మహిళా హాస్టళ్లకు మరింత భద్రత

Women Safety Wing Plans To Maintain More Safety In Ladies Hostel - Sakshi

రాష్ట్రంలోని లేడీస్‌ హాస్టళ్లపై విమెన్‌ సేఫ్టీ వింగ్‌ నజర్‌

హాస్టళ్లలోని వర్కింగ్‌ విమెన్, విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు

అన్ని వివరాలతో రిజిస్టర్‌ రూపొందించాలని నిర్ణయం

తొలుత భాగ్యనగరం.. ఆపై రాష్ట్రవ్యాప్తంగా అమలు

రాష్ట్రంలో 15 వేల హాస్టళ్లు ఉంటాయని అంచనా.. షీ టీమ్స్‌ ద్వారా అవగాహన కార్యక్రమాలు  

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో కుప్పలు తెప్పలుగా లేడీస్‌ హాస్టళ్లు వెలుస్తున్నాయి. వీటిలో అధికశాతం హాస్టళ్లకు సరైన అనుమతులు ఉండవు. ఎలాంటి భద్రతా ప్రమాణాలూ పాటించవు. పార్కింగ్, ఫైర్‌సేఫ్టీ, ఫుడ్‌ విషయంలోనూ మెజారిటీ యాజ మాన్యాలు నిబంధనలను అమలు చేయడం లేదు. చాలామంది యాజమాన్యాలకు తమ హాస్టళ్లలో ఉండే మహిళలు, విద్యార్థినుల సంఖ్య, వారి చిరు నామాలు కూడా తెలియవు. ఇలాంటి హాస్టళ్లలో ఉండే వారికి భద్రత పెంచాలన్న సంకల్పంతో తెలంగాణ విమెన్‌సేఫ్టీ వింగ్‌ సరికొత్త కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని లేడీస్‌ హాస్టళ్లపైనా దృష్టి సారించింది. అన్ని జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలో కలిపి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 వేలకుపైగానే ఈ లేడీస్‌ హాస్టళ్లు ఉంటాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. 

కేసులైనప్పుడు ఇబ్బందులు..
లేడీస్‌ హాస్టళ్లలో వర్కింగ్‌ విమెన్స్, విద్యార్థినులు అదృశ్యమైనా, ఆత్మహత్యలకు పాల్పడినా.. వారిని ఎవరైనా వేధించినా, ఆ విషయం పోలీసుల దృష్టికి రావడంలో తీవ్రజాప్యం నెలకొంటోంది. నగలు, స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్టు వంటివి చోరీ అయినా.. చాలామంది తమ ఊరు కాదు కాబట్టి అస్సలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడంలేదు. ఇంట్లో వారి సంరక్షణ నుంచి హాస్టల్‌లోకి వచ్చాక సహజంగానే వారి సంరక్షణ యాజమాన్యాలు తీసుకోవాలి. కానీ చాలా తక్కువ హాస్టళ్లు మాత్రమే అలా చేస్తున్నాయి. 

చాలా హాస్టళ్లు డబ్బులు తీసుకున్నాక విద్యార్థుల బాగోగులు పట్టించుకోవడం లేదు. అందుకే ఇకపై అన్ని హాస్టల్‌ యాజమాన్యాలతో కలిపి ఓ రిజిస్టర్‌ను రూపొందించాలని విమెన్‌సేఫ్టీ వింగ్‌ నిర్ణయించింది. ఇందుకోసం కార్యాచరణ సిద్ధం చేసి, స్థానిక పోలీసుల సాయంతో దశలవారీగా ఈ రిజిస్టర్‌ రూపొందిస్తారు. అందులో హాస్టల్‌ యజమాని పేరు, అనుమతులున్నాయా? ఫైర్‌సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నారా? విద్యార్థుల చిరునామాలు సేకరించారా? 

సీసీ కెమెరాలు, పార్కింగ్‌ తదితర విషయాల్లో ప్రమాణాలకు లోబడి ఉన్నారా? లేదా? ఎలాంటి ఆహారం పెడుతున్నారు? అన్న విషయాలు పొందుపరుస్తారు. అంతేగాకుండా ఈ అన్ని హాస్టళ్ల విద్యార్థులకు ఆపదలు ఎదురైనపుడు ఎలా ఎదుర్కోవాలి? ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలి? పోకిరీ వేధింపులు, సైబర్‌ వేధింపులు ఎదురైనపుడు ఎలా వ్యవహరించాలి? తదితర విషయాలపై షీటీమ్స్‌ ఆధ్వర్యంలో పూర్తి అవగాహన కల్పిస్తారు.

ముందుగా భాగ్యనగరంలోనే..
ఈ రిజిస్టర్‌ అమలు తొలుత హైదరాబాద్‌ కమిషనరేట్‌లోనే మొదలుకానుంది. ముందుగా అమీర్‌పేట, ఎస్సార్‌ నగర్‌ ఏరియాల్లో ప్రారంభించనున్నారు. ఈ రెండు ప్రాంతాల్లోనే దాదాపు 3 వేల హాస్టళ్లు ఉంటాయని పోలీసుల అంచనా. ఇక హైదరాబాద్‌ కమిషనరేట్, సైబరాబాద్, రాచకొండ ఏరియాలు కలిపితే 10 వేల వరకు హాస్టళ్లు ఉంటాయని సమాచారం. ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి మరో 5 వేలు అంటే మొత్తం 15 వేల వరకు హాస్టళ్లు ఉంటాయని, అన్నింటి పూర్తి వివరాలు సేకరించాలని విమెన్‌సేఫ్టీ వింగ్‌ నిర్ణయించింది.

దర్యాప్తులో ఇబ్బందులు తొలగించేందుకే: సుమతి, ఎస్పీ, విమెన్‌సేఫ్టీ వింగ్‌
చాలామంది హాస్టల్‌ నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదు. తమ హాస్టల్లో ఉండేవారి వివరాలు కూడా సరిగా నమోదు చేయడం లేదు. ఇలాంటి కారణాల వల్ల మిస్సింగ్‌ కేసులు, చోరీ కేసుల దర్యాప్తులో పోలీసులకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. తల్లిదండ్రులకు దూరంగా ఉన్న చాలామంది తమకు వేధింపులు ఎదురైనా మౌనంగా భరిస్తున్నారు. ఇకపై ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నదే మా లక్ష్యం.

హాస్టల్‌లో ఉండే ఆడవారి రక్షణ మా ధ్యేయం: స్వాతి లక్రా, ఐజీ, విమెన్‌సేఫ్టీ వింగ్‌
తల్లిదండ్రులకు దూరంగా ఉన్న ఆడవారి భద్రతే మా ధ్యేయం. ఇలా హాస్టళ్లలో ఉండే చాలామంది వేధింపులు ఎదుర్కొంటున్నా.. వాటిని అటు ఇంట్లోనూ, ఇటు పోలీసులకూ తెలియపరచడం లేదు. దీన్ని అలుసుగా తీసుకుని పోకిరీలు మరింత చెలరేగుతున్నారు. అందుకే ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా షీటీమ్స్‌ని ఆశ్రయించేలా వారికి చట్టాలపై అవగాహన కల్పిస్తాం. అందుకే ఈ రిజిస్టర్‌ రూపొందించే ప్రయత్నాలు మొదలుపెట్టాం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top