టీ రైతు ఆత్మహత్యలు నివారించాలి

టీ రైతు ఆత్మహత్యలు నివారించాలి - Sakshi


సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలను నివారించడానికి చర్యలు చేపట్టాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు. రైతు ఆత్మహత్యల్లో విదర్భ తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం గత ఏడాది 800 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. అయితే రైతు ఆత్మహత్యలకు గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాలే కారణమన్నారు. చిన్న రాష్ట్రాల సమాఖ్య ఆధ్వర్యంలో ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన సదస్సులో కోదండరాం పాల్గొన్నారు.



అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు చనిపోవడంలేదని అనడంకన్నా ఆత్మహత్యలను గుర్తించి పరిష్కారాన్ని చూపించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. రైతు ఆత్మహత్యల నివారణపై ఆశించిన విధానాలు కనబడడంలేదని, వీటిని ఆపే ప్రయత్నం జరగాలని చెప్పారు. తెలంగాణ వచ్చినప్పటికీ నేటికీ ఆంధ్రా పాలకుల పెత్తనం కొనసాగుతోందన్నారు. రాష్ట్ర విభజన జరిగి 14 నెలలు దాటుతున్నా.. ఇంకా హైకోర్టు విభజన ప్రయత్నం కొనసాగుతూనే ఉందన్నారు.



చిన్న, కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు టీజేఏసీ పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు. రైతు సమస్యలపై జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా జరుగుతున్న ‘జై కిసాన్ ఆందోళన్’తో శాంతిభద్రతకు ముప్పు ఉందనే సాకుతో యోగేంద్ర యాదవ్‌ను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. చనిపోయిన రైతుల స్మారకాన్ని ఢిల్లీ రేస్‌కోర్సు క్లబ్‌లో ఏర్పాటు చేయాలని స్మారక స్థూపంతో బయలుదేరిన ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారని మండిపడ్డారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top