‘బొగ్గు’ ఫైళ్ల గల్లంతుపై ప్రభుత్వానికి, ప్రధాన ప్రతిపక్షానికి నడుమ మళ్లీ ప్రతిష్టంభన ఏర్పడింది.
న్యూఢిల్లీ: ‘బొగ్గు’ ఫైళ్ల గల్లంతుపై ప్రభుత్వానికి, ప్రధాన ప్రతిపక్షానికి నడుమ మళ్లీ ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ అంశంపై మంగళవారం ఉభయ సభల్లోనూ రభస సాగింది. గల్లంతైన ఫైళ్లను కనుగొనేందుకు కృషి చేస్తామని, ఫైళ్ల గల్లంతుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ ప్రధాని మన్మోహన్ సింగ్ ఉభయ సభల్లోనూ ప్రకటన చేసినా, విపక్షం శాంతించలేదు.
పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రధాని మన్మోహన్ మంగళవారం రాత్రి తన నివాసంలో బీజేపీ నేతలు అద్వానీ, సుష్మా స్వరాజ్, జైట్లీలతో గంటన్నర సేపు చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. కీలకమైన ఆర్థిక బిల్లుల ఆమోదానికి సహకరించాల్సిందిగా ప్రధాని వారిని కోరినా, వారు ఎలాంటి హామీ ఇవ్వలేదు. కాగా, ప్రధాని ప్రకటన చేసిన వెంటనే బయటకు వెళ్లిపోవడంపై బీజేపీ కినుక బూనింది. ప్రధాని నుంచి తాము వివరణలు కోరాలనుకున్నా, అందుకు అవకాశం లభించలేదని బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. లోక్‌సభ స్పీకర్ నిర్వహించిన సమావేశాన్నీ బహిష్కరించారు.