
పోరాటాలతో ప్రజలకు దగ్గరవుదాం
కమ్యూనిస్టు ఉద్యమ పునరైక్యత ద్వారా పార్టీని దేశ ఎజెండాను నిర్ణయించే రాజకీయశక్తిగా మారుద్దామని సీపీఐ
సీపీఐ 90వ వ్యవస్థాపక దినోత్సవ సభలో సురవరం
కమ్యూనిస్టు ఉద్యమ చీలికతో నష్టం..
సాక్షి, హైదరాబాద్ : కమ్యూనిస్టు ఉద్యమ పునరైక్యత ద్వారా పార్టీని దేశ ఎజెండాను నిర్ణయించే రాజకీయశక్తిగా మారుద్దామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి పిలుపునిచ్చారు. దేశానికి కమ్యూనిస్టు ఉద్యమ పునరైక్యత నేడు అత్యంత అవసరమన్నారు. సమస్యలపై ఐక్య పోరాటాల ద్వారా ప్రజలకు దగ్గరై వారి విశ్వాసాన్ని చూరగొనే దిశలో కృషి చేయాలని కార్యకర్తలను కోరారు. గతంలో కమ్యూనిస్టు ఉద్యమ చీలిక తీవ్రనష్టాన్ని కలిగించిందన్నారు. ప్రస్తుతం కమ్యూనిస్టుల పునరైక్యతకు ఎదురయ్యే ఆటంకాలను పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఒకవైపు పార్లమెంటరీ వ్యవస్థలో భాగంగా ఎన్నికల్లో పాల్గొంటూనే, ఉద్యమాలు చేస్తూ ప్రజలను కూడా భాగస్వాములను చేస్తామన్నారు. అరకొర సంక్షేమ పథకాలతో పేదలకు ఎంగిలిమెతుకులు విసిరి మోసం చేసే విధానాలను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. శనివారం సీపీఐ 90వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా షాలిమార్ ఫంక్షన్‌హాలులో జరిగిన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఉదయం మఖ్దూంభవన్‌లో సురవరం పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. సాయంత్రం పార్టీ ప్రధానకార్యాలయం మఖ్దూంభవన్ నుంచి షాలీమార్ హాల్ వరకు పార్టీకార్యకర్తలు ర్యాలీని నిర్వహించారు.
హామీలు మరిచి పుష్కరాలు, యాగాలు
ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో సుధాకరరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయలేని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గోదావరి, కృష్ణా పుష్కరాల పేరిట.., యాగాల పేరిట సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. లౌకిక రాజ్యంలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం ఎంతమాత్రం సరికాదన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో పాటు అనేక పోరాటాలను నిర్వహించిన చరిత్ర సీపీఐదన్నారు.
దేశంలోనే అత్యంత సుదీర్ఘరాజకీయ చరిత్ర గలిగిన రెండో పార్టీ సీపీఐ అని, 9 దశాబ్దాల కాలంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, ఆయా దశలో నిర్ణాయకపాత్రను నిర్వహించిందని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాటయోధులు బూర్గుల నర్సింగరావు, చుక్కా రామయ్య, గార్లపాటి రఘుపతిరెడ్డి, ఎం.కె.మొహినుద్దీన్, జి.పిచ్చిరెడ్డి, సలాం షాహిది, శివారెడ్డి, వై.యాదగిరి, ఎండీ యూసుఫ్‌లను సన్మానించారు. సారంపల్లి మల్లారెడ్డి(సీపీఎం), ఉపేందర్‌రెడ్డి(ఎంసీపీఐ-యూ), నరహరి (ఎస్‌యూసీఐ-సీ), సీపీఐ నాయకులు అజీజ్‌పాషా, పల్లా వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్, పశ్యపద్మ, కందిమళ్ల ప్రతాపరెడ్డి, ఉజ్జిని రత్నాకరరావు, రాంనర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.