యూనిఫాం వేసుకురాలేదని..

ఎంఐజీ కాలనీలోని రావూస్‌ స్కూల్‌ - Sakshi


- బాలికను బాలుర టాయిలెట్స్‌లో నిలబెట్టిన టీచర్‌

- సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఘటన

- పాఠశాల ఎదుట తల్లిదండ్రులు, టీఆర్‌ఎస్‌ నాయకుల ఆందోళన

- స్పందించిన కేటీఆర్‌.. వెంటనే డిప్యూటీ సీఎం దృష్టికి..

- విచారణకు ఆదేశించిన కడియం




రామచంద్రాపురం(పటాన్‌చెరు):
పాఠశాలకు యూనిఫాం వేసుకురాలేదని ఓ విద్యార్థినిని బాలుర మూత్రశాలలో నిలబెట్టారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం ఎంఐజీ కాలనీలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.



స్థానిక రావూస్‌ ప్రైవేటు హైస్కూల్‌కు ఐదో తరగతికి చెందిన ఓ విద్యార్థిని శనివారం యూనిఫాం వేసుకోకుండా సివిల్‌ డ్రెస్‌లో వచ్చింది. గమనించిన పీఈటీ.. యూనిఫాం ఎందుకు వేసుకురాలేదని ప్రశ్నించింది. యూనిఫాం ఆరలేదని, అందుకే సివిల్‌ డ్రెస్‌ వేసుకుని వచ్చినట్లు విద్యార్థిని చెబుతున్నా.. టీచర్‌ వినిపించుకోలేదు. బాలికను తీసుకెళ్లి బాలుర మూత్రశాలలో నిలబెట్టింది. సాయంత్రం ఇంటికి ఏడుస్తూ వచ్చిన విద్యార్థిని.. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఇక ఆ స్కూల్‌కు వెళ్లనంటూ ఏడుస్తూ చెప్పింది. చిన్నారి తండ్రి రామకృష్ణ విషయాన్ని పాఠశాల యాజమాన్యం దృష్టికి సోమవారం తీసుకెళ్లారు.



అయితే వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆయన స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. గతంలోనూ పాఠశాల యాజమాన్యం విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించిన సంఘటనలు అనేకం ఉన్నాయని వారు ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు సెలవు ప్రకటించింది. మరోవైపు విద్యార్థిని తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఘటనపై ఫిర్యాదు చేశారు.



చెప్పినా వినిపించుకోలేదు: విద్యార్థిని

యూనిఫాం ఆరకపోవడంతో సివిల్‌ డ్రెస్‌ వేసుకుని స్కూల్‌కు వెళ్లాను. పీఈటీ పిలిచి యూనిఫాం ఎందుకు వేసుకురాలేదని తిట్టారు. విషయం చెబుతున్నా, డైరీలో రాసి ఉందని చెప్పినా వినిపించుకోలేదు. బాలుర బాత్‌రూమ్‌లో నిలబెట్టారు. 

 

స్కూలుకు వెళ్లనంటోంది: రామకృష్ణ, చిన్నారి తండ్రి

యూనిఫాం ఆరకపోవడంతో పాపను సివిల్‌ డ్రెస్‌లో స్కూల్‌కు పంపించాం. విషయాన్ని డైరీలో సైతం రాశాం. పాప చెప్పేది వినిపించుకోకుండా ఉపాధ్యాయురాలు తిడుతూ అబ్బాయిల టాయిలెట్స్‌లో నిలబెట్టడం దారుణం. ఆ స్కూలుకు వెళ్లనంటే వెళ్లనని మా కూతురు ఏడుస్తోంది. స్కూల్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.

 

ఎలాంటి శిక్ష వేయలేదు: ప్రియాంక, పీఈటీ ఉపాధ్యాయురాలు

విద్యార్థినిని యూనిఫాం ఎందుకు వేసుకురాలేదని మాత్రమే అడిగాను. అంతేతప్ప బాత్‌రూమ్‌లో నిలబెట్టలేదు. తరగతి గది పక్కన బాలుర బాత్‌రూమ్‌ ఉంది. దాని ఎదురుగా బయటే పాపను ప్రశ్నించాను తప్ప ఎలాంటి శిక్ష వేయలేదు.



డిప్యూటీ సీఎం సీరియస్‌.. విచారణకు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: యూనిఫాం వేసుకోలేదని విద్యార్థినిని బాలుర టాయిలెట్స్‌ వద్ద నిలబెట్టిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పాఠశాలను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ పరిధిలోని ఓ స్కూల్‌లో యూనిఫాం వేసుకుని రాలేదని అబ్బాయిల టాయిలెట్‌ వద్ద అమ్మాయిని నిలబెట్టారని ట్వీటర్‌లో వచ్చిన పోస్ట్‌పై మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఇలాంటి సంఘటనలు జరగకూడదని, విషయాన్ని వెంటనే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్తానని సమాధానమిచ్చారు. అనంతరం కేటీఆర్‌ ట్వీట్‌పై స్పందించిన కడియం.. బాలికను ఇబ్బంది పెట్టిన హైస్కూల్‌కు వెంటనే వెళ్లి తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు డీఈవోలు సత్యనారాయణరెడ్డి, విజయకుమారి.. బీహెచ్‌ఈఎల్‌లోని రావూస్‌ హైస్కూల్‌ను తనిఖీ చేశారు. యూనిఫాం వేసుకొని రానందున స్కూల్‌ పీఈటీ విద్యార్థినిని అబ్బాయిల టాయ్‌లెట్‌ వద్ద నిలబెట్టినది వాస్తవమేనని ధ్రువీకరించారు. విజయకుమారి విలేకరులతో మాట్లాడుతూ.. ఈ పాఠశాలకు రంగారెడ్డి జిల్లాలో అనుమతులు ఉన్నాయని, కానీ సంగారెడ్డి జిల్లా పరిధిలో కొనసాగిస్తున్నారని తెలిపారు. దీనిపై గతంలో నోటీసులు కూడా ఇచ్చామని, అయినా స్పందించకపోవడంతో రెండుసార్లు పాఠశాలను సీజ్‌ చేశామని వివరించారు. మరోవైపు పీఈటీని వెంటనే తొలగించామని పాఠశాల యాజమాన్యం అధికారులకు తెలియజేసింది. ఈ మేరకు జరిగిన సంఘటనను, స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ తీసుకున్న చర్యలను వివరిస్తూ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. నివేదిక అందగానే చర్యలు చేపడతామని కడియం వెల్లడించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top