ఆర్‌బీఐ, ఫెడ్ వైపు చూపు! | RBI policy, Fed moves and qtrly results to set Stock market | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ, ఫెడ్ వైపు చూపు!

Oct 28 2013 2:14 AM | Updated on Oct 1 2018 5:28 PM

ఇటు భారత్‌లో రిజర్వ్ బ్యాంక్.. అటు అమెరికాలో ఫెడరల్ రిజర్వ్‌లు చేపట్టనున్న పాలసీ సమీక్షలే స్టాక్ మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశించనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

ముంబై: ఇటు భారత్‌లో రిజర్వ్ బ్యాంక్.. అటు అమెరికాలో ఫెడరల్ రిజర్వ్‌లు చేపట్టనున్న పాలసీ సమీక్షలే స్టాక్ మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశించనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, 29న చేపట్టనున్న ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్షలో వడ్డీరేట్లను పావు శాతం పెంచొచ్చని ఇప్పటికే అత్యధికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క, 29, 30 తేదీల్లో జరగనున్న ఫెడ్ సమీక్ష కూడా దేశీ మార్కెట్లతోపాటు అంతర్జాతీయంగానూ కీలకం కానుంది. సహాయ ప్యాకేజీల కోత ప్రకటనేదీ ఉండకపోవచ్చనే అంచనాలు ఉన్న నేపథ్యంలో అందరి దృష్టీ ఫెడ్‌పైనే ఉంది. కాగా, కార్పొరేట్ కంపెనీల క్యూ2   ఫలితాలూ దేశీ మార్కెట్ల కదలికలకు కీలకమేనని నిపుణులు పేర్కొన్నారు. ఈ వారంలోనే భారతీ ఎయిర్‌టెల్, మారుతీ, డీఎల్‌ఎఫ్, ఎన్‌టీపీసీ, ర్యాన్‌బాక్సీ, డాక్టర్ రెడ్డీస్ వంటి బ్లూచిప్స్ ఫలితాలు రానున్నాయి.
 
ఒడిదుడుకులు ఉంటాయ్...
బీఎస్‌ఈ సెన్సెక్స్ గత శుక్రవారం 42 పాయింట్లు క్షీణించి 20,684 వద్ద ముగియడం తెలిసిందే. వారం మొత్తంలో 199 పాయింట్లను నష్టపోయింది. కాగా, రానున్న కొద్ది సెషన్లలో మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులు ఉండొచ్చని స్టాక్ బ్రోకర్లు చెబుతున్నారు. ఈ నెల ఆఖరిరోజైన 31న డెరివేటివ్స్(ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) కాంట్రాక్టుల ముగింపు ఉన్న నేపథ్యంలో ట్రేడర్లు తమ పొజిషన్ల రోలోవర్‌లపై నిర్ణయం తీసుకోనుండటమే దీనికి కారణమనేది వారి అభిప్రాయం.  నిఫ్టీకి అతిసమీప కాలంలో 6,100 పాయింట్ల స్థాయి చాలా కీలక మద్దతుగా కొనసాగనుందని జీఈపీఎల్ క్యాపిటల్ పేర్కొంది. ఒకవేళ 6,120-6,200 స్థాయికి బౌన్స్ అయినప్పటికీ.. 6,252 పాయింట్ల స్థాయికి మించి పుంజుకునే అవకాశాల్లేవని తెలిపింది.
 
15 సెన్సెక్స్ స్టాక్స్‌లో ఎల్‌ఐసీ రూ.14,500 కోట్ల పెట్టుబడులు
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ.. 15 బ్లూచిప్ సెన్సెక్స్ స్టాక్స్‌లో తన వాటాను మరింత పెంచుకుంది. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌లో ఈ కంపెనీలకు సంబంధించిన దాదాపు రూ.14,500 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసింది. కాగా, మరో 11 ఇతర బ్లూచిప్ కంపెనీల్లో ఎల్‌ఐసీ వాటా ఇదే కాలంలో తగ్గడం(రూ.9,500 కోట్ల విలువైన విక్రయాలు) గమనార్హం.

వెరసి సెన్సెక్స్ స్టాక్స్‌లో నికర పెట్టుబడులు రూ. 5,000 కోట్లుగా నమోదయ్యాయి. జిందాల్, పవర్ స్టీల్, సన్‌ఫార్మాలో ఎల్‌ఐసీకి గత కొద్ది త్రైమాసికాల్లో ఎలాంటి వాటా లేదు. కాగా, ఎల్‌ఐసీకి అత్యధికంగా 16.34 శాతం వాటా ఉన్న ఎల్‌అండ్‌టీలో సెప్టెంబర్ క్వార్టర్‌కు వాటా స్వల్పంగా పెరిగింది. ఇంకా వాటా పెరిగిన కంపెనీల్లో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, సెసాగోవా, మారుతీ, మహీంద్రా వంటివి ఉన్నాయి. వాటా తగ్గిన జాబితాలో హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, హిందాల్లో ప్రధానమైనవి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement