ఇరాక్ విడిపోవచ్చు.. జాగ్రత్త!! | Sakshi
Sakshi News home page

ఇరాక్ విడిపోవచ్చు.. జాగ్రత్త!!

Published Thu, Jun 26 2014 10:40 AM

ఇజ్రాయెల్ అధ్యక్షుడు షిమోన్ పెరెజ్ - Sakshi

వర్గ వైరుధ్యంతో అతలాకుతలం అవుతున్న ఇరాక్ ఇక ఎన్నాళ్లో ఒక్క దేశంగా ఉండే అవకాశం లేదని, త్వరలోనే అది విడిపోవచ్చని ఇజ్రాయెల్ అధ్యక్షుడు షిమోన్ పెరెజ్ హెచ్చరించారు. వైట్హౌస్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలిసిన సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. అధికారిక పర్యటన కోసం పెరెజ్ అమెరికా వచ్చినట్లు సిన్హువా వార్తాసంస్థ తెలిపింది. ఇరాక్ ఒకటిగా ఉంటే చాలా బాగుండేదని ఒబామాతో పెరెజ్ అన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ అది సాధ్యమ్యే పరిస్థితులు కనిపించడం లేదని కూడా ఆయన అన్నారు.

ఒకవేళ ఇరాక్ ఒకటిగా ఉండాలంటే అమెరికా తప్పనిసరిగా అక్కడకు బలమైన సైన్యాన్ని పంపి మూడు వర్గాలను ఒకటిగా చేయాలని పెరెజ్ సూచించారు. సైన్యం అలా చేస్తుందని తాను అనుకోవట్లేదని, అలాగే అక్కడి వర్గాలు కూడా అందుకు అంగీకరిస్తాయని భావించట్లేదని తెలిపారు. ఒబామా, పెరెజ్ కలిసి అమెరియన్ యూదు నాయకులను కూడా కలిసి వారితో భోజనం చేశారు. 65 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన పెరెజ్.. వచ్చే నెలతో ఇజ్రాయెల్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోతున్నారు. అమెరికా కాంగ్రెస్ ఆయనకు కాంగ్రెషనల్ స్వర్ణపతకాన్ని బహూకరించే అవకాశం ఉంది.

Advertisement
Advertisement