‘మల్బరీ చెట్ల’తో కరువుకు చెక్‌!

‘మల్బరీ చెట్ల’తో కరువుకు చెక్‌! - Sakshi


- మల్బరీ సాగులో కొత్తపోకడ ‘ట్రీ మల్బరీ’

- ఎకరానికి 650 మల్బరీ చెట్లు పెంచితే చాలు..మూడేళ్ల తర్వాత నెలకోసారి నీరిస్తే చాలు

- అధిక సాంద్రత మల్బరీ సాగులో వాడే నీటిలో 10–15% నీటితోనే మల్బరీ చెట్ల సాగు

- యంత్రాల వాడకానికి, అంతరపంటల సాగుకు వీలు..

- కరువు పీడిత ప్రాంతాల రైతులకు ప్రయోజనం

- కోలారు, చిత్తూరు జిల్లాల్లో ప్రయోగాత్మక సాగు చేపట్టిన అభ్యుదయ రైతులు




కరువు పీడిత ప్రాంతాల్లో మల్బరీ సాగు ద్వారా పట్టు పురుగుల పెంపకం చేపట్టిన రైతులు చక్కని ఆదాయం పొందుతున్నారు. ఎకరానికి వేలాది (అత్యధికంగా 5,500) మొక్కలను నాటి వత్తుగా సాగు చేస్తూ.. నెలకో పంట తీస్తున్నారు. అయితే, ఈ తోటలకు ఏడాది పొడవునా వారానికోసారి నీటి తడులు ఇవ్వాల్సి వస్తున్నది. నీటిని తక్కువగా వాడుకునే పద్ధతులను వెతుక్కునే క్రమంలో ‘ట్రీ మల్బరీ’ పద్ధతి ముందుకు వచ్చింది.  ఎకరానికి 650 మల్బరీ చెట్లను తక్కువ నీటితోనే సాగు చేయడం ఈ పద్ధతి ప్రత్యేకత. పాత పద్ధతితో పోల్చితే 10–15 శాతం నీటితోనే మల్బరీ చెట్లను సాగు చేయవచ్చన్న మాట. ఆ వివరాలు ‘సాగుబడి’ పాఠకుల కోసం..



పట్టు పెంపకానికి నెలవైన చిత్తూరు జిల్లా పడమటి మండలాల్లో గత కొన్నేళ్లుగా వర్షాలు తగ్గాయి. పొరుగునే ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని కోలారు జిల్లాలోనూ కరువు తీవ్రత ఎక్కువగా ఉంది. అక్కడి రైతులు నీటి ఎద్దడిని తట్టుకొనేందుకు మల్బరీ మొక్కలను వృక్షాలుగా పెంచే కొత్త పద్ధతిని గత సంవత్సరం నుంచి చేపట్టారు. దీన్ని స్వయంగా చూసి వచ్చిన చిత్తూరు జిల్లాకు చెందిన అభ్యుదయ రైతులు మల్బరీ చెట్లను ప్రయోగాత్మకంగా సాగు చేయనారంభించారు. సాధారణంగా మల్బరీ చేలల్లో సాళ్ల మధ్య రెండు అడుగులు, మొక్కల మధ్య రెండు అడుగుల దూరం ఉంచి అధిక సాంద్రతలో సాగు చేయడం రైతులకు అలవాటు.



మొక్కలు నాలుగు అడుగుల ఎత్తు పెరిగే లోపే కట్‌ చేసి ఆకులను పట్టుపురుగులకు మేతగా వేసేవారు. ఆ మొక్కలకు మళ్లీ ఎరువులు వేసి నీటిని అందించి తదుపరి పంటకు సిద్ధమయ్యేవారు. ఈ క్రమంలో వారానికోసారి మల్బరీ పంటకు నీటిని అందివ్వాల్సిందే. నీటి తడులు ఏమాత్రం ఆలస్యమైనా పంట ఎండిపోయేది.



పలమనేరు మండలం బేరుపల్లికి చెందిన గోవిందురెడ్డి, గంగవరం మండలం ఏడూరుకు చెందిన గురుమూర్తి శెట్టి తొలి నుంచి మల్బరీ సాగులో పలు ప్రయోగాలు చేసిన రైతులే. వీరు కర్ణాటక రైతులను చూసి పొలాల్లో మల్బరీ మొక్కలను పెద్ద వృక్షాలుగా పెంచే కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. అధిక సాంద్రతలో సాగుచేసే మల్బరీ తోటలో సాళ్ల మధ్య అంతర పంటలను సాగు చేసేందుకు వీలుండదు. కానీ, మల్బరీ చెట్ల మధ్యలో రాగి, కొత్తిమీర, ఉలవ, జొన్న, కంది, అలసంద, వివిధ రకాల ఆకుకూరలు, పశుగ్రాసం తదితర అంతర పంటలను సాగు చేసుకోవచ్చు.  



పశువులు, జీవాలకు మేతగా మల్బరీ ఆకు

కోలారు రైతులు మల్బరీ ఆకును పశువులు, జీవాలకు మేతగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల రైతులకు అదనంగా కొంత ఆదాయమూ లభిస్తోంది. కొందరు రైతులయితే మల్బరీ చెట్లను పెంచుతూ.. ఆకును పట్టు పురుగులను పెంచే రైతులకు విక్రయిస్తున్నారు.



ఎకరంలో 805 మల్బరీ చెట్లు

చిత్తూరు జిల్లాకు చెందిన రైతు గురుమూర్తి శెట్టి కోలారు వెళ్లి మల్బరీ చెట్ల సాగును స్వయంగా చూసి వచ్చి.. వర్షాధారంగా జీ –4 రకం మల్బరీ చెట్ల సాగును చేపట్టారు. 9“2 దూరంలో 2,750 మొక్కలు నాటారు. 2 ఏళ్ల తర్వాత సాలు మధ్యలో నుంచి కొన్ని మొక్కలను, మరో 2 ఏళ్లకు మరికొన్ని మొక్కలను తీసేస్తామన్నారు. అప్పటికి 9“6 దూరంలో ఎకరాకు 805 చెట్లు మిగులుతాయన్నారు.

– పిచ్చిగుంట్ల సుబ్రమణ్యం,సాక్షి, పలమనేరు, చిత్తూరు జిల్లా



మల్బరీ చెట్లతో కరువులోనూ మెరుగైన ఫలితాలు

కర్ణాటకలోని కోలారు జిల్లాలో నీటి కరువు ఎక్కువ. అయినా మల్బరీ సాగులో దేశంలోనే పేరు పొందింది.  చిత్తూరు జిల్లాతో పోల్చితే అక్కడే నీటి కరువు ఎక్కువ. అయినా అక్కడి రైతులు మల్బరీ చెట్ల సాగు ద్వారా మెరుగైన పలితాలను సాధించడం చూశా. దీంతో నేను ప్రయోగాత్మకంగా రెండు ఎకరాల్లో సాగు చేశా. మరో రెండేళ్లలో మల్బరీ మొక్కలు వృక్షాలుగా పెరుగుతాయి. అప్పుడు రైతులకు దీనితో కలిగే ఉపయోగాల గురించి ఇంకా బాగా అర్థమవుతుంది. మామూలుగా 600 గూళ్లకు కిలో దిగుబడి వస్తే.. మల్బరీ చెట్ల ఆకులతో 380 గూళ్లకే కిలో దిగుబడి వచ్చిందని కర్ణాటక రైతులు తెలిపారు.  

– గాండ్ల గురుమూర్తి శెట్టి (98491 26223),అభ్యుదయ మల్బరీ రైతు,  ఏడూరు, గంగవరం మండలం, చిత్తూరు జిల్లా



మూడేళ్ల తర్వాత నీరివ్వకపోయినా పర్వాలేదు..

ఎకరాలో మల్బరీ చెట్లు పెంచుతున్నా. 9“4 అడుగుల దూరంలో ఎకరానికి 1,800 మొక్కలను, 3 అడుగుల లోతులో నాటాము. 3 ఏళ్ల వరకు డ్రిప్‌తో నీరిస్తే తర్వాత నీరివ్వకపోయినా పర్వాలేదు. 3–4 అడుగుల ఎత్తున ప్రూనింగ్‌ చేస్తాం. కొమ్మ పద్ధతిలో 2“2, 2“3 దూరంలో నాటిన మల్బరీ తోటలో.. ఏటా నేల మట్టానికి ప్రూనింగ్‌ చేసినప్పుడు 5% మొక్కలు చనిపోతాయి. 15 ఏళ్ల తర్వాత మళ్లీ నాటాలి. అయితే, మల్బరీ చెట్లు పెంచితే ఆ సమస్య ఉండదు. ఈ చెట్లు వందేళ్ల వరకు మల్బరీ ఆకు దిగుబడినిస్తాయి.

– గోవిందు రెడ్డి (94403 06029), అభ్యుదయ మల్బరీ రైతు,బేరుపల్లి, పలమనేరు మండలం, చిత్తూరు జిల్లా



డిసెంబర్‌ నాటికి మల్బరీ చెట్ల సాగు పద్ధతి ఖరారు!

