నగరానికి ‘బ్రిక్స్’ సొగసులు! | Sakshi
Sakshi News home page

నగరానికి ‘బ్రిక్స్’ సొగసులు!

Published Sun, Oct 25 2015 3:35 AM

నగరానికి ‘బ్రిక్స్’ సొగసులు! - Sakshi

- అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాల కోసం సర్కార్ యోచన
- ఎన్‌డీబీ బ్రిక్స్, ఏఐఐబీ నిధులకు ప్రభుత్వం కసరత్తు
- ప్రభుత్వానికి నివేదికను సమర్పించిన జీహెచ్‌ఎంసీ
- తుది పరిశీలన అనంతరం సంబంధిత సంస్థలకు నివేదికలు
- నివేదికను ఆమోదిస్తే రూ. 21,877 కోట్ల రుణం
- ఎస్సార్‌డీపీ.. నాలాల ఆధునీకరణకు తొలి ప్రాధాన్యం
- ఐదేళ్లలో పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు
- ఇవి పూర్తయితే 30 ఏళ్ల పాటు సౌకర్యవంతమైన జీవనం

 
సాక్షి, హైదరాబాద్: విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం నిధుల వేటను ప్రారంభించింది. అంతర్జాతీయస్థాయి నగరాలకు దీటుగా హైదరాబాద్ రూపురేఖలను మార్చేందుకు ప్రపంచస్థాయి ఆర్థిక సంస్థల నుంచి నిధులు తీసుకోవాలని భావిస్తోంది. విశ్వనగర పనుల్లో భాగంగా నగరంలో ‘ఫ్లైఓవర్ల’ వంటివి నిర్మించేందుకు స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్(ఎస్సార్‌డీపీ)ను జీహెచ్‌ఎంసీ సిద్ధం చేసింది. ఈ పనుల కోసం కాంట్రాక్టర్లే తొలుత పెట్టుబడి పెట్టే ‘యాన్యుటీ’ విధానంలో టెండర్లు పిలిచినా స్పందన లేకపోవడంతో ప్రపంచ స్థాయి ఆర్థిక సంస్థలైన న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ బ్రిక్స్(ఎన్‌డీబీ బ్రిక్స్), ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్(ఏఐఐబీ)ల నుంచి రుణం తీసుకోవాలని భావిస్తోంది. ఈ సంస్థల నుంచి రుణాలు పొందేందుకు అవసరమైన నివేదికల్ని జీహెచ్‌ఎంసీ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించింది.
 
 తుది పరిశీలన అనంతరం ప్రభుత్వం సంబంధిత ఆర్థిక సంస్థలకు ఈ నివేదికలను పంపనుంది. ఎన్‌డీబీ బ్రిక్స్ నుంచి ఎక్కువ నిధులు పొందాలని సర్కారు భావిస్తోంది. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్, జైకా తరహాలో ఎన్‌డీబీ బ్రిక్స్ ఆర్థిక సాయం అందజేయనుండంతో ఈ ప్రయత్నాలను ప్రారంభించింది. చైనాలోని షాంఘై కేంద్రంగా ఏర్పాటైన ఎన్‌డీబీ బ్రిక్స్ బ్యాంక్ వచ్చే ఏడాది నుంచి ఇలాంటి రుణాలు మంజూరు చేయనుంది. ఎన్‌డీబీ బ్రిక్స్, ఏఐఐబీలు ఈ నివేదికలను ఆమోదిస్తే రూ. 21,877 కోట్లు రుణంగా రాష్ట్రానికి అందుతాయి. ఎస్సార్‌డీపీ, నాలాల ఆధునీకరణలకు కావాల్సిన మొత్తం రూ. 31,254 కోట్లు అవసరమని అధికారుల అంచనా. ఇందులో ఎస్సార్‌డీపీ పనులకు రూ. 24,500 కోట్లు, నాలాల ఆధునీకరణ పనులకు రూ. 6,754 కోట్లు అవసరమని భావిస్తున్నారు. ఎన్‌డీబీ బ్రిక్స్, ఏఐఐబీల రుణం కాక.. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ భరించనున్నాయి. ఐదేళ్లలో ఈ పనులు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.
 
ఎస్సార్‌డీపీ.. నాలాల ఆధునీకరణ..
 హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు వివిధ అంశాలను అధ్యయనం చేశారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తాగునీటి సరఫరా, డ్రైనేజీ, రోడ్లు, జంక్షన్లు, ట్రాఫిక్ సిగ్నళ్లు, వీధి దీపాలు, మురికివాడలు, ఘనవ్యర్థాల నిర్వహణ, పార్కులు, ఖాళీ ప్రదేశాలు, ప్రభుత్వ భూములు, వరద సహాయక కేంద్రాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, స్టేడియాలు, కమ్యూనిటీ హాళ్లు, శ్మశానవాటికలు, ప్రార్థనాలయాలు, బ్యాంకులు, పోస్టాఫీసులు తదితరాలను అభివృద్ధి చేయాల్సి ఉంది. వీటిల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నప్పటికీ తొలివిడతగా ఫై ్లఓవర్ల వంటి వాటితో కూడిన ఎస్సార్‌డీపీ ప్రాజెక్టును, వరద కాలువల ఆధునీకరణ పనుల్ని చేపట్టాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుల కోసం నిధుల అవసరాన్ని నివేదికలో పొందుపరిచారు. ఇవి పూర్తయితే రాబోయే 30 ఏళ్ల పాటు ప్రజలు సౌకర్యవంతంగా జీవించవచ్చని భావిస్తున్నారు.
 
