ఈ ఏడాది వృద్ధి 5% పైనే!

ఈ ఏడాది వృద్ధి 5% పైనే!


ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలోపడుతున్న సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయని ఆర్థిక మంత్రి పి. చిదంబరం పేర్కొన్నారు. ఈ ఏడాది(2013-14) ద్వితీయార్ధంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు పుంజుకోనుందని.. పూర్తి సంవత్సరానికి 5-5.5 శాతం వృద్ధి నమోదవ్వొచ్చని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం ఇక్కడ బ్యాంకాన్-2013 సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ), బ్యాంక్ ఆఫ్ ఇండియాలు సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి.

 

 రుణ ఎగవేతలపై..: కావాలనే రుణాలను ఎగ్గొట్టేవారిని ఉపేక్షించొద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లకు చిదంబరం మరోమారు స్పష్టం చేశారు. అయితే, ఆర్థిక మందగమనం ప్రభావంతో బకాయిపడుతున్న కార్పొరేట్లకు మాత్రం కాస్త చేదోడుగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.




 దర్యాప్తు సంస్థలపై విసుర్లు...: కాగా, బ్యాంకులు తీసుకొనే  వాణిజ్యపరమైన నిర్ణయాలన్నింటినీ దురుద్దేశపూరితమైనవిగా లేదంటే కుట్రపూరితమైనవిగా చూడకూడదని దర్యాప్తు సంస్థలకు చిదంబరం హితవుపలికారు. వాటి పరిధిమేరకు వ్యవహరించాలని సూచించారు. ‘ప్రతి నిర్ణయాన్నీ ఇలాగే ప్రశ్నిస్తే వ్యాపారాలు నడవవు. ఎవరూ నిర్ణయాలు తీసుకోవడానికే ముందుకురారు. కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో తప్పయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగని అవన్నీ నేరపూరితమైనవిగా పరిగణించలేం. దర్యాప్తు సంస్థలు ఇలాంటి ప్రమాదరకరమైన ధోరణిలో వెళ్లకూడదు’ అని చిదంబరం పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బ్యాంకర్లు తీసుకునే ఎలాంటి నిర్ణయాలకైనా ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని ఈ సందర్భంగా హామీనిచ్చారు.

 

 ద్రవ్యలోటు, క్యాడ్‌ను కట్టడిచేస్తాం...

 ‘ద్రవ్యలోటును జీడీపీలో 4.8 శాతానికి, కరెంట్ అకౌంట్ లోటును 56 బిలియన్ డాలర్ల కంటే తక్కువకు(3% లోపే) కట్టడి చేస్తాం. ద్రవ్యోల్బణం ఆందోళనలు కొనసాగుతున్నప్టటికీ ఈ లక్ష్యాలను సాకారం చేయగలమన్న నమ్మకం ఉంది’ అని చిదంబరం పేర్కొన్నారు. గతేడాది జీడీపీ వృద్ధి రేటు పదేళ్ల కనిష్టానికి(5 శాతం) పడిపోగా... ఈ ఏడాది తొలి త్రైమాసికం(ఏప్రిల్-జూన్, క్యూ1)లో 4.4%కి దిగజారడం  తెలిసిందే. గతేడాది క్యాడ్ చరిత్రాత్మక గరిష్టానికి(4.8 శాతం-88.2 బిలియన్ డాలర్లు), ఈ క్యూ1లో 4.9 శాతానికి ఎగబాకింది. కాగా, అక్టోబర్‌లో ఎగుమతులు 13.4 శాతం వృద్ధి చెందగా.. సెప్టెంబర్‌లో కీలకమైన 8 మౌలిక రంగ పరిశ్రమల ఉత్పాదకత వృద్ధి అత్యంత మెరుగ్గా 8 శాతానికి(11 నెలల గరిష్టం) ఎగసింది. ఇక సెప్టెంబర్‌లో పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) వృద్ధి సైతం మెరుగ్గానే 2%కి పెరిగింది(ఆగస్టులో 0.43%). నిత్యావసరాల ధరలు ఎగబాకడం ఆందోళనమైన అంశమేనని విత్తమంత్రి వ్యాఖ్యానించారు. అక్టోబర్‌లో టోకు ధరల ద్రవ్యోల్బణం 7 శాతానికి(8 నెలల గరిష్టం) ఎగబాకగా.. రిటైల్ ద్రవ్యోల్బణం ఏడు నెలల గరిష్టస్థాయిలో  10.09%కి పెరిగిపోయింది.

 

 5వేల కోట్ల సమీకరణ: ఎస్‌బీఐ చీఫ్ అరుంధతి

 బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాండ్ల (రుణ) మార్గంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.5,000 కోట్ల వరకూ సమీకరించనుంది. కచ్చితంగా ఎంత సమీకరించాలన్న అంశంపై ఇంకా నిర్ణయానికి రాకున్నప్పటికీ, ఈ మొత్తం దాదాపు రూ.5,000 కోట్ల రేంజ్‌లో ఉంటుందని చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య శుక్రవారం వెల్లడించారు. ఇక్కడ జరిగిన బ్యాంకాన్-2013  వార్షిక సదస్సుకు హాజరైన ఆమె ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. రిటైల్ రంగంలో రుణ వృద్ధిపై తమ బ్యాంక్ అత్యధిక దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. ఆర్థిక రంగంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ, 2013-14లో ఎస్‌బీఐ 16 నుంచి 18 శాతం శ్రేణిలో రుణ వృద్ధిని సాధిస్తుందన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు.

 

 నిరాశావాదానికి మందు అవసరం: ఆర్‌బీఐ గవర్నర్ రాజన్

 నిరాశావాదంపై రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ ఆందోళన వెలిబుచ్చారు. దేశంలో విధాన నిర్ణయాల్లో ఆలస్యానికి, వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోలేకపోవడానికి నిస్పృహతత్వమే కారణమని విశ్లేషించారు. ఇక్కడ జరుగుతున్న బ్యాంకాన్ సదస్సును ఉద్దేశించి రాజన్ మాట్లాడారు.  ఏ నిర్ణయం తీసుకున్నా.. దాని ఫలితంపై ముందే అనుమాన ధోరణి పనికిరాదని అన్నారు. దీనికి తగిన పరిష్కారం అవసరమని చెప్పారు. తీసుకున్న నిర్ణయం ఉపయుక్తమైనదిగా, పక్షపాతరహితం, సమర్థవంతనీయంగా ఉండాలన్నారు. ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు ఆర్‌బీఐ రానున్న కొద్ది త్రైమాసికాల్లో ఐదంచెల వ్యూహాన్ని అవలంబించనున్నట్లు వెల్లడించారు. పరపతి విధి విధానాల స్పష్టత-పటిష్టత, బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టత,  ఫైనాన్షియల్ మార్కెట్ల విస్తృతి. అవసరం ఉన్న వారికందరికీ రుణ సదుపాయాల కల్పన, ఆర్థిక, కార్పొరేట్ సంస్థల సవాళ్లను అధిగమించగలిగిన స్థాయిలో వ్యవస్థ మెరుగుదలగా వీటిని పేర్కొన్నారు.

 

 ఆ రెండే రూపాయి దిశను నిర్దేశిస్తాయ్: కొచర్

 అమెరికా సహాయక ప్యాకేజీల ఉపసంహరణ అంశం, అలాగే చమురు మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ) డాలర్ల డిమాండ్ భవిష్యత్తులో రూపాయి గమనాన్ని కొంతవరకూ నిర్దేశిస్తాయని ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో చందా కొచర్ శుక్రవారం పేర్కొన్నారు. ఆయా అంశాలతోపాటు భారత్ వృద్ధి అవకాశాలు, గ్లోబల్ ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంపు వంటి అంశాలు సైతం రూపాయి కదలికలకు కారణమవుతాయని అన్నారు. ఇక్కడ బ్యాంకాన్ సదస్సుకు హాజరైన ఆమె ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.  డిపాజిట్ రేట్ల మార్పునకు సంబంధించి పరిస్థితిని ఐసీఐసీఐ బ్యాంక్ గమనిస్తోందని అన్నారు. దీనిపై ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మాత్రం ఆమె వెల్లడించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top