
ఆస్తి పన్ను మోత
రాష్ట్రంలో త్వరలోనే ఆస్తిపన్ను మోత మోగనుంది. పురపాలక సంస్థల్లో దాదాపు 30 శాతం పన్ను బాదుడుకు రంగం సిద్ధమవుతోంది.
30 శాతం వరకు బాదుడుకు రంగం సిద్ధం
⇒మున్సిపల్ కార్మికుల సమ్మె నేపథ్యంలో సర్కారు నిర్ణయం
⇒ఏడు నెలల కిందే ప్రభుత్వానికి ప్రతిపాదనలు
⇒ఇన్నాళ్లుగా పెండింగ్‌లో.. పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో తెరపైకి
⇒ వేతనాలు పెంచే యోచన.. భారాన్ని తట్టుకునేందుకు ఆస్తి పన్ను సవరణ
⇒ కొత్తగా ఏర్పడ్డ నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఇప్పటికే పెంపు
⇒ జీహెచ్‌ఎంసీ, 5 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో జనవరి నుంచి పెంపు!
హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలోనే ఆస్తిపన్ను మోత మోగనుంది. పురపాలక సంస్థల్లో దాదాపు 30 శాతం పన్ను బాదుడుకు రంగం సిద్ధమవుతోంది. పదమూడేళ్ల తర్వాత నివాస గృహాలపై పన్ను పోటు పడనుంది. ఆస్తిపన్ను పెంపుపై కొద్దినెలల కిందే ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చినా.. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె, వేతనాల పెంపు నేపథ్యంలో ఇప్పుడు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలని భావిస్తోంది. రాష్ట్రంలోని 23 కొత్త నగర పంచాయతీలు, 3 కొత్త మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను సవరణ గత ఏడాదే అమల్లోకి వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ సహా మిగతా 5 మున్సిపల్ కార్పొరేషన్లు, 36 మున్సిపాలిటీల్లో ఆస్తిపన్నులను సవరించనున్నారు.
ఏడు నెలల కిందే..: రాష్ట్రంలో ఆరు నగర పాలక సంస్థలు, 62 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు కలిపి మొత్తం 68 పురపాలక సంస్థలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన 31 నగర పంచాయతీల్లో మున్సిపల్ చట్టాలకు అనుగుణంగా ఆస్తిపన్నుల పెంపును గతేడాది అక్టోబర్‌లోనే ప్రభుత్వం అనుమతించగా.. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. మిగతా పురపాలక సంస్థల్లో ఆస్తిపన్నుల పెంపు కోసం గత జనవరిలోనే ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రతిపాదనలు అందాయి.
అక్టోబర్ 1 నుంచే పన్నుల పెంపును అమల్లోకి తెచ్చేందుకు పురపాలక శాఖ ప్రభుత్వ అనుమతి కోరింది. అప్పటి నుంచి పెండింగ్‌లో ఉంచిన ఈ ప్రతిపాదనలపై పారిశుద్ధ్య కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయం తీసుకోబోతోంది. ప్రస్తుతం ఆస్తిపన్నుల సవరణకు ప్రభుత్వం అనుమతించినా.. శాస్త్రీయ పద్ధతిలో ప్రక్రియ పూర్తయి, అమల్లోకి వచ్చేందుకు దాదాపు ఆర్నెల్లు పడుతుంది. అంటే వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి వచ్చే అవకాశముంది. ఆ తర్వాత పన్ను చెల్లింపుదారులకు డిమాండ్ నోటీసుల జారీ, చెల్లింపులకు గడువు, వసూళ్ల తర్వాతే మున్సిపాలిటీల ఖాతాల్లో నిధులు చేరుతాయి. ఈ లెక్కన పన్నుల పెంపునకు అనుమతించాక ఏడాది తర్వాతగానీ మున్సిపాలిటీలకు లబ్ధి చేకూరదని అధికారులు చెబుతున్నారు. దాదాపు 30 శాతం వరకు పన్నులు పెరగవచ్చని పేర్కొంటున్నారు.
ఇక పెంచక తప్పదు..
మున్సిపల్ తాత్కాలిక కార్మికుల సమ్మె నేపథ్యంలో.. వారి వేతనాల పెంపుపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. తాత్కాలిక కార్మికుల వేతనాలను పురపాలికలే చెల్లిస్తాయి. దీంతో వేతనాల పెంపుపై అన్ని పురపాలక పాలక మండళ్ల అభిప్రాయాన్ని ప్రభుత్వం సేకరించింది. ఆస్తిపన్నులు పెంచకుండా ఉన్నఫళంగా వేతనాలను పెంచితే.. భరించడం తమ వల్ల కాదని పురపాలికలు తేల్చిచెప్పాయి. దీంతో అన్ని పురపాలక సంస్థల ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం వాస్తవ నివేదికను తెప్పించుకోగా... విస్మయకర అంశాలు వెలుగు చూశాయి. అసలు మున్సిపాలిటీలకు ఆస్తిపన్నులే అతిపెద్ద ఆదాయ వనరు. ఏళ్ల తరబడి దీనిని సవరించకపోవడంతో ఆర్థికంగా కుంగిపోయాయి.
కేంద్ర, రాష్ట్రాల నుంచి వచ్చే గ్రాంట్లు సైతం సకాలం అందుతుండక పోవడంతో.. వేగంగా జరుగుతున్న పట్టణీకరణకు తగినట్లుగా ప్రజలకు మౌలిక వసతులు కల్పించలేకపోతున్నాయి. 25 మున్సిపాలిటీలు ప్రస్తుత వేతనాలనే కార్మికులకు సరిగా చెల్లించడం లేదు. మిగతా మున్సిపాలిటీలు సైతం మూడు, నాలుగు నెలలకోసారి కష్టంగా చెల్లిస్తున్నాయి. మున్సిపాలిటీలు నీటి సరఫరా, వీధి దీపాలకు సంబంధించిన రూ.150 కోట్లకుపైగా విద్యుత్ బిల్లులను విద్యుత్ శాఖకు బకాయిపడ్డాయి. ఇంకా ఈఎస్‌ఐ, పీఎఫ్‌కు సంబంధించిన బకాయిలూ భారీగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపుపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. వేతనాల పెంపుతో పాటు ఆస్తిపన్నులు పెంచుకునేందుకు మున్సిపాలిటీలకు అవకాశమివ్వాలని భావిస్తోంది.
13 ఏళ్ల తర్వాత..
శాస్త్రీయంగా ఆస్తిపన్నుల గణనను ప్రవేశపెడుతూ 1990లో నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. దానిప్రకారం ప్రకారం ప్రతి ఐదేళ్లకోసారి క్రమం తప్పకుండా ఆస్తిపన్నులను పెంచాలి. కానీ ఆస్తిపన్నుల తొలి సవరణ 1993 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రాగా.. తర్వాత ఎనిమిదేళ్లకు 2002 ఏప్రిల్ 1 నుంచి రెండో సవరణను అమలు చేశారు. ఆ తర్వాత ఇప్పటివరకు నివాస గృహాలపై ఆస్తిపన్నును పెంచలేదు. అయితే 2007 అక్టోబర్ 1 నుంచి మాత్రం మూడో సవరణగా నివాసేతర కట్టడాలకు మాత్రం ఆస్తిపన్నును సవరించారు. ఆ తర్వాత ఓ సారి ఆస్తిపన్నుల పెంపునకు ప్రయత్నాలు జరిగినా మున్సిపల్, సాధారణ ఎన్నికల నేపథ్యంలో.. గత ప్రభుత్వాలు వెనక్కితగ్గాయి.