ఎన్నికల్లో రాహుల్ ‘వేషం’పై మీనమేషాలు | Rahul Gandhi may not be made Congress PM candidate | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో రాహుల్ ‘వేషం’పై మీనమేషాలు

Jan 16 2014 1:58 AM | Updated on Mar 18 2019 7:55 PM

మరో నాలుగు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ‘రాగా’ (రాహుల్‌గాంధీకి జాతీయ మీడియా పెట్టిన ముద్దుపేరు) పేరును ప్రకటిస్తారా?

* రాహుల్‌గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తారా? లేదా?..
* రేపటి ఏఐసీసీ భేటీపై ఉత్కంఠ

మరో నాలుగు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ‘రాగా’ (రాహుల్‌గాంధీకి జాతీయ మీడియా పెట్టిన ముద్దుపేరు) పేరును ప్రకటిస్తారా? లేదా? అనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. శుక్రవారం జరగబోయే ఏఐసీసీ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారని ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ప్రచారం జరిగింది. అయితే.. ఇప్పుడు అలా ప్రకటించే అవకాశాలు తక్కువని కాంగ్రెస్ వర్గాలు సంకేతాలిస్తున్నాయి. రాహుల్‌ను పార్టీ ప్రచార సారథిగా కానీ, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా (వర్కింగ్ ప్రెసిడెంట్‌గా) కానీ ప్రకటించవచ్చని పేర్కొంటున్నాయి. అయితే.. ఈ సంకేతాలు వ్యూహాత్మకమా? లేక నిజంగానే వెనకంజ వేస్తున్నారా? అన్నది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  - సాక్షి, న్యూఢిల్లీ
 
వ్యూహాత్మక ఎత్తుగడేనా?
రాహుల్‌గాంధీని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించబోతున్నారంటూ విస్తృతంగా ప్రచారం జరిగిన నేపథ్యంలో.. ఇప్పుడు అలాంటిదేమీ ఉండదని సంకేతాలు ఇవ్వటం కాంగ్రెస్ వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగా పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇలా చేయటం ద్వారా పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి ‘రాహుల్ ప్రధాని అభ్యర్థి’ డిమాండ్‌ను బలంగా ముందుకు తీసుకురావాలని.. పార్టీ కార్యకర్తలకు నైతిక బలాన్ని అందించేందుకు.. వారి ఒత్తిడికి తలవంచుతున్నామంటూ రాహుల్‌ను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశముందని వారు చెప్తున్నారు. రాహుల్‌ను తక్షణమే పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని.. ఇందుకోసం ఏఐసీసీలో బలంగా డిమాండ్ చేస్తామని ముంబై కాంగ్రెస్ ఎంపీ సంజయ్‌నిరుపమ్ బుధవారం స్పష్టంచేయటం గమనార్హం.
 
నిజంగానే వెనకంజ వేస్తున్నారా?
రాహుల్‌గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే ఒకవేళ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైతే ఆ నిందను రాహుల్ మోయాల్సి వస్తుందనే ఆందోళనతో కాంగ్రెస్ అధిష్టానం వెనకంజ వేస్తోందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ గుజరాత్‌లో మూడుసార్లు పార్టీని గెలిపించటం, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లారన్న ప్రచారం.. అంతటి రాజకీయ, పాలనా అనుభవం లేని రాహుల్‌కు ప్రతికూలాంశంగా మారుతుందని కాంగ్రెస్ జంకుతున్నట్లు వారు అంచనా వేస్తున్నారు. పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిని ఇప్పటికిప్పుడు ప్రకటించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ ఇటీవల పేర్కొనటం తెలిసిందే.
 
ఇప్పటికే రాహుల్ ‘సంసిద్ధం’
రాహుల్‌ను ప్రధాని పదవికి సన్నద్ధం చేయటం వేగంగా జరిగిపోతోందని ఇంకొందరు పరిశీలకులు గుర్తుచేస్తున్నారు. రాహుల్‌ను.. ఆయన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ ఆహార్యానికి అనుగుణంగా తీర్చిదిద్దటం.. రాహుల్‌ను సమర్థవంతమైన నాయకుడిగా విస్తృత ప్రచారం చేయటానికి 500 కోట్ల వ్యయంతో విదేశీ ప్రచార సంస్థలను రంగంలోకి దింపటం కూడా ఇందులో భాగంగానే వారు చెప్తున్నారు. రాహుల్ కూడా ‘‘నేను కాంగ్రెస్ పార్టీ సైనికుణ్ని.. పార్టీ ఏ పదవి అప్పగించినా బాధ్యతలు నిర్వర్తించేందుకు సిద్ధం’’ అని మంగళవారం ఒక హిందీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పటమూ.. ప్రధాని పదవికి తాను సిద్ధమని పరోక్షంగా చెప్పటమేనని వారు విశ్లేషిస్తున్నారు. ఆయన తొలిసారిగా బుధవారం కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీకి హాజరుకావటాన్ని ప్రస్తావిస్తున్నారు.
 
మరింత కీలక బాధ్యతల ఆలోచన
కాంగ్రెస్ సంప్రదాయం ప్రకారం ప్రధాని అభ్యర్థిని ఎన్నికలకు ముందే ప్రకటించటం ఎన్నడూ లేదు. ఈ నేపథ్యంలో రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించకుండానే.. ఆయనే ప్రధాని అభ్యర్థి అనే సంకేతాలను ఏఐసీసీ భేటీ వేదిక నుంచి పంపాలని అధిష్టానం భావిస్తున్నట్లు వినిపిస్తోంది. ఇందుకోసం పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్‌కు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పదోన్నతి ఇవ్వటం కానీ, లోక్‌సభ ఎన్నికల ప్రచార సారథిగా ప్రకటించటం కానీ చేయవచ్చని చెప్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement