
చైతూ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నాగ్..!
నాగ చైతన్య, సమంత లు ఎక్కడ, ఎప్పుడు ఎలా వివాహం చేసుకుంటామన్నా తాము సిద్ధమేనని టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున స్పష్టం చేశారు.
హైదరాబాద్: కుమారుల పెళ్లిళ్ల విషయంలో నిర్ణయాన్ని వారికే వదిలేసిన టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. తాజాగా పెద్ద కుమారుడు, టాలీవుడ్ స్టార్ నాగచైతన్య, హీరోయిన్ సమంత పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చారు. వారు ఎపుడు చేసుకుంటానంటే అపుడు తాను కూడా సై అంటానని తేల్చేశారు. అంతా చైతూ ఇష్టప్రకారమే జరుగుతుందని వివరించారు. ఆయన తాజా చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’ విశేషాలను మీడియాకు వివరించిన నాగ్ ఈ ఇంట్లో పెళ్లి ముచ్చట్లనుకూడా పంచుకున్నారు.
చైతూ కోరుకున్నట్టుగానే జనవరిలో నిశ్చితార్థం చేశామని, మిగిలిన ఆ శుభకార్యాన్ని కూడా వారి ఇష్ట ప్రకారమే చేస్తామన్నారు. నాగ చైతన్య, సమంత లు ఎక్కడ, ఎప్పుడు ఎలా వివాహం చేసుకుంటామన్నా తాము సిద్ధమేనని స్పష్టం చేశారు. త్వరలో విడుదల కానున్న ఓం నమో వెంకటేశాయ మూవీ విశేషాలను వివరించిన ఆయన శ్రీవెంకటేశ్వరుడికి గొప్ప భక్తుడు అయిన హాథీరాం బాబా గురించి తనకు ఎక్కువగా తెలియదని చెప్పారు. అయినా ఈ పాత్ర ఇంత గొప్పగా రావడానికి చిత్ర యూనిట్ బాగా సహకరించిందని చెప్పారు. ఆయన గురించి తెలుసుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న మఠాలన్నింటిని చిత్ర బృందం పర్యటించి, వివరాలను సేకరించినట్టు చెప్పారు. ఈ చిత్రంలో తన పాత్రకు, వెంకటేశ్వరుడి పాత్ర ధారికి మధ్య జరిగే సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయన్నారు.
కాగా జనవరి 29న గ్రాండ్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్న తమ అభిమాన నటుల పెళ్లి కబురుకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ప్రేమపక్షులు ఆ శుభవార్త కాస్త ఎపుడు చెవిన వేస్తారో..వేచి చూడాలి.