
ఉగ్రవాదంపై కలసి కదులుదాం
ప్రపంచానికి పెనుముప్పుగా మారుతున్న ఉగ్రవాదంపై పోరాడేందుకు కలసికట్టుగా ముందుకు సాగాలని విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్
ఆఫ్రికా దేశాలకు పిలుపునిచ్చిన సుష్మా స్వరాజ్
♦ నిఘా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుందాం
♦ భారత్, ఆఫ్రికాలకు భద్రతా మండలిలో శాశ్వత స్థానం ఉండాల్సిందే
♦ 250 కోట్ల మందికి ప్రాతినిధ్యం లేకుంటే ఎలా?
న్యూఢిల్లీ: ప్రపంచానికి పెనుముప్పుగా మారుతున్న ఉగ్రవాదంపై పోరాడేందుకు కలసికట్టుగా ముందుకు సాగాలని విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ ఆఫ్రికా దేశాలకు పిలుపునిచ్చారు. నిఘా సమాచార మార్పిడితోపాటు శిక్షణలో పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్, ఆఫ్రికాలకు శాశ్వత సభ్యత్వం ఉండాల్సిందేనన్నారు. మంగళవారమిక్కడ భారత్- ఆఫ్రికా దేశాల సదస్సులో భాగంగా ఆమె వివిధ దేశాల విదేశాంగ మంత్రులతో సమావేశమయ్యారు. ‘‘రోజురోజుకూ మన దేశాలకు ఉగ్రవాద ముప్పు పెరుగుతోంది.
సీమాంతర ఉగ్రవాదం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచవ్యాప్తంగా టైస్టు గ్రూపుల మధ్య లింకులు పెరిగిపోతున్నాయి. ఈ సవాల్‌ను ఎదుర్కొనేందుకు మనమంతా ఒక్కటి కావాలి. నిఘా సమాచార మార్పిడి పెరగాలి. శిక్షణ ఇతరత్రా విషయాల్లో సహకరించుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా వేళ్లూనుకుంటున్న ఉగ్రవాదంపై పోరుకు అంతర్జాతీయ సమాజం కూడా ఒక సమగ్ర కార్యాచరణతో కదులుతుందని ఆశిస్తున్నాం’’ అని సుష్మ అన్నారు. అనేక దేశాల్లో ఐఎస్‌ఐఎస్, బొకోహరమ్ వంటి సంస్థలు పేట్రేగిపోతున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
శాశ్వత సభ్యత్వం మన హక్కు
భారత్, ఆఫ్రికా దేశాల్లో కలిపి 250 కోట్ల జనాభా ఉన్నా భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని సుష్మ ప్రశ్నించారు. ఆఫ్రికా ఖండం మొత్తానికి, ప్రపంచ జనాభాలో ఆరో వంతు ప్రజలున్న దేశానికి మండలిలో శాశ్వత ప్రాతినిధ్యం లేకపోవడం ఎలా సబబు అవుతుందన్నారు. అంతర్జాతీయ సంస్థ ల్లో ప్రజాస్వామిక సంస్కరణలు జరగాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టంచేశారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ న్యాయబద్ధమైన హక్కు కోసం గళమెత్తకుంటే అంతర్జాతీయ సమాజంలో క్రియాశీల పాత్రకు, అభివృద్ధికి దూరంగా ఉండిపోతామని అన్నారు. ఐరాస శాంతిదళాల్లో భారత్ తరఫున 1.8 లక్షల మంది పాల్గొంటున్నారని వివరించారు.
ఉమ్మడి ప్రయోజనాలు కాపాడుకుందాం
వ్యవసాయం, విద్య, నైపుణ్య అభివృద్ధి, ఇంధనం, మౌలిక వసతుల కల్పన వంటి సంప్రదాయ రంగాలతోపాటు సముద్ర వాణిజ్యం, తీర గస్తీ వంటి రంగాల్లో భారత్-ఆఫ్రికా మధ్య సహకారం పెరగాలన్నారు. భారత్-ఆఫ్రికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ గత 15 ఏళ్లలో 20 రెట్లు పెరిగి 72 బిలియన్ డాలర్లకు చేరిందన్నారు. వాతావరణ మార్పులపై పారిస్‌లో జరగబోయే కాప్ సదస్సులో, కెన్యాలో నిర్వహించనున్న 10వ డబ్ల్యూటీవో మంత్రుల సమావేశంలో భారత్-ఆఫ్రికా ఉమ్మడి ప్రయోజనాల కోసం కృషి చేయాలని అన్నారు. తగినన్ని ఆర్థిక వనరులు, సాంకేతికత సాయంతోనే భూతాపానికి అడ్డుకట్ట వేయగలమని అభిప్రాయపడ్డారు.