
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారు. ఆయన హయాంలోనే పాత జిల్లా అభివృద్ధికి బాటలు పడ్డాయి. ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు అనేకమంది అభాగ్యులకు వెలుగు లునిచ్చాయి.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జనం గుండెల్లో దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి పదిలంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం ఆయన హయాంలోనే బాటలు పడ్డాయి. పాత కరీంనగర్ జిల్లా అభివృద్ధికి పెద్దపీట వేసిన ఆయన జ్ఞాపకాలు ప్రజల్లో గుండెల్లో చిరస్థాయిగా ఉన్నాయి. జిల్లా అభివృద్ధికి నిరంతరం తపించిన ఆయన సుమారు 18 పర్యాయాలు జిల్లాలో పర్యటించారు. గతంలో ఏ ముఖ్యమంత్రికీ ఇది సాధ్యం కాలేదు. 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్సార్.. మొదటిసారిగా రాజీవ్ పల్లెబాటలో భాగంగా 2004 డిసెంబర్‌లో జిల్లాకు వచ్చారు.
అప్పటినుంచి 2009 జనవరి 30 వరకు 18 సార్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. జలయజ్ఞంలో భాగంగా ఎల్లంపల్లి శ్రీపాదసాగర్, మిడ్‌మానేరు, ఇందిరమ్మ వరదకాల్వ, శ్రీరాంసాగర్ రెండోదశ, ఎస్సారెస్పీ, కాకతీయ కాల్వల ఆ«ధునీకరణకు కోట్లాది రూపాయలు వెచ్చించారు. ఎల్లంపల్లి, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి జాతికి అంకితం చేసిన మహానుభావుడు దివంగత నేత వైఎస్సార్. ఆరోగ్యశ్రీ, 104, 108, ఫీజు రీయంబర్స్ మెంట్ తదితర పథకాలు ప్రజలు నేటికి నెమరు వేసుకుంటున్నారు.
వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట
వ్యవసాయానికి పెట్టింది పేరుగా ఉన్న కరీంనగర్ జిల్లాను ‘సీడ్ బౌల్ స్టేట్’గా మార్చేందుకు కృషి చేసింది వైఎస్సారే. అలాగే వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టుల కోసం పెద్దపీట వేశారు. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, ఎల్‌ఎండీ ప్రాజెక్టు ఆయకట్టును స్థిరీకరించాలనే లక్ష్యంతో ప్రధాన కాలువల ఆధునీకరణ పనులకు రూ.549.60 కోట్లు మంజూరు చేశారు. తెలంగాణ వరప్రదాయినిగా పేరున్న ‘ప్రాణహిత – చేవెళ్ల’ పథకానికి శ్రీకారం చుట్టారు. రూ.3,484 కోట్లతో భారీ వ్యయంతో మూడు ప్యాకేజీల పనులకు పన్నెండేళ్ల క్రితం ధర్మారం, చొప్పదండి ప్రాంతాలలో శంకుస్థాపన చేశారు.
దీని నిర్మాణం పూర్తయితే జిల్లాలో 3.05 లక్షల ఎకరాల బీడు భూములను సాగులోకి రావాలనేది ఆయన ఉద్దేశం. జలయజ్ఞంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ ప్రాజెక్టు నేడు పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల రైతులకు కల్పతరువుగా మారుతోంది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆయన హయాంలో పురుడుపోసుకున్న ప్రాణహిత చేవెళ్ల, మిడ్‌మానేరు, వరదకాల్వలు కీలకంగా మారుతున్నాయి. ఒకేసారి రూ.లక్ష రుణమాఫీ చేసిన వైఎస్సార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 4,98,785 రైతు కుటుంబాల్లో వెలుగులు నింపారు.
విద్యా, వైద్యరంగాలకూ భారీ నిధులు.. మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి
జిల్లాలో విద్యా, వైద్యరంగాలకు వైఎస్ కృషి మరవలేనిది. కరీంనగర్‌కు తలమానికంలా రెండు వేల ఎకరాల్లో శాతవాహన యూనివర్సిటీని మంజూరు చేసిన మహనేత. ఉన్నత విద్యను జిల్లా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురాగలిగారు. కరీంనగర్ శివారులో ఏర్పాటు చేసిన ఈ యూనివర్సిటీలో వందలాది మంది విద్యార్థులకు ఉన్నత చదువులకు అవకాశం దక్కింది. నేదునూర్‌లో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్‌కు ఆయన శంకుస్థాపన చేయగా.. ఆయన మరణంతో పెండింగ్‌లో పడింది. కరీంనగర్ నగరాన్ని కార్పొరేషన్‌గా మార్చారు. రాజీవ్‌రహదారిని నాలుగు లైన్లతో అభివృద్ధి చేశారు.
రూ.5 వేలకే రాజీవ్ గృహకల్పలో ఇల్లు..
రూ.5వేలకే రాజీవ్ గృహకల్పతో 1700 ఇళ్ల మంజూరు చేసి రూ.లక్ష రుణ సౌకర్యం కల్పించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 3.52 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. కరీంనగర్‌లో రూ.120 కోట్ల హడ్‌కో నిధులతో 6 రిజర్వాయర్లు, 2 ఫిల్టర్‌బెడ్‌లు మంజూరు చేశారు. కరీంనగర్ నగరంలో రూ.63 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టారు. రూ.6 కోట్లతో చింతకుంటలో ఎస్సీ గరŠల్స్ రెసిరెన్సియల్ పాఠశాల ఏర్పాటు చేశారు. ఎల్‌ఎండీ డ్యామ్ సమీపంలో బాల మేధావుల కోసం స్కూల్ ఆఫ్ ఎక్సెలెన్సీ మంజూరు చేశారు.
రైతులకు విద్యుత్ రుణమాఫీ, ఉచిత విద్యుత్ పథకం, ఎల్‌ఎండీ నుండి వేములవాడతోపాటు కరీంనగర్ మండలంలోని గ్రామాలకు మంచినీరు అందించిన ప్రదాత వైఎస్సార్. మంథని, కొండగట్టులో జేఎన్‌టీయూ ఏర్పాటు చేయించి.. పేద, బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు అండగా నిలిచారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లులా భావించిన వెఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చేసిన మేలును అన్నివర్గాల ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.