
బీఎస్–3 వాహనాలపై వేటు
రోజురోజుకు పెరిగిపోతున్న వాయు కాలుష్యం దేశ ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతుండడంతో భారత్ స్టేజ్ (బీఎస్)– 4 కర్బన ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా లేని అన్ని వాహనాలను నిషేధిస్తూ అత్యున్నత న్యాయస్థానం బుధవారం తీర్పు జారీ చేసింది.
⇔ సుప్రీం కోర్టు తీర్పు...
⇔ ఏప్రిల్ 1 నుంచి విక్రయాలు, రిజిస్ట్రేషన్లపై నిషేధం
⇔ భారత్‌స్టేజ్ –4 ప్రమాణాలున్న వాటికే అనుమతి
⇔ ప్రజారోగ్యమే అత్యంత ప్రధానమన్న ధర్మాసనం
న్యూఢిల్లీ: రోజురోజుకు పెరిగిపోతున్న వాయు కాలుష్యం దేశ ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతుండడంతో భారత్ స్టేజ్ (బీఎస్)– 4 కర్బన ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా లేని అన్ని వాహనాలను నిషేధిస్తూ అత్యున్నత న్యాయస్థానం బుధవారం తీర్పు జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయి. సుప్రీం తీర్పు వాహన పరిశ్రమను షాక్‌కు గురిచేసింది. ఆటోమొబైల్ తయారీదారుల ప్రయోజనాల కంటే ప్రజల ఆరోగ్యమే చాలా చాలా ప్రధానమైందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
బీఎస్ – 4 ప్రమాణాలను అందుకోలేని వాహనాలను తయారీ దారులు గానీ, డీలర్లు గానీ ఏప్రిల్ 1 నుంచి విక్రయించడానికి అనుమతి లేదని జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, మోటారు వాహనాల చట్టం 1988 కింద బీఎస్ – 4 ప్రమాణాలను చేరుకోలేని వాహనాలను అధికారులు రిజిష్టర్ చేయరాదని కోర్టు ఆదేశించింది.
మార్చి 31లోపు వాహనాలు విక్రయమైనట్టు ఏదైనా రుజువు చూపిస్తే తప్ప వాటి రిజిస్ట్రేషన్‌కు ఏప్రిల్ 1 తర్వాత అవకాశం లేదని తేల్చి చెప్పింది. తమ తీర్పునకు గల పూర్తి కారణాలను తర్వాత వెల్లడిస్తామని పేర్కొంది. దేశవ్యాప్తంగా బీఎస్–4 ఉద్గార ప్రమాణాలు వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్ – 3 ప్రమాణాల వాహనాల విక్రయాలు, రిజిస్ట్రేషన్లను నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై వాదనలు విన్న సుప్రీంకోర్టు మంగళవారం తన తీర్పును రిజర్వ్ చేయగా బుధవారం ఆదేశాలు వెలువరించింది. బీఎస్ – 4 ప్రమాణాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తున్నాయన్న విషయంలో అవగాహన ఉన్నప్పటికీ వాహన తయారీదారులు అందుకు తగిన చర్యలు చేపట్టలేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.
కాగా, ఆటోమొబైల్ తయారీదారుల సంఘం సియామ్ బీఎస్ –3 ప్రమాణాల వాహనాలు ఎన్ని ఉన్నాయన్న విషయాన్ని ఇదివరకే సుప్రీం కోర్టుకు నివేదించింది. కంపెనీల వద్ద 8.24 లక్షల బీఎస్ – 3 వాహనాలు ఉన్నాయని, వీటిలో 96,000 వాణిజ్య వాహనాలు, 6 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలు, 40,000 త్రిచక్ర వాహనాలున్నట్టు తెలిపింది. గతంలో బీఎస్ – 2కి, బీఎస్ –3కి మారినప్పుడు పాత ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్పటికే మిగిలి ఉన్న వాహనాల విక్రయానికి అనుమతించిన విషయాన్నీ సియామ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
పర్యావరణ వేత్తల హర్షం
పర్యావరణ సంస్థలు మాత్రం సుప్రీం తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశాయి. వాయు కాలుష్యంపై పోరాటం దిశగా ఇది సరైన అడుగు అని అభివర్ణించాయి. బీఎస్ – 3 నుంచి, 4కి మారడం అన్నది చాలా అవసరమని, దీనివల్ల ఉద్గారాల పర్టిక్యుల్స్ గణనీయంగా తగ్గుతాయని పర్యావరణ నిపుణులు పేర్కొన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమ ప్రజారోగ్యం విషయంలో ఆందోళనలను పట్టించుకుని ముందుకు వెళ్లాల్సి ఉందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుమితారాయ్ చౌదరి పేర్కొన్నారు.
పరిశ్రమపై భారం: రాకేశ్‌బాత్రా
‘‘సుప్రీం తీర్పు కారణంగా మొత్తం ఆటోమొబైల్ సరఫరా వ్యవస్థకు ఇబ్బందులు ఏర్పడతాయి. బీఎస్ – 4 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాల తయారీ, జీఎస్టీ అమలుతో వ్యయాలు పెరిగిపోతాయి’’అని ఆటోమొబైల్ రంగ ప్రముఖుడు, ఈవై పార్ట్‌నర్ రాకేశ్ బాత్ర పేర్కొన్నారు.
