రాష్ట్ర విభజనలో ఇరుప్రాంతాలకూ సాధ్యమైన మేరకు న్యాయం చేసేందుకు ప్రయత్నించినట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ చెప్పారు.
రాజ్‌నాథ్‌సింగ్, సుష్మాస్వరాజ్ స్పష్టీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనలో ఇరుప్రాంతాలకూ సాధ్యమైన మేరకు న్యాయం చేసేందుకు ప్రయత్నించినట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ చెప్పారు. ఇరు ప్రాంతాలకు సంబంధించి ఏమైనా మిగిలి ఉంటే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తి చేస్తామని తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల ప్రజలకు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్య్వస్థీకరణ బిల్లు ఆమోదానికి మద్దతిచ్చి తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన బీజేపీ అగ్రనేతలకు టీ-జేఏసీ కృతజ్ఞతలు తెలిపింది. శుక్రవారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో రాజ్‌నాథ్, సుష్మా, వెంకయ్యనాయుడు, ప్రకాశ్ జవదేకర్, కిషన్‌రెడ్డిలను కోదండరాం నేతృత్వంలోని టీ జేఏసీ నేతల బృందం కలిసింది. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ తెలంగాణపై ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని, రెండు ప్రాంతాలకూ న్యాయం అందించడానికి తమ పార్టీ కృతనిశ్చయంతో ఉందని చెప్పారు.
సుష్మా మాట్లాడుతూ తాము చాలా సంతృప్తితో ఉన్నామని, అన్నదమ్ముల మధ్య విభజన జరిగిందని, తెలంగాణ వారికి రాష్ట్రంతో పాటు హైదరాబాద్ దక్కిందని, సీమాంధ్రులకు సాధ్యమైన మేరకు ప్యాకేజీ ఇప్పించామని చెప్పారు. తెలంగాణ అంశంపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీలు కాలయాపన చేయడం వల్లే వెయ్యికి పైగా ఆత్మహత్యలు జరిగాయని వెంకయ్యనాయుడు విమర్శించారు.