
రష్యాలో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం!
అవినీతి వ్యతిరేక ఉద్యమం మరోసారి ఉవ్వెత్తున ఎగిసింది
మాస్కో: అవినీతి వ్యతిరేక ఉద్యమం రష్యాలో మరోసారి ఉవ్వెత్తున ఎగిసింది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విధానాలు, రాజకీయాలకు వ్యతిరేకంగా వేలాదిమంది రష్యన్లు సోమవారం రోడెక్కారు. పుతిన్ తీరును గట్టిగా విమర్శించే ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీకి మరోసారి జైలుశిక్ష విధించడంతో ఆయన పిలుపుమేరకు ఈ ఆందోళనలు జరిగాయి. రాజధాని మాస్కో సహా దాదాపు 100 నగరాలు, పట్టణాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. యువత స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసనల్లో పాల్గొన్నారు.
ఈ ఆందోళనలను అణగదొక్కేందుకు పుతిన్ సర్కారు త్రీవంగా ప్రయత్నిస్తోంది. ఎక్కడికక్కడ పోలీసులు నిరసనకారులపై విరుచుకుపడ్డారు. నిరసనకారులను పెద్దసంఖ్యలో అరెస్టు చేశారు. ఆందోళనకారులను రోడ్లపై ఈడ్చుకుపోయారు. ప్రతిపక్షనేతలు పలువురిని ముందస్తుగానే గృహనిర్బంధం చేశారు. మాస్కోలో 700మంది, సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో 300మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత మార్చ్‌లోనూ రష్యాలో అవినీతి వ్యతిరేక ఉద్యమం పుతిన్ సర్కార్‌ను బెంబేలెత్తించింది. 2012 తర్వాత పుతిన్‌ను సవాల్ చేస్తూ ఇంత పెద్ద ఎత్తున నిరసనలు జరగడం ఇదే తొలిసారి.