
రెడీ..స్టడీ.. స్టార్టప్!
మొబైల్‌లో రెస్టారెంట్లను వెదుక్కునే అప్లికేషన్‌లా మొదలైంది జొమాటో
మొబైల్‌లో రెస్టారెంట్లను వెదుక్కునే అప్లికేషన్‌లా మొదలైంది జొమాటో చరిత్ర. ఇపుడు దాని విలువ దాదాపు బిలియన్ డాలర్లు. అంటే రూ.6 వేల కోట్ల పైమాటే. ఇక రోజూ మెయిళ్లకు డీల్స్ వివరాలు పంపించే కంపెనీగా ప్రస్థానం మొదలెట్టింది స్నాప్‌డీల్. ఇపుడు దాని విలువ 2 బిలియన్ డాలర్ల పైమాటే. ఇంటర్‌నెట్‌లో పుస్తకాలు అమ్మడానికి ఆరంభమైన ఫ్లిప్‌కార్ట్‌ది వీటన్నిటినీ మించిన చరిత్ర. విదేశీ పెట్టుబడులతో ఫ్లిప్‌కార్ట్ విలువ ఇపుడు ఏకంగా 11 బిలియన్ డాలర్లు. అంటే 66వేల కోట లపైమాటే. ఆరంభించిన అతితక్కువ కాలంలోనే ఈ కంపెనీలన్నీ భారీగా విస్తరించాయి.
స్వదేశీ, విదేశీ నిధులతో వేల కోట్లకు పడగలెత్తి ఇంటర్‌నెట్ ప్రపంచానికి చిరునామాలుగా మారాయి. అందుకే ఇపుడు నిధులు సమకూర్చే సంస్థలన్నీ ‘స్టార్టప్’ల వెంట పడుతున్నాయి. ఆరంభ దశలోనే అభివృద్ధికి అవకాశమున్న కంపెనీలను గుర్తించి నిధులు గుమ్మరిస్తున్నాయి. తరవాత మంచి వేల్యుయేషన్ వచ్చాక వాటా విక్రయించి బయటపడుతున్నాయి. అన్నీ జొమాటో, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ మాదిరి ఎదుగుతాయని భావించకున్నా... ఇలా నిధులు అందుకుంటున్న సంస్థల్లో చాలా వరకూ చక్కని బిజినెస్ చేస్తున్నాయి. ఇన్వెస్టర్లకు కాసులు కురిపిస్తున్నాయి. అందుకే 2014వ సంవత్సరంలో దేశంలోని స్టార్టప్ కంపెనీల్లోకి ఏకంగా 5.2 బిలియన్ డాలర్ల నిధులు పెట్టుబడులుగా వచ్చాయి.
ఏడాదిలో 229 స్టార్టప్‌లకు నిధులు
ఒక అధ్యయనం ప్రకారం... 2014లో దాదాపు 229 దేశీ స్టార్టప్స్‌లోకి ఏకంగా 5.2 బిలియన్ డాలర్లు... అంటే సుమారు రూ. 32 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ 229 సంస్థల్లో అత్యధికం (దాదాపు 34 శాతం) 1 నుంచి 10 మిలియన్ డాలర్ల మేర నిధులు అందుకున్నవే. అంటే రూ.6 కోట్ల నుంచి రూ.60 కోట్లన్న మాట. 3% మేర సంస్థలు మాత్రం 100 మిలియన్ డాలర్లకు పైగా... అంటే రూ.600 కోట్లకు పైగా నిధులను అందుకున్నాయి. ఐటీ హబ్ బెంగళూరు... స్టార్టప్స్ కి ఫండింగ్‌లోనూ టాప్‌లోనే ఉంది. పెట్టుబడులు పొందిన సంస్థల్లో 30% బెంగళూరులోనే ఉండటం దీనికి నిదర్శనం. తర్వాత స్థానాల్లో ఢిల్లీ, ముంబై నిలిచాయి. 4% సంస్థలతో హైదరాబాద్.. పుణెతో కలిసి అయిదో స్థానంలో నిలిచింది.
స్టార్టప్‌ల తోడ్పాటుకోసం...
సాఫ్ట్‌వేర్ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్ 10,000 స్టార్టప్స్ ప్రోగ్రామ్ తలపెట్టింది. 2013లో దీన్ని ఆరంభించి 150 స్టార్టప్స్‌కి ఫం డింగ్, కస్టమర్లు, మెంటార్లను అందించింది.2014-15లో స్టార్టప్స్, చిన్న.. మధ్య తరహా సంస్థల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.10,000 కోట్లతో ఫండ్ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా సాఫ్ట్‌వేర్ దిగ్గజాలతోను, స్టార్టప్ వర్గాలతోను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ భేటీ అవుతున్నారు.(స్టార్టప్‌లలోకి నిధులు వస్తున్నాయి సరే! అసలు ఏ రంగంలోకి ఎక్కువ వస్తున్నాయి? వాటి తీరుతెన్నులేంటి? తదుపరి సంచికలో)