
అమెరికాలో దౌత్యవేత్త అరెస్ట్ అవమానకరం: ఖుర్షీద్
అమెరికాలో భారత దౌత్యవేత్త పట్ల అమర్యాదగా ప్రవర్తించడాన్ని విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తప్పుబట్టారు.
ఫర్కుహాబాద్: అమెరికాలో భారత దౌత్యవేత్త పట్ల అమర్యాదగా ప్రవర్తించడాన్ని విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తప్పుబట్టారు. డిప్యూటీ కాన్సుల్ జనరల్ దేవయాని ఖోబ్రాగాదేను నడిబజార్‌లో అరెస్ట్‌చేసి, చేతికి సంకెళ్లు వేయడం అవమానకరమని ఆయన అన్నారు. తాము ఈ ఘటనను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని ఖుర్షీద్ ఆదివారమిక్కడ విలేకరులతో పేర్కొన్నారు. దీనిపై అమెరికా స్పందన కోసం ఎదురుచూస్తున్నామని, దాన్నిబట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తన ఇంట్లో పనిచేస్తున్న మహిళ వీసా పత్రాల్లో తప్పుడు సమాచారమిచ్చారన్న ఆరోపణలపై 1999 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారిణి అయిన దేవయానిని న్యూయార్క్ పోలీసులు అరెస్ట్‌చేసిన సంగతి తెలిసిందే.