
ఆ కిరాతకుడు ఒక్కడే!
జర్మనీలోని మ్యూనిక్ నగరంలో మారణకాండకు దిగిన ఉగ్రవాది ఒక్కడేనని, తొమ్మిదిమందిని కాల్చిచంపిన ఆ సాయుధుడు అనంతరం తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
మ్యూనిక్: జర్మనీలోని మ్యూనిక్ నగరంలో మారణకాండకు దిగిన ఉగ్రవాది ఒక్కడేనని, తొమ్మిదిమందిని కాల్చిచంపిన ఆ సాయుధుడు అనంతరం తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. మ్యూనిక్ నగరంలోని ఒలింపియా షాషింగ్ కాంప్లెక్స్‌లోకి చొరబడిన సాయుధుడు విచ్చలవిడిగా కాల్పులు జరుపుతూ ఉగ్రబీభత్సానికి తెగబడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొదట ముగ్గురు ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు వార్తలు వచ్చాయి.
అయితే, కాల్పులకు తెగబడింది ఒక్కడేనని తెలుస్తున్నదని, 18 ఏళ్ల జర్మన్-ఇరానీయన్ ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితుడికి ద్వంద్వ పౌరసత్వం ఉందని, అతనికి ఎలాంటి నేరచరిత్రలేదని స్పష్టం చేశారు.
వారంలోపే యూరప్‌లో జరిగిన మూడో ఉగ్రవాద దాడి ఇది కావడం గమనార్హం. తాజా ఘటన జర్మనీని షాక్ గురిచేసింది. సాయంకాలంపూట మ్యూనిక్ నగరంలో షాపింగ్ చేస్తుండగా.. ఒక్కసారిగా సాయుధుడు విరుచుకుపడి.. పైశాచికంగా కాల్పులు జరపడంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకొని పరుగులు తీశారు. ఈ దాడిలో తొమ్మిది మంది ప్రాణాలు వదిలారు. అతడు ఎందుకీ దారుణానికి ఒడిగట్టాడో ఇంకా తెలియరాలేదని, ఇందుకు ప్రేరణ ఏమిటో తెలియదని పోలీసులు తెలిపారు.