నీటి వసతి ఉన్న రైతులు మల్బరీ తోటల్లో సాధారణంగా ఎకరానికి 5,500 మొక్కలు నాటి, నెలకో పంట తీస్తున్నారు. నీరు పరిమితంగా ఉన్న రైతులు 8“8 దూరంలో ఎకరానికి 680 మల్బరీ చెట్లను 10–15% నీటితోనే సాగుచేయవచ్చు. ట్రాక్టరు, యంత్రాలను ఉపయోగించడం సులువు అవుతుంది. మైసూరులోని కేంద్రీయ పట్టు పరిశోధన, శిక్షణా సంస్థ (ఇది సెంట్రల్‌ సిల్క్‌ బోర్డు పరిధిలో ఉంది)లో మల్బరీ చెట్ల పెంపకంపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తి స్థాయిలో సాగు పద్ధతి ఖరారవుతుంది. వీ1 లేదా జీ4 లేదా ఎం.ఎస్‌.జి–2 రకాలేవైనా వర్షాకాలంలో నాటుకోవచ్చు. వీటి కోసం అనంతపురం జిల్లా రాప్తాడులోని పట్టు పరిశోధనా స్థానాన్ని సంప్రదించవచ్చు.

– డా. జీ వీ ప్రసాద్‌ (94908 40430), శాస్త్రవేత్త, పరిశోధన విస్తరణ కేంద్రం,కేంద్రీయ పట్టు బోర్డు, పలమనేరు, చిత్తూరు జిల్లా



మల్బరీ చెట్లతో లాభాలెన్నో..

► బోదెల (సాళ్లు) మధ్య దూరం 9 అడుగులు ఉంటుంది కాబట్టి.. మల్బరీ చెట్ల మధ్య ట్రాక్టరుతో సులభంగా అంతర కృషి చేసుకోవచ్చు. కలుపు కూలీల ఖర్చు తగ్గుతుంది..

► మల్బరీ చెట్లను నాలుగు అడుగుల ఎత్తులోనే కట్‌ చేసి మినీ ట్రాక్టర్‌ ట్రాలీలోకి వేసుకోవచ్చు.

► నలుగురు చేసే పనిని ఇద్దరు చేసుకోవచ్చు.

► గతంలో మాదిరిగా వారానికో తడి కాకుండా (మూడేళ్ల తర్వాత మల్బరీ చెట్లకు) నెలకోసారి నీటి తడులను అందివ్వొచ్చు.

► ఒక్కసారి డ్రిప్‌ పైపులను అమర్చితే చాలు. తరచూ మార్చాల్సిన పని ఉండదు.

► దీంతో మల్బరీ చెట్టుకు గుబురుగా కొమ్మలు పెరుగుతాయి. అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసిన 20 మల్బరీ మొక్కల నుంచి వచ్చే ఆకు దిగుబడిని ఒక చెట్టు నుంచే పొందవచ్చు.

► మల్బరీ చెట్లకు ఆకులు నాణ్యంగా, మందంగా పెరుగుతాయి. ఎక్కువ నీటి శాతాన్ని కలిగి ఉంటాయి.

► నాలుగో జ్వరం దశ (చివరి ఆరు రోజులు) లో పట్టు పురుగులు మామూలుగా తీసుకునే ఆహారం కన్నా నాలుగు రెట్ల ఆకును అధికంగా తీసుకుంటాయి. ఈ చెట్ల నుంచి లభించే ఆకు నాణ్యంగా ఉండటం వల్ల పట్టు గూళ్ల దిగుబడి బాగుంటుంది.

► ఆకుల్లో తేమ తక్కువగా ఉండటం, పిండి పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల పట్టు పురుగులకు మంచి పోషకాహారంగా ఉపయోగపడతాయి. నాణ్యమైన ఆకును పురుగులు ఆహారంగా తీసుకోవడంతో రోగాల బెడద ఉండదు.

► చెట్లకు నాలుగు అడుగులపైన కొత్తగా వచ్చిన కొమ్మలకు ఆకు పెరుగుతుంది కాబట్టి పండు ఆకులు, మట్టి అంటిన ఆకుల సమస్య ఉండదు.

► మామూలు మల్బరీ ఆకుతో వంద పట్టు గుడ్లకు 70 కిలోల గూళ్ళు ఉత్పత్తి అవుతాయి. మల్బరీ చెట్ల నాణ్యమైన ఆకుతో వంద గుడ్లకు 90 కిలోలకు పైగా పంట వస్తుంది.

► వేసవిలో నీటి సమస్య ఉన్న రైతులకు మల్బరీ చెట్ల పెంపకం ఎంతో ఉపయోగకరం.

Read latest Vanta-Panta News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top