‘గ్రేటర్’ పోరుకు సిద్ధం | MP ponguleti Srinivas Reddy ready to ghmc elections | Sakshi
Sakshi News home page

‘గ్రేటర్’ పోరుకు సిద్ధం

Published Fri, Jan 8 2016 4:28 AM | Last Updated on Thu, Aug 9 2018 4:45 PM

‘గ్రేటర్’ పోరుకు సిద్ధం - Sakshi

‘గ్రేటర్’ పోరుకు సిద్ధం

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీకి తాము సిద్ధంగా ఉన్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీకి తాము సిద్ధంగా ఉన్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బుధవారం రాత్రి హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ను చంద్రబాబు తన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యా న్ని విస్తరించుకునే పనులకే ప్రాధాన్యం ఇవ్వ గా, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మహానగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేశారని పొంగులేటి గుర్తుచేశారు.

హైదరాబాద్ శివారు ప్రాంతాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడం మొదలుకొని ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే, మెట్రో రైలు ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపటం లాంటి ఎన్నో అభివృద్ధి పనులను వైఎస్‌ఆర్ చేశారన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఒక్క వైఎస్సార్‌సీపీకే ఉందని ఆయన చెప్పారు. ఓటర్లకు కూడా వైఎస్సార్ చేసిన మంచి పనులు గుర్తున్నాయన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో వైఎస్‌ఆర్ తనయ, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన పరామర్శ యాత్రలో ప్రజాస్పందనను, ప్రజలు చూపిన ఆదరణను చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు.

18 నెలల టీఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్‌కు చేసింది శూన్యమని పొంగులేటి విమర్శించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నామని, ఏ స్థానాన్నీ వదులుకోమని ఆయన తేల్చి చెప్పారు. డివిజన్‌లలోని నాయకులు వైఎస్సార్ చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పొంగులేటి సూచించారు. బస్తీల్లోని ప్రజాసమస్యలపై పోరాడుతూ ప్రజల మన్నలు పొందిన, వారి అండదండలున్న నేతలనే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థులుగా దించుతామన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆదం విజయ్ కుమార్, జి.సురేష్‌రెడ్డి, ముఖ్య నాయకులు ధనలక్ష్మి, కె.శివకుమార్, నల్లా సూర్యప్రకాశ్, బి.సాయినాథ్ రెడ్డి, గట్టు శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
 
గ్రేటర్ ప్రజలకు కృతజ్ఞతలు...
గ్రేటర్ హైదరాబాద్‌లో 5, 6, 7 తేదీల్లో షర్మిల చేపట్టిన పరామర్శ యాత్రలో పాల్గొన్న ప్రజలు, పార్టీ నాయకులకు పొంగులేటి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం న్యూ బోయినపల్లి శ్రీలత గార్డెన్ వద్ద యాత్ర ముగిసిన అనంతరం ఆయన నిజామాబాద్ వెళ్తూ ‘సాక్షి’తో మాట్లాడారు. మూడు రోజుల పరామర్శ యాత్రలో నగర ప్రజలు వైఎస్సార్ తనయ షర్మిలకు నీరాజనాలు పలికారన్నారు. వైఎస్సార్ పథకాలతో లబ్ధిపొందినవారు...తమకు జరిగిన మేలును నేరుగా షర్మిలతో గుర్తుచేసుకున్నారన్నారు. ప్రజల గుండెల్లో ఇప్పటికీ దివంగత మహానేత గూడు కట్టుకొని ఉన్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement