
అద్వానీ గది తిరిగి ఆయనకే
బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ అభిలాషను కేంద్రం మన్నించింది.
న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ అభిలాషను కేంద్రం మన్నించింది. పార్లమెంటులో ఇంతకుముందు వినియోగించుకున్న గదినే ప్రభుత్వం తిరిగి ఆయనకు కేటాయించింది. అయితే, అద్వానీ నేమ్‌ప్లేట్ లో మార్పు చోటు చేసుకుంది. గతంలో అద్వానీ నేమ్ ప్లేట్‌పై ఎన్డీయే కార్యనిర్వాహక చైర్మన్ అని ఉండగా... దాన్ని తీసివేశారు. దీంతో తన గదిలో అద్వానీ మంగళవారం కొద్దిసేపు కూర్చుని వెళ్లారు. గతంలో తాను ఉపయోగించిన గది వెలుపల తన నేమ్‌ప్లేట్‌ను తొలగించడంతో అద్వానీ గతవారం అసంతృప్తికి లోనైన విషయం తెలిసిందే.
దీనికి సూచనగా ఆయన ఎంపీల ప్రమాణ స్వీకారం రోజున లోక్‌సభలో ఎనిమిదో వరుసలో కూర్చున్నారు. పార్టీ సాధారణ నేతలు వినియోగించుకునే బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలోనే అద్వానీ కూర్చుంటున్నారు. దీంతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించారు. అద్వానీ గతంలో వినియోగించుకున్న గదినే వాడుకోనున్నారని మంగళవారం పార్లమెంట్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.