 పథకం: స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్‌మెంట్
 ప్లాన్(ఎస్సార్‌డీపీ)
 మొత్తం వ్యయం: రూ. 24,500 కోట్లు
 కాలపరిమితి: 5 ఏళ్లు
 ఆర్థిక సంస్థల ద్వారా రుణం: రూ. 17,150 కోట్లు(70 %)
 ఎన్‌బీడీ బ్రిక్స్ రుణం: రూ. 8,575 కోట్లు
 ఏఐఐబీ రుణం: రూ. 8,575 కోట్లు
 జీహెచ్‌ఎంసీ: రూ. 3,675 కోట్లు (15%)
 రాష్ట్ర ప్రభుత్వం: రూ. 3,675 కోట్లు (15%)
 
 ఎస్సార్‌డీపీలోని పనులు...
 - 6 స్కైవేలు: 111 కి.మీ.
 - 11 మేజర్ కారిడార్లు: 166 కి.మీ.
 - 68 మేజర్ రోడ్ సెక్షన్లు/లింకులు:
      348 కి.మీ.
 - 54 జంక్షన్ల వద్ద ఫై ్ల ఓవర్లు
      (గ్రేడ్ సెపరేటర్లు)
 - ఇతర రహదారులు: 1,400 కి.మీ.
 
 -ప్రాజెక్టు పూర్తయ్యాక  దిగువ ఫలితాలుంటాయని అంచనా.
 - హైదరాబాద్ నివాసయోగ్య నగరంగానే కాక అందరూ ఇష్టపడే నగరంగా మారుతుంది (లివబుల్ అండ్ లవబుల్ సిటీ).
 - ప్రయాణవేగం 30 నుంచి 40 కేఎంపీహెచ్ దాకా పెరగడమే కాక వాతావరణ కాలుష్యం తగ్గుతుంది.
 - స్కైవేలు, ఫ్లైఓవర్లు, కారిడార్ల ఏర్పాటుతో రాబోయే పదేళ్లలో 70 శాతం మేర సౌకర్యవంతమైన సాఫీ -ప్రయాణమే కాక 30 శాతం మేర సమయం, వాహన నిర్వహణ వ్యయం తగ్గుతుందని అంచనా.
 - పరిసరాలకు కొత్త అందాలిచ్చేలా స్కైవేల నిర్మాణం. రోడ్డు నెట్‌వర్క్ నిర్వహణ మెరుగవుతుంది.
 - 2011లో 70 లక్షలున్న గ్రేటర్ జనాభా 2041 నాటికి 1.40 కోట్లు(రెట్టింపు) కాగలదని అంచనాతో ఈ ప్రణాళికను రూపొందించారు.
 - ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారితో పాటు నగర ప్రయాణికులు 1.62 కోట్లకు చేరతారని అంచనా.
 - నగరంలో ప్రస్తుతం తిరుగుతున్న 26 లక్షల వాహనాలు 90 లక్షలకు చేరతాయని భావిస్తున్నారు.
 - ప్రజారవాణా వ్యవస్థను వినియోగించుకునే వారు 60 శాతానికి పెరుగుతారని అంచనా.
 
 పథకం: జీహెచ్‌ఎంసీలో వరద కాలువల ఆధునీకరణ
 మొత్తం వ్యయం: రూ. 6,754 కోట్లు
 కాలపరిమితి: 5 ఏళ్లు
 ఎన్‌డీబీ బ్రిక్స్ ద్వారా రుణం: రూ. 4,727.80 కోట్లు(70%)
 జీహెచ్‌ఎంసీ: రూ. 1,013.10 కోట్లు (15%)
 రాష్ట్ర ప్రభుత్వం: రూ. 1,013.10 కోట్లు (15%)
 వరద కాలువల ఆధునీకరణలో..
  స్వల్పకాలిక పనులు: 26 కి.మీ.
  మధ్యకాలిక పనులు: 47 కి.మీ.
  దీర్ఘకాలిక పనులు: 260 కి.మీ.
 ఈ పనులు పూర్తయితే వాననీటి కష్టాలు తీరడమే కాక పలు విధాలుగా ప్రజలకు సదుపాయం కలుగుతుంది. ధన, ప్రాణనష్టం తప్పుతుంది. వరద ముంపు సమస్యలుండవు. అంతిమంగా వివిధ అంశాల్లో నగరానికి మేలు కలుగుతుంది.
 
 వీటికే ఎందుకు ప్రాధాన్యం?
 ట్రాఫిక్ సమస్య వల్ల ప్రయాణంలో జాప్యం జరగడమే కాక వాతావరణకాలుష్యం, ప్రజల నైపుణ్యాలు, ఇతరత్రా అంశాల్లోనూ తీవ్ర ప్రభావం చూపుతోందని భావించి ఎస్సార్‌డీపీకి ప్రథమ ప్రాధాన్యతనిచ్చారు. వర్షం కురిస్తే నీరు వెళ్లే దారి లేకపోవడానికి తగిన విధంగా వరద కాలువలు లేకపోవడాన్ని గుర్తించి రెండో అంశంగా నాలాల ఆధునీకరణకు ప్రాధాన్యతనిచ్చారు.

Advertisement
 
Advertisement
 
Advertisement