కిరణే సమైక్య ఉద్యమానికి విలన్ : శ్రీకాంత్‌రెడ్డి | Gadikota Srikanth reddy takes on Kiran kumar reddy | Sakshi
Sakshi News home page

కిరణే సమైక్య ఉద్యమానికి విలన్ : శ్రీకాంత్‌రెడ్డి

Nov 17 2013 12:36 AM | Updated on Jul 29 2019 5:31 PM

కిరణే సమైక్య ఉద్యమానికి విలన్ : శ్రీకాంత్‌రెడ్డి - Sakshi

కిరణే సమైక్య ఉద్యమానికి విలన్ : శ్రీకాంత్‌రెడ్డి

సమైక్యం ముసుగులో రాష్ట్ర విభజనకు అన్ని రకాలుగా కేంద్రానికి సహకరిస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలుగు ప్రజల హృదయాల్లో జీవితకాలం విలన్‌గా నిలిచిపోతారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు.

 సమైక్యం ముసుగులో విభజనకు సహకారం
 ఆనాడే రాజీనామా ఎందుకు చేయలేదు

 
 సాక్షి, హైదరాబాద్: సమైక్యం ముసుగులో రాష్ట్ర విభజనకు అన్ని రకాలుగా కేంద్రానికి సహకరిస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలుగు ప్రజల హృదయాల్లో జీవితకాలం విలన్‌గా నిలిచిపోతారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి  ఆరోపించారు.  సమైక్య పేరుతో తెలుగు ప్రజలను మోసగించడం సమంజసంకాదని  ఆయన అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ,ముఖ్యమంత్రికి మూడు ప్రశ్నలు సంధించారు.‘జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సమైక్యానికి అనుకూలంగా రిపోర్టు ఇచ్చిన తర్వాత ఢిల్లీ పెద్దలు దాన్నే ప్రకటిస్తామంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా దాన్ని అంగీకరించకపోగా, నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం కాదా?, జూలై 30న సీడబ్ల్యూసీ రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న రోజే సీఎం పదవికి రాజీనామా చేసి ఉంటే విభజన ప్రక్రియ నిలిచిపోయేది కాదా?
 
 రాష్ట్ర అసెంబ్లీని ఏర్పాటుచేసి విభజనకు వ్యతిరేకంగా, సమైక్య తీర్మానం చేయాలని మా అధ్యక్షుడు జగన్ ఎన్నిసార్లు కోరినా,ఏమాత్రం పట్టనట్టు నోరు మెదపకుండా ఉన్నది నిజం కాదా?’ అని శ్రీకాంత్‌రెడ్డిప్రశ్నించారు.సమైక్యం పట్ల కిరణ్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. కిరణ్ చేతకాని తనాన్ని మూడున్నరేళ్లుగా ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, విభజన విషయంలో మరోసారి తేటతెల్లమైందన్నారు. గతంలో రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ నిర్ణయిస్తే దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించి,సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యకతను వివరించి ఒప్పించగలిగారని తెలిపారు.రచ్చబండ కార్యక్రమాల్లో ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్న కిరణ్ అవే మాటలను సీడబ్ల్యూసీ ముందు, సోనియా నివాసం టెన్‌జన్‌పథ్ వద్ద అందరికీ వినబడేటట్టుగా ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు.
 
 చంద్రబాబు, కిరణ్‌లు సమైక్య ద్రోహులే...
 చిత్తూరు జిల్లాకు చెందిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు ఇద్దరూ సమైక్య ద్రోహులే అని శ్రీకాంత్ పేర్కొన్నారు. ఇద్దరూ సోనియా ఇచ్చిన స్క్రిప్టుతో తోలుబొమ్మలుగా నటిస్తున్నారని ధ్వజమెత్తారు. విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను సోనియా ఆదేశాల మేరకే  చంద్రబాబు ఉపసంహరించుకోవడంలేదన్నారు. మరోపక్క కిరణ్ తన కింద పనిచేస్తున్న అధికారులను ఢిల్లీకి పంపి విభజనకు అటంకం కలగకుండా కేంద్రానికి సహకరించడమేగాక, విభజన కోసం ప్రత్యేక నివేదికలు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.
 
 మూడున్నర నెలలుగా ఉద్యోగులు ‘జీతాలు కాదు జీవితాలు ముఖ్యం’ అనే విధంగా ఉద్యమిస్తే, ఒక పథకం ప్రకారం తానుండగా విభజన జరగదంటూ కిరణ్ ఉద్యమానికి వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు. విభజనను అడ్డుకునేందుకు కిరణ్ చేసిన ప్రయత్నాలేంటో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజల్లో ఎనలేని ఆదరాభిమానాలున్న వైఎస్సార్‌సీపీపై బురద చల్లడమే పనిగా ఆ రెండు పార్టీలు పనిచేస్తున్నాయన్నారు. ఆల్‌పార్టీ మీటింగ్‌లో వైఎస్సార్‌సీపీ చాలా స్పష్టంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను దుర్వినియోగపరచకుండా అన్ని ప్రాంతాల వారు సంతోషంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరితే దాన్ని తప్పుపడుతున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement