటు పెళ్లివాళ్లకీ, ఇటు మునిసిపాలిటీ సిబ్బందికీ కూడా చిక్కులు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ చెత్తను తొలగించలేక మున్సిపాలిటీ సిబ్బంది తల పట్టుకుంటున్నారు. భారతదేశానికి చెందిన గుప్తా కుటుంబం కొన్ని దశాబ్దాలుగా దక్షిణాఫ్రికాలో స్థిరపడింది. రకరకాల వ్యాపారాలు చేస్తూ సంపన్న కుటుంబంగా ఎదిగింది. ఈ ఏడాది గుప్తాల ఇంట్లో రెండు పెళ్లిళ్లు జరిగాయి. ముందుగా ఉత్తరాఖండ్‌లోని ఔలీ ప్రాంతంలో శతకోటీశ్వరుడు అజయ్ గుప్తా కుమారుడు సూర్యకాంత్ వివాహం జరిగింది. కొద్దిరోజుల వ్యవధిలోనే అజయ్ సోదరుడు అతుల్ గుప్తా కుమారుడు శశాంక్ పెళ్లి జరిగింది. అత్యంత ఆడంబరంగా నిర్వహించిన ఈ వివాహ వేడుకలకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బాలీవుడ్ నటులు, యోగా గురు బాబా రాందేవ్ సహా ఎందరో పెద్దలు, ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లి వేడుకల కోసం గుప్తా కుటుంబం ఔలీలోని హోటళ్లు, రిసార్టులను బుక్ చేసుకుంది. అయితే ఈ వేడుకల తర్వాత ఔలీలో ఎక్కడ చూసినా చెత్తే కన్పిస్తోందట. ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు ఎక్కడపడితే అక్కడ పడేశారట. వీరి వివాహం వల్ల దాదాపు 40 క్వింటాళ్ల చెత్త పోగైందని, ఈ చెత్తను శుభ్రం చేసేందుకు 20 మందితో ఓ బృందాన్ని నియమించామనీ అయినా సరే ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు కన్పిస్తున్నాయనీ మున్సిపల్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పెళ్లివారికి భారీ మొత్తంలో జరిమానా విధించాలని కూడా ఆలోచిస్తున్నారట. మనలో మన మాట... ఇలాంటి వేడుకలు జరిగినప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే కనీసం మనమైనా జాగ్రత్తగా ఉంటాం... -
గుప్తా ఇంట్లో పెళ్లికి 200 కోట్ల ఖర్చు!
అవులీ (ఉత్తరాఖండ్) : భారత్‌లో పుట్టి, దక్షిణాఫ్రికాలో స్థిరపడిన వివాదాస్పద వ్యాపారవేత్త అజయ్ గుప్తా తనయుడు సూర్యాకాంత్ వివాహం ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు.. అదే కుటుంబానికి చెందిన అతుల్ గుప్తా కుమారుడు షశాంక్ వివాహం 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వీటికి పలువురు ముఖ్యమంత్రులతోపాటు కత్రీనా కైఫ్, బాబా రాందేవ్ లాంటి సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. పెళ్లిళ్లకు వచ్చిన అతిథుల కోసం రాందేవ్ బాబా రెండు గంటలపాటు యోగా సెషన్ కూడా నిర్వహించారు. అతిథుల కోసం వారం రోజుల పాటు అవులీ పట్టణంలోని అన్ని హోటళ్లను, రెస్టారెంట్లను బుక్ చేశారు. అన్ని హంగులతో జరిగిన ఈ పెళ్లిళ్లకు 200 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఒక్క విశేషమైతే, తిని పడేసిన చెత్త నాలుగు వేల కిలోలు ఉండడం ఒక విషాదం. ఈ చెత్తను ఎలా, ఎక్కడికి తరలించాలో తెలియక నగర పాలికా పరిషత్ సూపర్వైజర్ అనిల్, ఆయన 20 మంది సిబ్బంది తలపట్టుకొని కూర్చున్నారు. ఆ చెత్తలో ప్లాస్టిక్ ఎక్కువగా ఉందని, కొండ ప్రాంతంలో తిరిగే తమ పశువులు ఆ ప్లాస్టిక్ కాగితాలను మింగేస్తే ఎంత ప్రమాదమని స్థానికులు వాపోతున్నారు. అయితే, ఈ చెత్తను తరలించేందుకు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ. 54వేలు డిపాజిట్ చేసిన గుప్తా కుటుంబం.. ఇప్పుడు ఆ చెత్త తరలించడానికి ఎంత ఖర్చైతే.. అంత చెల్లించేందుకు ముందుకొచ్చింది.