
అక్కడ రూ. 2.20కే సోలార్ విద్యుత్..!
దుబాయ్ లో యూనిట్ సోలార్ విద్యుత్ రేటెంతో తెలుసా..? వింటే షాకవుతారు. కేవలం రూ.2.20 మాత్రమేనట.
కోల్ కత్తా : దుబాయ్ లో యూనిట్ సోలార్ విద్యుత్ రేటెంతో తెలుసా..? వింటే షాకవుతారు. కేవలం రూ.2.20 మాత్రమేనట. చాలా దేశాలకు సాధ్యపడని 800 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పిన దుబాయ్.. ఆ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును యూనిట్ రూ.2.20కే ఆ దేశ ప్రజలకు అందించాలని నిర్ణయించిందట. అయితే ప్రస్తుతం సోలార్ విద్యుత్ పై ఎక్కువగా దృష్టిసారించిన భారతదేశంలో అంత తక్కువ ధరకు సోలార్ విద్యుత్ అందించలేమని విశ్లేషకులంటున్నారు. ఇండియాలో ప్రస్తుతమున్న టెక్నాలజీ, వాతావరణ పరిస్థితులు అందుకు సహకరించవంటున్నారు. సోలార్ ప్యానళ్ల ధరలు ఎక్కువ కావడం, సూర్యకిరణాల వేడి దుబాయ్ తో పోలిస్తే భారత్ లో తక్కువగా ఉండటం, పెట్టుబడులకు ఎక్కువ లాభాలు ఆశించడం వల్ల అంత తక్కువ ధరలకు భారత్ లో సోలార్ విద్యుత్ ను అందించలేమని పేర్కొంటున్నారు.
70 మెగావాట్లతో రాజస్థాన్ లో నెలకొల్పిన ఫిన్నిష్ కంపెనీ ఫోరమ్ ఎనర్జీ లో కూడా అత్యల్ప యూనిట్ సోలార్ విద్యుత్ ధర రూ.4.34 కోట్ అయింది. అధునాతన సోలార్ ప్యానెళ్లను అందుబాటులోకి తెచ్చినా.. రూ.2.20కి అందించలేమని విశ్లేషకులు చెబుతున్నారు. దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ ప్రాజెక్టు టారిఫ్ లు, భారత ప్రాజెక్టుల టారిఫ్ లను పోల్చలేమని, ప్రమాద అంశాలు, వ్యయాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయని సౌర విద్యుత్ పరిశ్రమకు చెందిన సుజోయ్ ఘోస్ తెలిపారు. భారత వ్యాపారాల్లో లాభాలను 18-20 శాతం ఆశిస్తారని, అదే విదేశీ వ్యాపారాల్లో ఈ లాభాలు తక్కువగా ఉంటాయని కొత్త, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ మాజీ సలహాదారు బి. బందోపాధ్యాయ తెలిపారు. సోలార్ పవర్ ప్లాంటులో ఉత్పత్తి చేసిన విద్యుత్ ధరలను నిర్ణయించడంలో ఇవే కీలకపాత్ర పోషిస్తాయన్నారు.