ఒకవైపు రాష్ట్రం ప్రజా ఉద్యమాలతో అల్లకల్లోంగా మారితే.. ప్రజలు సమస్యల వలయంలో చిక్కుకుని అల్లాడుతోంటే.. అవేమీ పట్టించుకోకుండా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ రాకుండా అడ్డుకోవటమే తన ఏకైక విధిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు తప్పుపట్టారు.
టీడీపీ అధినేతకు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు రాష్ట్రం ప్రజా ఉద్యమాలతో అల్లకల్లోంగా మారితే.. ప్రజలు సమస్యల వలయంలో చిక్కుకుని అల్లాడుతోంటే.. అవేమీ పట్టించుకోకుండా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ రాకుండా అడ్డుకోవటమే తన ఏకైక విధిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు తప్పుపట్టారు. జగన్‌ను చూస్తే బాబుకు అంత భయమెందుకో అర్థక కావటం లేదని వ్యాఖ్యానించారు. శుక్రవారం లోటస్‌పాండ్‌లో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నివాసం వద్ద వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, గొల్ల బాబూరావు, కాపు రామచంద్రారెడ్డి, అమరనాథరెడ్డిలు మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. సంక్షేమ ఫలాలు అందక రైతులు, జీతాలు లేక ఉద్యోగులు అల్లాడుతున్నారు.
వీటిని పక్కదోవ పట్టించి, ప్రజలను తప్పుదారి పట్టించాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించటమే ఏకైక అజెండాగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. ప్రజలను ఎదుర్కొనే ధర్యం లేక జగన్‌పై విచిత్రమైన ఆరోపణలు చేస్తున్న చంద్రబాబును చూస్తే అసహ్యమేస్తోంది’’ అని విమర్శించారు. ఇక ఈనాడు పత్రిక తనే సీబీఐ సంస్థలాగా వ్యవహరిస్తోందని, సీబీఐ డెరైక్టర్ తానే అన్నట్టు ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం జగన్ బెయిల్ కోసం ధరఖాస్తు చేసుకుంటే దానిపై కూడా ఆరోపణలు చేయటం దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. తన అక్రమ ఆస్తుల కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొనే ధైర్యం లేక అడ్డదారుల్లో దాన్నుంచి తప్పించుకున్న బాబు ఇప్పుడు జగన్ బెయిల్‌పై ఆరోపణలు చేయటం సిగ్గుచేటన్నారు.