ఆటో స్టాక్స్‌కు నష్టాలు
సుప్రీం తీర్పుతో ఆటోమొబైల్ స్టాక్స్ ధరలు బుధవారం స్టాక్ మార్కెట్లలో నష్టాలను చవిచూశాయి. హీరో మోటోకార్ప్ 3.15 శాతం, అశోక్‌లేలాండ్ 2.78 శాతం, భారత్ ఫోర్జ్ 1.30 శాతం, టాటా మోటార్స్ 0.70 శాతం వరకు
నష్టపోయాయి.
ఉన్న వాహనాల పరిస్థితి ఏంటి..?
బీఎస్ – 3 ఆటోమొబైల్ వాహనాల విక్రయాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించడంతో కంపెనీలు, డీలర్లకు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వాహన తయారీదారులు, డీలర్ల వద్ద ప్రస్తుతం కనీసం 7 లక్షలకు తక్కువ కాకుండా వాహనాలుంటాయని అంచనా. తాజా తీర్పు కారణంగా మార్చి 31తో మిగిలి పోయిన వాహనాలను ఎగుమతి చేయడం ఒక్కటే కంపెనీల ముందున్న మార్గంగా కనిపిస్తోంది. మధ్య ప్రాచ్య దేశాలు, ఆఫ్రికా, బంగ్లాదేశ్ తదితర మార్కెట్లలో ప్రస్తుతం బీఎస్ – 3 ప్రమాణాలే అమల్లో ఉన్నాయి.
కనుక ఆయా మార్కెట్లలో ఈ వాహనాల విక్రయానికి దాదాపు అవరోధాలుండవు. టాటా మోటార్స్ తన బీఎస్ – 3 వాహనాలను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసే అవకాశం ఉందని టైగర్ మోడల్ విడుదల సందర్భంగా కంపెనీ ఎండీ గుంటర్ బుచెక్ స్పష్టం చేశారు. తయారీదారుల నిర్వచనం ప్రకారం... ప్రస్తుతం విక్రయం అవుతున్న బీఎస్ – 3 ఇంజన్లు గల ద్విచక్ర, త్రిచక్ర, వాణిజ్య వాహనాలు బీఎస్ – 4 ప్రమాణాల ఇంజన్ల కంటే 80 శాతం ఎక్కువగా కాలుష్యాన్ని (పర్టిక్యులేట్ మ్యాటర్) గాల్లోకి విడుదల చేస్తాయి.
నిరాశపరిచింది: సియామ్
సుప్రీంకోర్టు తీర్పు తమను నిరాశపరిచిందని సియామ్ తెలిపింది. అయినప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించాల్సి ఉందని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ దాసరి అన్నారు. ప్రస్తుత చట్టం బీఎస్ – 3 వాహనాల విక్రయానికి అనుమతిస్తున్న వాస్తవాన్ని విస్మరించడం దురదృష్టకరమన్నారు. ‘‘ఏప్రిల్ 1 తర్వాత కూడా బీఎస్ – 3 వాహనాలను విక్రయించేందుకు ప్రభుత్వ నోటిఫికేషన్ అవకాశం కల్పించింది. ఇప్పుడు ఉన్నట్టుండి వాటిని నిషేధించారు.
ఇలా జరగడం నిరాశకు గురి చేసింది‘‘ అని అన్నారు. దేశవ్యాప్తంగా బీఎస్ – 4 ఇంధనం అందుబాటులో ఉందా అన్న అంశంపైనే పరిశ్రమ ఆందోళనగా దాసరి చెప్పారు. వాణిజ్య వాహన తయారీదారులు బీఎస్ – 4 యూనిట్లను 2010 నుంచే తయారు చేస్తున్నప్పటికీ ఇంధనం అందుబాటులో లేకపోవడంతో బీఎస్ – 3 వాహనాలను విక్రయిస్తున్నట్టు వెల్లడించారు. అశోక్‌లేలాండ్ ఎండీ కూడా అయిన దాసరి తాజా తీర్పు ప్రభావం తమ కంపెనీపై పరిమితమేనన్నారు.
కంపెనీల మాట ఇదీ...
బజాజ్ ఆటో: కొన్నింటికి వెల కట్టలేమని, ఇది మన చిన్నారుల భవిష్యత్తు కోసమని బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ సుప్రీం తీర్పునకు మద్దతుగా వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 1 నుంచి తయారీ, విక్రయాలు వద్దని చెప్పినప్పటికీ రాతపూర్వకంగా ఏముందో చూడాలన్నారు.
టయోటా: ‘‘భారత్‌లో మేము ప్రస్తుతం విక్రయిస్తున్న వాహనాలన్నీ బీఎస్ –4 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవే. ఏడాది క్రితమే బీఎస్ – 3 వాహనాల తయారీని నిలిపివేశాం. కాలుష్య ఉద్గారాలు, భద్రత విషయంలో మనం అంతర్జాతీయ ప్రమాణాలను చేరుకోవాల్సి ఉంది’’ అని టయోటా కిర్లోస్కర్ మోటార్ వీసీ విక్రమ్ కిర్లోస్కర్ పేర్కొన్నారు.
హోండా మోటార్‌సైకిల్: సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం. మా ఉత్పత్తులన్నీ బీఎస్ – 4 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవే.